‘‘వొ జబ్‌ యాద్‌ ఆయే..బహుత్‌ యాద్‌ ఆయే’’పాట మధురంగా వినిపిస్తుంటే, మెస్‌ నుండి హాస్టల్‌కి వస్తున్న మాళవి కాళ్ళు ఆగిపోయాయి. ఆమెతో బాటు వస్తున్న శ్రీజ, ఫాతిమా, సౌజన్య కూడా ఆగారు.యూనివర్సిటీ బాయిస్‌ హాస్టల్‌ సమీపంలో నలుగురు అబ్బాయిలు కలిసి ఆ పాతపాట ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఫీమేల్‌ గొంతు వినిపిస్తోంది. కానీ అక్కడ అమ్మాయిలెవరూ కన్పించలేదు.

మగర్‌ రోతె రోతే హసీ ఆగయీ హైఖయాలోం మె ఆకే ఓ జబ్‌ ముస్కురాయే..‘‘ఏయ్‌! మాళవీ! నేను చెప్పలా అరవింద్‌, అతనే... ఫీమేల్‌ గొంతుతో పాడతాడు. రా! వెళ్దాం’ అంది సౌజన్య.‘రాత్రి పూట.. మన మెందుకు? ఇక్కడి నుండే విందాం’ అంది ఫాతిమా.‘పర్లేదు రండే!’’ సౌజన్య ముందుకు నడిచింది. అందరూ అనుస రించారు.‘‘సౌజన్యా!’’ ఏంటీ సర్‌ప్రైజ్‌ విజిట్‌.. చాలా రోజులైంది కన్పించి’’ అన్నాడు గిటార్‌ వాయి స్తున్న రవి.‘‘నేనిక్కడే ఉన్నాను. నువ్వే కనిపించటం లేదు’’ అంది.‘‘ఇతను నీకు ముందే తెలుసా!’’‘‘రవిది మా ఊరు దగ్గరే. బై ద బై.... రవీ! దిసీజ్‌ మాళవి! ఫాతిమా అండ్‌ శ్రీజా, మా క్లాస్‌ మేట్స్‌’’ పరిచయం చేసింది. తర్వాత అటునుంచి పరిచయాలు మొదలయ్యాయి.ఇతను అరవింద్‌. పొలిటికల్‌ సైన్సులో ఎం.ఫిల్‌ చేస్తున్నాడు. మేల్‌వాయిస్‌, ఫీమేల్‌వాయిస్‌లతో పాడతాడు. స్టేజ్‌ ప్రోగ్రాంలు ఇస్తుం టాడు. మంచి సింగర్‌’’.‘‘హలో!’’ అంది మాళవి.‘‘హాయ్‌’’ అన్నాడు సభ్యతగా.

చామనఛాయ, కర్లింగ్‌ హెయిర్‌, లైట్‌గా పెరి గిన గడ్డం, ఆరడుగుల ఎత్తు, కళ్ళలో ఏదో స్పార్క్‌... జీన్స్‌, టీ షర్టులో క్యాజువల్‌గా ఉన్నాడు.‘‘మాళవి పాటలు బాగా పాడుతుంది. కర్నా టక సంగీతం నేర్చుకుంది’’ చెప్పింది సౌజన్య.‘‘అయితే మీరూ పాడండి!’’ అన్నారు అబ్బాయిలంతా.‘‘అయ్యయ్యో! నాకు హిందీ పాటలు రావు’’ అంది మొహమాటంగా.‘‘మంచి తెలుగు పాటే పాడండి’’ అన్నాడు అరవింద్‌.‘‘నో! మీరు కంటిన్యూ చెయ్యండి, మీ వాయిస్‌ వినాలని వచ్చాం’’.వెంటనే అరవింద్‌ ఫీమేల్‌ వాయిస్‌లో మొదలుపెట్టి వొ జబ్‌ యాద్‌ ఆయే పాట రెండు గొంతుల్తో తనే పాడి కంప్లీట్‌ చేశాడు.