‘‘మీరెప్పుడయినా సాని వీధి వెళ్ళారా?’’ హఠాత్తుగా అడిగింది సుష్మ.అటువంటి ప్రశ్నను ఊహించని బాలు ఉలిక్కిపడ్డాడు.శుభమాని దంపతులు ఒకరికొకరు సమస్తమూ మనస్ఫూర్తిగా అర్పించుకునే శుభ క్షణంలో ఓ భార్య తన చెంతకు వచ్చిన భర్తను... అడిగిన ప్రశ్న...‘సుష్మ-బాలు’లది సంప్రదాయబద్ధమైన వివాహం... రెండువైపుల వారికీ సంపూర్ణంగా నచ్చిన సంబంధం... ఏవేవో కారణాల వల్ల శోభనం మాత్రం రెండుసార్లు వాయిదా పడింది.ముచ్చటగా మూడోసారి మాత్రం ఎటువంటి అవరోధాలు లేకుండా ముహూర్తం ఖాయ మైంది. శోభాయమానంగా తయారుచేసిన పడకటింటిలోకి ఆలుమగలైన సుష్మ, బాలులను పంపి తలుపులు బిడాయించారు.పూల పానుపుపై చేరిన తొలి క్షణమే సుష్మ నోటి వెంట వెలువడిన ప్రశ్న... అది...ఎవరూ అడగరాని మాట... ఎదురుచూడని ప్రశ్న. అదీ తనువులు పంచుకునే సుమధర మైన వేళలో బయటపడ్డంతో బాలు మనసంతా కకావికలైంది.‘‘ఈ కమ్మని రేయి అడగాల్సింది ఇదా సుష్మా!’’ చనువు ప్రదర్శిస్తూ దగ్గరగా వెళ్ళి అడిగాడు బాలు.‘‘దూరం.. దూరం... నన్ను ముట్టుకోవద్దు... నేనీ ప్రశ్నను ఈ తొలిరేయి అడగాలనే అడిగాను... మీ నుండి జవాబు నాక్కావాలి...’’ సూటిగా అంది సుష్మ.‘‘పాలు చల్లారిపోతున్నాయి... స్వీట్లు ఊరిస్తున్నాయి. మరి నువ్వు కూడా నన్ను...’’ సుష్మను చేతుల్లోకి తీసుకోబోయే సరికి ఒడుపుగా తప్పించుకున్నది.అలా జరుగుతుందని బాలు ఊహించలేదు. అతన్ని నిరాశ చుట్టేసింది. 

‘‘చెప్పండి సాని వీధి వెళ్ళారాలేదా!’’ ఈసారి ఆమె కంఠంలో కొద్దిగా నిలదీసిన భావం బహిర్గత మయింది.‘‘సుష్మా! మనిద్దరినీ ఈ గదిలో ఏకాంతంగా బంధించటం... తెల్లారేదాకా అద్భుతమైన అనుభవాలు పంచుకోమని... కమ్మని ఊసులాడుకోమని’’ అని చెప్పాడు.కాని, సుష్మలో ఎటువంటి స్పందన లేదు.పెదవులపై విరబూసిన దరహాస చంద్రికలతో తనను స్వర్గలోకంలోకి ఆహ్వానిస్తుం దని...అలవోకగా జార్చిన పైటతో కనిపించి ‘నన్ను మీ సందిట బంధించరూ!!’ అంటూ సాక్షాత్కరిస్తుందని..తన చేతి వేళ్ళకి చిలకలు చుట్టి నోటికి అందిస్తుంటే తనామె వేళ్ళని చిలిపిగా కొరికితే ఆమె చిరు కేకలు వేసి తనని వెనక్కి తోసి తన ఎద మీద పడి ఉక్కిరిబిక్కిరి చేస్తుందని... తీయని ఆశలతో ఎదురు చూశాడు.కాని పడక మీదకి చేరీ చేరగానే ఆ ప్రశ్న సంధించటంతో సందిగ్ధంలో కొట్టుకులాడాడు.శుభ ముహర్తం పేరుతో ఒంటిగంట దాటింది. మిగతాకాలం ఈ విధంగా వృధా అవుతోంది.‘‘సుష్మా! నువ్వు వేసిన ప్రశ్న నన్ను పరీక్షించటానికో, నా మీద నమ్మకం లేనందుకో వేసినట్లు కనిపిస్తుంది... ప్లీజ్‌! ఈ తొలిరేయిని ఈ విధంగా చేయకు...’’ కొద్దిగా ముందుకు జరిగి అన్నాడు బాలు...‘‘నేనడిగిన ప్రశ్నకు మీరీక్షణమే కాదు. రేపు, ఎల్లుండి లోగా జవాబీయవచ్చు! నాకు మీ దగ్గర్నుండి వచ్చే జవాబు సంతృప్తిని ఇవ్వాలి. అప్పుడు నాకు నేనుగా మీలో ఐక్యం అయిపోతాను. అంతవరకూ నన్ను ముట్టుకోడానికి సాహసించి అభాసుపాలు కావద్దు...’’ అనేసి అటు తిరిగి పడుకుండి పోయింది సుష్మ.