తూరుపున వెలుగు రేఖలు విచ్చుకునేవేళ ఆ ఊళ్ళోకి కొత్తగా అడుగుపెట్టిన అనంత్‌ చుట్టూ పరిశీలిస్తూ నడవసాగాడు. పక్షుల కిలకిలరావాలు ఇంపైన సంగీతంలా వీనులకి హాయినిస్తున్నాయి.నున్నగా కనిపించే దూరపు కొండలు నీరెండ స్పర్శకి కన్నెపిల్ల నున్నని చెక్కిళ్ళలా మెరుస్తున్నాయి. గాలి అలలపై తేలివచ్చే గుడిగంటలు మంగళ వాద్యాలై తనకి స్వాగతం చెప్తున్నట్టు తోచిందతనికి.పచ్చని పంటపొలాలు,హాయి గొలిపే చల్లటి గాలి వినీలాకాశం స్వచ్ఛత మనసుకి అంతులేని ప్రశాంతత కలిగిస్తుంటే ఇంత చక్కని ప్రకృతి మధ్య జీవించి ఎంత కాలమైంది అనుకుంటూ సన్నగా ఈల హమ్‌ చేస్తూ హుషారుగా వెళ్తున్న అతని కాళ్ళకి ఓ మధుర కంఠస్వరం కారణంగా బ్రేకు పడింది.కాలువ గట్టున కూర్చుని ఓ పల్లెపడుచు చేత్తో జామపండు చిలుక నోటికి అందిస్తూ ఎంతో శ్రావ్యంగా ‘మనసున మల్లెల మాలలూగెనే - కన్నుల వెన్నెల డోలలూగెనే’ అంటూ పాడుతోంది. ఆమె గుడినుంచి వస్తున్న గుర్తుగా మరో చేతిలో పూలసజ్జ, కొబ్బరికాయలు.ఆ చక్కటి ప్రకృతిలో ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా అనిపించింది. అటువైపు అడుగులేశాడు.ఓహ్‌...! బంగారపు మెరుపుతీగ! విశాలమైన నుదుటిపై వంకీలు తిరిగిన ముంగురులు గాలితో సయ్యాటలాడుతూ పాలభాగాన్ని తనివితీరా చుంబిస్తున్నాయి.

 చెర్రీ పండులాంటి ముచ్చటగొలిపే తేనెలూరు పెదవులు, అవి చెక్కిళ్ళా... కాదు గులాబీ రేకుల రాశులు! చక్కని ముఖవర్చస్సు! నడుము చూస్తే మృగరాజ మధ్యమంలా ...!ఏ దేవకన్యో అక్కడి ప్రకృతి అందాలకి పరవశించి భువికి దిగిందా అనిపించేటంతటి ఆ అద్భుత సౌందర్యానికి ముగ్ధుడై చూస్తూ తనని తాను మరిచాడు.అంత దగ్గరగా నిలబడ్డ ఆ అపరిచితుడు, స్ఫురద్రూపి అయిన యువకుడ్ని చూసి తొట్రుపాటుగా లేచి నిలబడింది.‘యవ్వనం చిగురించిన కొత్తలో ప్రతి వ్యక్తి హృదయం ఎవరికోసమో తనకు తెలియకుండానే ఎదురుచూస్తుంది. ఇష్టమైన వ్యక్తి ఎదురుపడగానే ఆ మనసు ఎంతో చిత్రంగా మధురంగా స్పందిస్తుంది. ఆ వింత స్పందనే ప్రేమా? అనుకున్నాడు అనంత్‌.‘‘ఎ...ఎవరు మీరు?’’ ఆమె మాటల్లో తడబాటు.‘‘నేను పరంధామయ్య మాస్టారు గారి అబ్బాయి అనంత్‌ని. పట్నంలో చదువు పూర్తిచేసి కొత్తగా ఈ ఊరికి వచ్చాను. నాన్నకి నెలక్రితమే ఈ ఊరి స్కూలుకి ట్రాన్స్‌ఫర్‌ అయింది. నాకు ఇల్లు తెలీదు. మీకు తెలిస్తే..’’ ఆమెపై నుంచి చూపు మరల్చకుండా తదేకంగా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు.పూల బాణాల్లా గుచ్చుకునే ఆ చూపులకి ఆమె బుగ్గల్లో కెంపులు పూశాయి.ఎలా వెళ్ళాలో అడ్రసు చెప్పి ‘ఇంకా నిలబడ్డావేం వెళ్ళు’ అన్నట్లు చురుక్కుమని చూసింది.ఆ భావం గ్రహించినా అక్కడ్నుంచి అంగుళమైనా కదలక‘‘మీ పేరు?’’ అన్నాడు. రెప్పవేసిన మరుక్షణం ఆమె అదృశ్యమైపోతుందేమోనన్న ఆందోళన అతనిలో.