పుస్తకాలు బ్యాగులో సర్దుకుని అమ్మ ఇచ్చిన లంచ్‌ బాక్స్‌ తీసుకొని ఎప్పటికిమల్లే ‘‘వెళ్లొస్తానమ్మా’’ అంది రమ. గడప దాటి కాలు బైటపెడుతున్నపడు అమ్మ నాన్నతో అంటున్న మాటలు వినిపించాయి. ‘‘ఈ కాలంలో పుట్టాల్సిన పిల్ల కాదండి. ఎంత బుద్ధిమంతురాలో. మన సంస్కృతీ సంప్రదాయాల్ని గౌరవించే కూతురుండడం మన పూర్వజన్మ సుకృతమండీ...అందునా ఈ రోజుల్లో....’’రమ బియస్సీ రెండో సంవత్సరంలో వుంది.మొదటి పీరియడ్‌ బాటనీ...లెక్చరర్‌ కీటకాల్ని తినే మొక్కల గురించి పాఠం చెపుతోంది.‘‘పైకి అమాయకంగా కనిపించే మొక్కలు కీటకాల్ని రకరకాల ప్రలోభాలకు లోనుచేసి- ఆకర్షించి-మరలా తప్పించుకోడానికి వీలులేకుండా బంధించి-చంపేస్తాయి. వీటిని మాంసాహార మొక్కలని అంటారు. ఉదాహరణకు పీచర్‌ ప్లాంట్‌... ఇది వెదజల్లే సువాసనలకు ఆకర్షించబడి కీటకాలు దీని లోపలకి ప్రవేశిస్తాయి. లోపల అగాథంలా వుంటుంది. లోపలికెళ్లిన కీటకం బైటకి రాలేదు. బైటకి రావడానికి శతవిధాలా ప్రయత్నించి ఓడిపోయి, అడుగున వున్న నీళ్లలో పడి చచ్చిపోయి ఆ మొక్కకు ఆహారంగా మారుతుంది. వీనస్‌ ఫ్లై ట్రాప్‌ అనే మొక్క తనకున్న అందమైన రంగుల్తో కీటకాల్ని ఆకర్షిస్తుంది. కీటకం లోపలికి రాగానే ఇనుప తలుపులు మూసుకున్నట్లు దాని ఆకులు మూసుకుపోయి, వాటి మధ్యలో కీటకం నలిగిపోయి చనిపోతుంది. మెల్లమెల్లగా ఈ మొక్క కీటకాన్ని జీర్ణం చేసుకుంటుంది’’‘‘ఈ పీరియడ్‌ కాగానే బైటికెళ్దాం రావే’’ అంది స్వప్న గుసగుసగా‘‘ఎక్కడికి?’’‘‘మొదట బైటపడదాం. తర్వాత చెప్తాను ఎక్కడికో’’‘‘అమ్మో నెక్ట్స్‌ పీరియడ్‌ కెమిస్ర్టీ. నేను రాను’’ దిగువ మధ్య తరగతికి చెందిన రమకు చదువు ప్రాముఖ్యత తెలుసు. చదివి ఉద్యోగం తెచ్చుకుంటేనే బతుకు...లేకపోతే భవిష్యత్తంతా అంధకారమే...‘‘అబ్బా... చదువులో ఏముందే... బోర్‌. జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలి. క్లాసులు బంక్‌ కొట్టని బతుకూ ఓ బతుకేనా? ప్లీజ్‌ రావే. మన స్నేహం కోసం ఇంత చిన్నపాటి త్యాగం కూడా చేయలేవా?’’రమ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా కెమిస్ర్టీ లెక్చరర్‌ వచ్చేలోపల బలవంతంగా క్లాసు బైటికి లాక్కొచ్చింది స్వప్న. స్నేహితురాలి కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా అని సర్దిచెపకుంది రమ.