ఆ రోజే బిజినెస్‌ టూర్‌ నుంచి వచ్చిన రవికి ఆఫీసుకి వెళ్ళాలనిపించలేదు.భోజనం చేసి సాయంకాలం వరకు పడుకుండిపోయాడు. లేచి ఫ్రెష్‌ అయి కూర్చునే సరికి శ్రీమతి సీత కాఫీ తెచ్చి అందించింది.అతను కాఫీ తాగుతుంటే ఎదురుగా కూర్చుని-‘‘అలసట తీరిందా?’’ అని అడిగింది.తీరిందన్నట్లు తలూపి ‘‘ఏం’’ అని అడిగాడు రవి.

‘‘ఏం లేదు. రెండు మూడు సరుకులు తెచ్చుకోవాలి. అలా బిగ్‌బజార్‌ వెళ్ళొద్దాం వస్తారేమోననీ’’ సీత అంది భర్త వైపు చూస్తూ.రవి కాఫీ త్రాగటం పూర్తి చేసి కాఫీ కప్పు ఎదురుగా టీపాయ్‌ మీద పెట్టాడు.‘‘మీక్కూడా రిలాక్స్‌గా ఉంటుందేమోననీ....’’ అంటూ ఆపేసింది.రవికి భార్య అంటే అందుకే ఇష్టం. ఏదీ డిమాండ్‌ చేయదు. అందుకే ఆమె అడిగిందానికి కాదనడు.ఇప్పుడూ అదే జరిగింది. ‘‘సరే మరి...రెడీ అవ్వు!’’ అన్నాడు తను కూడా లేస్తూ.సీత మొహంలో వెలుగు కనపడిందతనికి.చిన్న విషయానికే సంతోషపడిపోతుంది.సీత కొడుకుని పిలిచింది. 

‘‘చందూ! నాన్నగారూ నేనూ అలా బిగ్‌బజార్‌కి వెళ్ళొస్తాం. నువ్వు వస్తావా?’’ అనడిగింది.‘‘లేదమ్మా! చదువుకోవాల్సింది చాలా ఉంది. పైగా నానమ్మకి తోడుండాలి కదా?’’ అన్నాడతను.‘‘జాగ్రత్తగా చదువుకో! నానమ్మ జాగ్రత్త’’ అంటూ సీత తను కూడా రెడీ కావటానికి లేచింది.రవి తల్లికి డెబ్భై అయిదు సంవత్సరాలుంటాయి. ఆ ఇంట్లో అందరికీ ఆమె అంటే ఎంతో గౌరవం, అభిమానం.రోజూ ఆవిడకు ఒంటరితనం అనే ఫీలింగ్‌ రాకుండా ఎవరికివీలయితే వాళ్ళు రోజూ ఆవిడతో కాసేపు గడుపుతారు. అది వాళ్ళు ఏర్పరుచుకున్న నిబంధన.అలా నిబంధన ఏర్పరుచుకోవటం ఒక్కటే కాదు. అది తూచా తప్పకుండా అమలుచేస్తారు.‘‘నేను చాలా అదృష్టవంతురాలినమ్మా! కొడుకూ-కోడలూ-మనవడూ ఇంతగా ప్రేమిస్తూ ఆదరిస్తున్నారంటే ఎంత సంతోషంగా ఉందో తెల్సా? వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల్ని పిల్లలు భారంగా అనుకుంటున్న ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళుండటం నిజంగా అదృష్టం. మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టకుండా వెళ్ళిపోతే అంతే చాలు!’’ అంటుందావిడ కోడలితో.అందుకు సీత నొచ్చుకుంటూ-‘‘అదేమిటి అత్తయ్యగారూ! ఇంటికి మీలాంటి వాళ్ళు పెద్ద దిక్కుగా ఉండటం ఎంత నిండుతనం. అయినా మా అమ్మే అయితే చూసుకోనూ?’’ అంటుంది.