అంత అందమైన నవ్వు నేను బుద్ధి ఎరిగాక ఎపుడూ చూడలేదు. ఓ సెలయేరులా, హరివిల్లులా,చిరుజల్లులా, మెరుపులా, మలయమారుతంలా, కోకిలగానంలా, పున్నమివెన్నెల్లా, విరిసీవిరియని పువ్వుల్లా,ఎగిరేగువ్వలా ఎంత అందంగా ఉంది? ఆ నవ్వు?. ఎంత హాయిగా ఉంది? ఆ నవ్వును చూస్తూ బ్రతికేయచ్చు.ఆ నవ్వును చూస్తూ మరణించొచ్చు. ఆ నవ్వులో ఆ గొప్పతనం ఉంది - అంత మాధుర్యం ఉంది.అంత సహజత్వం ఉంది. అంత స్వచ్ఛత ఉంది.నవ్వును మొట్టమొదటి సారి చూసిన క్షణం.. ఓ అద్భుతాన్ని వీక్షించిన క్షణం.. ఎపుడూ నా కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది. అనుక్షణం నన్ను వెంటాడుతూనే ఉంటుంది.సరిగ్గా మూడేళ్ళక్రితం నన్ను విశాఖపట్నం నుంచి ఖమ్మం జిల్లాకు ట్రాన్సఫర్‌ చేసారు. అప్పట్కేనేను ఆంధ్ర, రాయలసీమ, హైద్రాబాద్‌ సిటీలు ఓ సారి చుట్టిరావడమైంది. ఈసారి ఫామిలీ పెట్టదలచుకోలేదు. వినీల్‌, శ్రావణిల చదువు డిస్టర్బ్‌ కావడం నాకు ఇష్టంలేదు. జాయిన్‌ అయ్యి ఎలాగొలా ప్రయత్నం చేసుకొని మళ్ళీ విశాఖపట్నం వచ్చేయాలని నా ఆలోచన.మా డిస్ట్రిక్ట్‌ ఆఫీస్‌లో జాయిన్‌ అయి చార్జి తీసుకొని నెలయ్యింది. ఆ రోజు చాలా బిజీగా ఉన్నాను. మా అసిస్టెంటు అహ్మద్‌ అన్ని పన్లు తనే చేసుకుంటాడు. నా పని వెరిఫై చేసి సంతకాలు పెట్టడమే. సరిగ్గా మధ్యాహ్నం ఒకటిన్నర అయ్యింది. ఆకాశం మేఘావృతమైంది. ఈదురుగాలులు వీల వీస్తున్నాయి. సన్నగా జల్లులు ప్రారంభమై క్రమంగా కుంభవృష్టి కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో ఆకాశం దద్ధరిల్లుతోంది.

లంచ్‌కు కూర్చుందామని హాట్‌ క్యారియర్‌ విప్పుతూంటే ఓ మెరుపు మెరిసినట్లయింది. సన్నగా, పొడవుగా ఉన్న ఓ యువతి వడివడిగా మా ఆఫీస్‌లో కొచ్చింది. వర్షంలో తడిసిన మొహాన్ని పమిటి చెంగుతో తుడుచుకుంటూంది. ఆటోలో వచ్చినట్లుంది ఆటో వాడికి డబ్బులిస్తోంది. అహ్మద్‌ ఆమెను పలకరిస్తున్నాడు. రెండు నిముషాలు తర్వాత ఇద్దరు కల్సి నా క్యాబిన్‌ వైపే వస్తున్నారు. నేను వాళ్లని గమనించనట్లు నటిస్తూ క్యారేజీ సర్దుకుంటున్నాను.‘‘నమస్తే!’’ కోటిరాగాలు మీటినట్లయి తలెత్తి చూసా ఆమె.. అద్భుత సౌందర్యవతి. ముప్పైఆరు, ముప్పైఏడు ఏళ్లుండవచ్చు. సన్నగా, పొడవుగా, బంగారు మేనిచ్చాయ.. అంతకు మించి అద్భుతమైన ఆమె చిరునవ్వు. ఆమె నా కేసి పలకరింపుగా నవ్వుతోంది. అంత అందమైన నవ్వు నేనెపుడూ చూడలేదు.‘‘న..మ..స్తే’’ నాకు నోట మాటరాలేదు.‘‘మా కొత్తసార్‌. వేణుగోపాల్‌.. ఈమె సుహాసిని.. సోషల్‌వెల్‌ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌’’ అహ్మద్‌ పరిచయం చేస్తున్నాడు.ఓ సౌందర్యోపాసకుడిలా ఆమె అందాన్ని, చిరునవ్వును ఆస్వాదిస్తున్నా.అహ్మద్‌ చెప్పేది నాకేం వినపడటంలేదు.‘‘సార్‌!’’ అహ్మద్‌ పిలిచాడు. అప్పుడుగానీ ఈలోకంలోకి రాలేదు.‘‘కూర్చోండి’’ అన్నాను.‘‘సారీ! మీ లంచ్‌టైంలో వచ్చాను’’. నవ్వుతూనే కూర్చుందామె.