‘‘తాత గారూ నేను మీ దగ్గరే వుండి చదువుకుంటాను. అమ్మ అస్తమానూ చదువుకో, చదువుకో అని చంపుకుతింటుంది’’అంటోంది రావు గారి ఒడిలో మనవరాలు కూర్చుని. పాప యూకేజీ చదువుతోంది. పండగకి వచ్చారు. తాత గారి మెడకు తన బుల్లి చేతులను చుట్టి కూర్చుంది. అసలు కన్నా కొసరు ఎక్కువ లాగా తన కూతురు ఇదే పద్ధతిలో తన దగ్గర గారాలు పోయినప్పటికన్నా ఇప్పుడు తన మనవరాలి అనురాగ స్పర్శ ఆయన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది.‘‘తప్పు, నువ్వు అలా అనకూడదమ్మా. నువ్వు బాగా చదువుకుని, పెద్దఉద్యోగంతో అమెరికా వెళ్లిపోవాలి. బోల్డు డబ్బు సంపాదించాలి. హాయిగా బతకాలి’’అంటున్న ఆయన మాటలకు అడ్డు వచ్చి.‘‘తాతగారూ మనం అమెరికా వెళ్లకపోతే బోల్డు డబ్బు సంపాదించలేమా? డబ్బు సంపాదించాక హాయిగా ఎలా బతుకుతాను? దాని వలన అమ్మకు నాన్నకు ఏం ఉపయోగం?’’ఆ పాప ప్రశ్నలకు జవాబు చెప్పాలంటే, జవాబు చెప్పే వయసు రావుగారికి వున్నా, ఆ జవాబును జీర్ణించుకునే శక్తి ఆ పాపకు లేదు. అందుకని ఆమె మనసు మళ్లించాలని-‘‘పింకీ నీకు ఓ మంచి మాట చెప్తాను.

 నువ్వు రోజూ పొద్దున లేవగానేఏం చేస్తావే.’’‘‘రాత్రేమో త్వరగా నిద్రపోను, హోమ్‌ వర్క్‌ పూర్తి చేసేస్తేనే కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడుకోనిస్తానంటుంది అమ్మ. అది పూర్తి అయ్యేటప్పటికి భోజనం టైమయిపోతుంది. వెంటనే కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడుకుంటుంటే అమ్మ అన్నం తినిపిస్తుంది. అలాగ పడుకునేటప్పటికి చాలా ఆలస్యమైపోతుంది. అందువలన ఉదయం లేవలేను. అమ్మేమో నన్ను కేకలేస్తూ నిద్రలేపుతుంది. చాలా సార్లు ఏడుస్తూ నిద్రలేస్తాను’’అంది పింకీ.‘‘అలా కాదమ్మా రేపటి నుంచి నిద్ర పోయేటప్పుడు నేను రేపు అమ్మ నిద్రలేపకుండా, నేనే లేచిపోవాలి’’అని పదిసార్లు మనసులో అనుకుని పడుకో. అంతే’’ నీ తల దగ్గర గడియారం అలారం కొట్టినప్పుడు లేచినట్లుగా’’లేచిపోతావ్‌.’’అన్నారు.‘‘బలె బలే తాతయ్యా- ’’అంటూ సంబరంతో పింకీ ముఖంవెలిగిపోతోంది.‘‘అలా నిద్ర లేవగానే, నీ రెండు అరచేతులూ కళ్లకద్దుకుని కరాగ్రేవసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతీ, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కర దర్శనం’’అని ప్రార్థించాలి. ఆ తర్వాత అరచేయి కళ్లకద్దుకోవాలి. అంటే మన చేతిలోనే లక్ష్మీదేవి, సరస్వతీ దేవి, పార్వతీ దేవి వున్నారు. అందువలన ఉదయాన్నే వాళ్లను కళ్లకద్దుకుంటే మనకు డబ్బు, విద్య, కోరికలు తీరుతాయి.’’‘‘అవునా. నేను ఇక నుంచి అలానే చేస్తాను. నాకు కాగితం మీద ఆ శ్లోకం రాసి ఇవ్వండి తాతగారూ. రోజూ పొద్దున్నే నన్ను తిట్టుకుంటూ లేపొద్దని అమ్మకి చెప్పండి’’అంది బుంగ మూతి పెట్టుకుని.