‘‘శ్రీజా! బట్టలన్నీ సర్దేసుకున్నావా?’’ అంది అమ్మ ఆఫీసు నుండి ఇంట్లోకి అడుగుపెడుతూనే.‘‘ఆ సర్దుకున్నానమ్మా!’’ అన్నాను.‘‘ఏం సర్దుకున్నావో చూపించు పద’’ అంది.‘‘అబ్బబ్బ! సర్దుకున్నాలేమ్మా! ఇంకాసేపట్లో బస్సు వస్తుంది! టైమ్‌ లేదు’’ అన్నాను విసుగ్గా.‘‘అది కాదు శ్రీజా ఏమైనా మర్చిపోతే మళ్లీ ఇబ్బంది పడతావు ఊరుగాని ఊర్లో’’ అంటూ సూట్‌ కేసు తీసి అన్నీ చెక్‌ చేసింది.‘‘షిమ్మీలు పెట్టుకోలేదేమే’’‘‘ఇన్నర్స్‌ పెట్టుకున్నాను కదమ్మా! మళ్లీ షిమ్మీలెందుకు?’’‘‘శ్రీజా ఇన్నర్స్‌పైన షిమ్మీలు వేసుకోవాలి. ముఖ్యంగా బయటికి వెళ్లినపుడు. తీసుకు రా’’ అంది కోపంగా.అలమరా తీసి షిమ్మీలు తెస్తూ ‘చె క్‌ చేయడం అయింది, ఇక ఇప్పుడు జాగ్రత్తల ఉపన్యాసం వినాలి’ అనుకున్నాను.నా చేతుల్లోంచి షిమ్మీలు తీసుకుని సూట్‌కేస్‌లో సర్దుతూ ‘‘ఇంజనీరింగ్‌ చదువుతున్నాను, నువ్వు చెప్పకపోతే ఆ మాత్రం జాగ్రత్తలు నాకు తెలియవా అని అనుకుంటున్నావని నాకు తెలుసు.

 ఏదైనా జరిగితే బాధపడతాం కాబట్టి ముందే జాగ్రత్తలు చెప్తాం’’ అంది.నాకు రాహుల్‌ గుర్తొచ్చాడు. నేను రాహుల్‌ని ప్రేమిస్తున్నానని, చదువయ్యాక ఇద్దరం పెళ్లి చేసుకుంటామని చెబుదామని నోటిదాకా వచ్చింది కాని ఆమె ఏమంటుందో, మూడ్‌ చెడిపోతే మళ్లీ ఎక్స్‌కర్షన్‌ ఎంజాయ్‌ చేయలేను అనుకుని అమ్మ చెపుతున్న జాగ్రత్తలకి ‘ఊ’ కొడుతూ ఉండిపోయాను.‘‘భలే ఆంటీ మీరు...! చిన్నపిల్లకి చెప్తున్నట్లు జాగ్రత్తలు చెపుతున్నారు’’ అంది శ్రుతి. హాల్లో నిలబడి. గదిలో మేం మాట్లాడుకుంటున్నవన్నీ విన్నట్లే ఉంది దాని వాలకం చూస్తుంటే.‘‘దా! శ్రుతీ! నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలమ్మా’’ అంది అమ్మ.‘‘అయ్యో! ఆంటీ! ఏంటి జాగ్రత్త? మీకే ఆపదా రాకుండా తొడుగులేసుకోండి అని చెపుతున్న కాలం ఇది. మీరు మరీ బిసికాలపు జాగ్రత్తలు చెపుతున్నారు’’ అంది.‘‘శరీరాంగాలకి తొడుగులు వేసుకోగలరు శ్రుతీ...కానీ మనసుకేం తొడుగులు వేసుకోగలరు? దానికే విధంగా సమాధానం చెప్పగలరు’’ అంది అమ్మ, ఆమె గొంతులోని కాఠిన్యానికి అన్నింటినీ తేలిగ్గా తీసుకుని కొట్టి పారేసినట్లుగా సమాధానం చెప్పే శ్రుతి అమ్మ కళ్లలోకి చూడలేనట్లుగా తలవంచుకుంది.బయట నుండి బస్‌ హారన్‌ మోగడంతో ‘‘ఇంక బయలుదేరండి’’ అంది అమ్మ.బస్సెక్కాక ‘‘అమ్మ ఎప్పుడూ అంతే. చాదస్తం. శ్రుతి నువ్వేమీ అనుకోకు’’ అన్నాను.‘‘ఇట్స్‌ ఓకె’’ అంది భుజాలెగరేస్తూ.2ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకి వీడ్కోలు పలికేందుకు కాలేజీవాళ్లు ఏర్పాటు చేసిన ఎక్స్‌కర్షన్‌ ఇది.

హార్సిలీహిల్స్‌లో కాటేజ్‌లు బుక్‌ చేసారు. రాత్రి బస్‌లో రాహుల్‌ నన్ను నిద్రపోనీయకుండా నా పక్కపక్కనే తిరుగుతూ లెక్చరర్స్‌ చూడకుండా నన్ను తాకుతూ కొంటెపనులు చేస్తూనే ఉన్నాడు. వేకువజాము నాలుగుకి హార్సిలీహిల్స్‌ చేరుకున్నాము. కాటేజ్‌లోకి వెళ్లి అన్నీ సర్దుకుని కాసేపు పడుకున్నానో లేదో రేణుక మేడమ్‌ అందరినీ బయలుదేరతీసింది. అక్కడున్న చిన్న జూ, గుడి, ఆ కొండంతా తిరిగి చూసాం. దాదాపు 9 అవుతుండగా బస్‌ ఎక్కి కిందకు వచ్చి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రిషీవ్యాలీ స్కూలుకి వెళ్లాము. స్కూలు చూసాక అక్కడ నుండి కొంచెం దూరం లో ఉన్న తెట్టు వేణుగోపాలస్వామి ఆలయం చూసి వస్తూ వస్తూ దారిలో గంగమ్మగుడి దగ్గర బస్సు ఆపారు భోజనాలకోసమని.