కళ్ళు మూసుకుని, సోఫాలో వెనక్కి చేరగిలబడి కూర్చుని ఉన్నాడు వెంకట్రావు. ‘‘ఏమిట్రా అంత నీరసంగా ఉన్నావు?’’ అడిగాడు లోపలి కొస్తూనే రామారావు.‘‘నిన్న ‘అవినీతి వ్యతిరేక పోరాట సమితి’ వాళ్ళ నిరాహారదీక్షా శిబిరంలో కూర్చున్నాను’’ నిర్లిప్తంగా సమాధానం చెప్పాడు వెంకట్రావు.‘‘అవినీతి వ్యతిరేక పోరాటం బాగానే ఉందనుకో, కానీ మనశక్తి, ఓపిక గురించి కూడా ఆలోచించుకోవాలి కదా!’’ వెంకట్రావు పక్కన కూర్చుంటూ అన్నాడు రామారావు.‘‘కడుపు మండి, ఆవేశం పట్టలేక, నా నిరసనని తెలియజెయ్యడానికి ఇదే అవకాశం అనుకుని వెళ్ళి కూర్చున్నాను’’.‘‘అంత కడుపుమండే పరిస్థితేం వచ్చింది?’’‘‘ఆ స్థలం కొనుగోలు వ్యవహారంలో రిజిస్ట్రేషను గురించి వివరాలు కనుక్కుందామని వెళ్ళాను. ఎక్కడ చూసినా లంచాలే! అయితే లంచం అనకుండా దానికి ఇంకేదో అందమైన పేరు పెడతారు’’.‘‘పని చెయ్యవలసిన వాడు డిమాండ్‌ చేస్తున్నప్పుడు ఇవ్వడం కాక మనం చెయ్యగలిగింది ఏముంది?’’‘‘లంచం తీసుకునేవాడిదే కాదు. ఇచ్చేవాడిది కూడా తప్పే అంటున్నారు అన్నాహజారేగారు. ఇవ్వడానికి మనసొసు ఒప్పదు. కానీ ఇవ్వకపోతే పనులు కావు..’’‘‘అందుకే కదా ఇవాళ మన దేశంలో అవినీతి వ్యతిరేక పోరాటం ఇంత ఉద్ధృతంగా జరుగుతోంది.

 ప్రపంచ చరిత్రలో ఏ విప్లవమైనా సామాన్య ప్రజలలో కలిగిన చైతన్యం వల్ల, సామాన్య ప్రజలు తిరగబడడం వల్లనే సఫలీకృతమైంది. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారానికి కూడా మనలాంటి సామాన్య ప్రజలే స్పందించి, గాంధీమార్గంలో నిరాహారదీక్షలు చేసి పోరాడాలి. ఇటువంటి జాడ్యాలని సమూలంగా నాశనం చెయ్యాలి’’ ఆవేశంగా చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చి ఆయాసంతో ఆగాడు రామారావు.ఉన్నట్టుండి కిటికీలోంచి ఒక కోతి లోపలికి దూకింది. వెంకట్రావు, రామారావు ఉలిక్కిపడి లేచి నిల్చున్నారు. ‘‘కూర్చోండి. కూర్చోండి’’ అంటూ కోతి వాళ్ళ కెదురుగా కుర్చీలో కూర్చుంది.వెంకట్రావు, రామారావు మొహమొహాలు చూసుకుని, భయంభయంగా కూర్చున్నారు.‘‘ఎవరు స్వామీ మీరు. ఇంత హఠాత్తుగా ఊడిపడ్డారు?’’ వినయంగా అడిగాడు రామారావు.‘‘నేను గాంధీగారి మూడు కోతుల్లో ఒకదాన్ని. మీ మాటల్లో మా గురువు గారి పేరు విన్పించడంతో ఇటు వచ్చాను’’ అంది కోతి.‘‘ఒక్కదానివే వచ్చావేం? నీ స్నేహితులేరీ?’’ అడిగాడు వెంకట్రావు.