అది స్వర్గం.అది నరకం.అది అమృతాల అధరామృతాల జీవనది.అది కాలకూట విషాల ఊటబావి.అక్కడ అప్సరసలు అర్ధనగ్నలాస్యాలు చేస్తారు.అక్కడ మనిషి రక్తపు రుచిమరిగిన రాక్షసులు విలయతాండవం చేస్తారు.అక్కడ మనుషులుంటారు. మనుషుల్ని తినేవాళ్లుంటారు.ఆ స్వర్గం పేరు, ఆ నరకం పేరు....‘‘నవభారత్‌ విలాస్‌!’’ఆ పట్టణంలో పేరు మోసిన ‘‘బోర్డింగ్‌ మరియు లాడ్జింగ్‌!’’విందులకీ, వినోదాలకీ విఖ్యాతి పొందిన ఆ ‘‘నవభారత్‌ విలాస్‌’’లో ఆ వేళ రాత్రి తొమ్మిదిగంటల వేళ ఎనిమిదో నంబర్‌ సింగిల్‌ రూమ్‌లో-అలవాటు ప్రకారం హడా విడిగా లోపలకడుగెట్టిన బాయ్‌ రంగడు-చటుక్కున అడుగు వెనక్కి వేసి,నాలిక్కరుచుకుని, తెల్లబోయి నుంచున్నాడు!ఆ సింగిల్‌ రూమ్‌లో ఉన్న సింగిల్‌ బెడ్‌ మీద పడుకున్న వాళ్లిద్దరూ వొళ్లు మరిచిపోయారు. వొళ్లు బలిసిన మగాడికి కళ్లు కనపడ్డంలేదు. కళ్లు మూసుకున్న ఆడదాని వంటి మీద సగం మేరకి గుడ్డల్లేవు.తెల్లబోయి నుంచున్న రంగడు తేరుకోకముందే అవతారం లేచి, ‘‘ఒరేయ్‌ వష్‌ చావా!.....ఇంకో షీసా...మన బ్రాండ్‌ నీకు తెలుసుగా..?’’ అన్నాడు. అవతారం ఆ మగాడి పేరు.‘‘సారీ సార్‌!’’ అన్నాడు రంగడు‘‘ఏమిరా, కొంపదీషి షీసాల్లేవా ఏం?’’‘‘అది గాదు సార్‌! పొరపాటున....చూడకుండా లోపలికొచ్చేశాను....’’అవతారం వికటాట్టహాసం చేశాడు. చేసి- ‘‘ఓష్‌! ఇంతే గదా....ఏం ఫర్వాలేదు... ఎంత మంది చూసినా మనకేం భయంలేదు...మన సంగతి నీకు తెలుసుగా. అయినా ఇంకా ఏం లేదులే. ఇంకో బుడ్డి తగిలిస్తే గాని లాభం లేదు. నువ్వు అరనిమిషంలో రావాలి...పరిగెత్తి....’’రంగడు పరిగెత్తేలోగా కళ్లు మూసుకు పడుకున్న ఆడది-కళ్లు సగం విప్పి, సగం లేచి, సగం నవ్వి-‘‘బావ గారికి మరీ ఆత్రమెక్కువ. తలుపైనా బిగించకుండా...’’ మిగతా సగం మాటలూ మింగేసింది.దాని పేరు మాణిక్యం.రంగడు రూమ్‌లోంచి బయటికొచ్చాడు.

అవతారం పూర్తి పేరు శేషావతారం. చూడ్డానికి వరాహావతారంలా ఉంటాడు. ఇది వరకు చాలా అవతారాలెత్తి చాలా చాలా ఘనకార్యాలు చేశాడు. లేటెస్టు అవతారం-‘‘సహకార సంఘాధ్యక్షుడు’’. అవతారానికి సహకార పద్ధతి మీద మంచి విశ్వాసముంది. అందుకే మరి కొందరు పెద్దల సహకారంతో-రైతులకు పంచాల్సిన ఎరువులు, ఋణాలూ చాలా జాగ్రత్తగా స్వాహా చేసి ప్రజా సేవ చేస్తున్నాడు. ఈ రకంగా నానా గడ్డీ తిని, గడ్డిని పెంచే ఎరువులు కూడా తినేసి, తిన్నదంతా అరిగించుకోవడం కోసం అడపా దడపా పట్నమొచ్చి, ‘‘నవభారత్‌ విలాస్‌‘‘ భోజన మరియు విశ్రాంతి గృహంలో విశ్రాంతి తీసుకుంటాడు-అవతారం.అవతారం అర్జంటుగా తెమ్మన్న బుడ్డీ కోసం త్వర త్వరగా నడుస్తున్న రంగణ్ని, పన్నెండో నంబరు గదిలోంచి పిలిచారు. రంగడు ఆ గదిలోకి వెళ్లాడు.గదిలో ముగ్గురున్నారు. వాళ్ల చుట్టూ సిగరెట్‌ పీకలున్నాయి. వాళ్ల చేతుల్లో పేకముక్కలున్నాయి. అందుబాటులో బుడ్లూ, గ్లాసులూ ఉన్నాయి. ముగ్గురి ముందూ రూపాయల కట్టలున్నాయి. గదినిండా-సిగరెట్‌ పొగ ఉంది.