‘ఎందుకు? కలవాలన్నావట’’అతనికి తన వైపు చూడాలనున్నా చూడటం లేదని అర్థమవుతోంది.‘‘ఇప్పుడు కాదు. రెండేళ్ళ నించీ అనుకుంటున్నాను’’ దిక్కుతోచనట్టుగా కదలాడుతున్న అతని కనుపాపల్నే చూస్తూ అంది ప్రియ.‘‘అదే ఎందుకు?’’‘‘ఎందుకో నీకు తెలీదా? కానీ నేను కలవాలనుకున్నది మాత్రం ఆ కారణంగా కాదు.’’ఒక్క క్షణం ఆమె కళ్ళలోకి చూశాడు విశ్వ, ఆ మాటల వెనక అసలు అర్థాన్ని వెతకడం కోసం. తర్వాత-‘‘అర్థమయీ అవ్వకపోవడం నీకెప్పడూ అలవాటేగా.’’‘‘అది మీ కవుల పని.’’‘‘చెప్పేదేదో సూటిగా చెప్పు.’’ ఎప్పట్లాగే పరాజయపు పరావర్తనం, చిరుకోపంగా అతనిలో.‘‘చెప్పాలంటే వినేవాళ్ళు ఉండాలిగా. ఫోన్‌ నెంబరు మార్చావు. సోషల్‌ నెట్‌వర్క్‌లలో దొరకవు. అతి కష్టం మీద ఇలా పట్టుకోగలిగాను.’’‘‘దారి తప్పావా ఏంటి? మళ్ళీ ఇలా ఇండియాకి!’’ కుతూహలానికి ‘సాధారణం’ అనే ముసుగు తొడిగే ప్రయత్నం. అంతేనా! చెప్పడం ఇష్టం లేని జవాబు కలిగిన ప్రశ్నకి మరో ప్రశ్నే సమాధానం. అందులోకి కాస్తంత వ్యంగ్యాన్ని రంగరించి పోసే కంఠస్వరం.‘‘సరైన దార్లో పడి ఏడాది పైనే అయింది. డైవోర్స్‌ దొరికినా వెంటనే రాలేకపోయాను.’’ఇంతసేపటికి కదలాడింది ఓ భావం అతని ముఖం మీద.‘‘ఎందుకని?’’ ఈసారి అరువు తెచ్చుకున్న నిర్లక్ష్యం.

‘‘ఇంత కాఠిన్యాన్ని ఎక్కడ కొనితెచ్చుకున్నావు?’’ ఇక ఆగలేమంటున్నాయి ప్రియ కళ్ళలోని కన్నీటి చుక్కలు.అతని ఇబ్బందిని చెదరగొట్టాలనేమో, సెల్‌ మోగింది.‘‘ఆఫీస్‌ కాల్‌, ఒక్క ఫైవ్‌ మినిట్స్‌’’ తమ మధ్య ఉన్న దూరాన్ని కర్టెసీతో కొలవాలని అతని ప్రయత్నం.ఇదీ మంచిదే. అతన్ని సరిగా చూసుకోగలిగే అవకాశం తనకి. దూరంగా మొబైల్‌ మీద బిగిసిన చెయ్యి, అతని పొడవాటి ముక్కు మాత్రమే కనిపిస్తున్నాయి ప్రియకి. ‘‘అంత పొడుగు ముక్కుంటే అంతే మరి. కోపం వచ్చి కాపురం పెట్టుకోక ఏం చేస్తుంది’’ అని తను ఏడిపిస్తే ఎంత బాగా నవ్వేవాడు.మొదటిసారి తను అతనిలో చూసి ముచ్చటపడిన అమాయకత్వపు అలికిడి మాత్రం ఎక్కడా లేదు. ఏ తెరల వెనక దాచిపెట్టాడో, లేకపోతే ఏ మధ్యదారిలో విడిచిపెట్టాడో.‘‘ఎప్పుడో నడిచొస్తుంది హృదయంలోకితన మువ్వల చప్పుడుగా నన్ను మోగిస్తూ!’’ఇవే కదూ తన దృష్టిని ఆకర్షించి, ఎప్పటికీ జ్ఞాపకంగా తోడుండిపోయిన అతని కవితలోని వాక్యాలు! మొత్తంగా గుర్తులేకపోయినా ఈ రెండు వాక్యాలూ మాత్రం ఎందుకో ఎప్పటికీ మరుపు రావు. పరిచయం పెరిగాక ఆ మాట అతనితో చాలాసార్లు చెప్పింది కూడా. కాలేజ్‌ మేగజైన్‌లో ఆ కవిత చదవగానే వెతుక్కుంటూ అతని క్లాస్‌కి వెళ్ళి మరీ అభినందించింది. తన స్నేహితులు హెచ్చరించినట్టుగానే చాలా దర్పాన్ని ప్రదర్శించాడు. కానీ గర్వంలా కనబడే ఆ పలచని పొరల వెనక దాక్కున్న పసితనాన్ని తను వెంటనే పసిగట్టింది. ఆ క్షణంలో ఏర్పడిన ఇష్టం, కారణాల్ని కల్పించుకుంటూ అతనితో పరిచయాన్ని పెంచుకునేలా చేసింది. మెల్లగా ఆ పరిచయం స్నేహానికి దారి తీసింది.