ఆరోజు పాపకి తలంటి నీళ్లు పోసి, కొత్త బట్టలు తొడిగి మొదటి పుట్టిన రోజు పండుగ చేసింది కాంతమ్మ. పిండి వంటలతో భార్య పెట్టిన భోజనం ఆరగించి, భుక్తాయాసంతో పడక గదిలో మంచంపై పరమేశం కునుకు తీయబోతుంటే, వీధి తలుపు ఎవరో కొడ్తున్నట్లు చప్పుడు వినిపించింది. ‘ఆఁ! మిట్ట మధ్యాహ్నం ఎండలో పడి తమ ఇంటికి ఎవరొస్తారు? పక్కింటి ప్లీడరు గారి కోసం ఎవరో పార్టీ అయి ఉంటుందిలే’ అనుకొని, లేవడానికి బద్ధకించి ఇటు నుంచి అటు తిరిగి మళ్లీ పడుకున్నాడు.వంట ఇంటి ముందు వరండాలో కూర్చుని తనలో తనే ఏదో సన్నగా పాడుకుంటూ మధ్యాహ్నం పేరంటంలో ఇవ్వడానికి తమలపాకుల కిళ్లీలు కడ్తోంది భార్య కాంతం. దూరంగా పెరట్లోంచి పిల్లల ఆటపాటల కేకలు కలగలుపుగా వినిపిస్తున్నాయి. 

అంతలోనే మళ్లీ వీధి తలుపు టక టక కొట్టిన చప్పుడు అయింది.‘‘ఏమండీ! ఎవరో తలుపు కొడుతున్నారు. ఓసారి వెళ్లి ఎవరో ఏమిటో చూడండి. నా చెయ్యి తెరిపిగా లేదు’’ అంటూ లోనుంచి కాంతమ్మ కేక పెట్టింది.ఇంక తనకి లేవక తప్పదు అనుకొని విసుక్కొంటూనే లేచి వెళ్లి తలుపు తీసాడు పరమేశం. ఎదురుగా ఎవరో కొత్త వ్యక్తి. అంతకు పూర్వం అతన్ని ఎక్కడా చూసిన గుర్తు లేదు. బహుశా వాలకం చూస్తే చాలా దూరం నుంచి, చాలా రోజులుగా ప్రయాణం చేసి మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆ ఊరికి చేరిన వాడిలా ఉన్నాడు.వేళకాని వేళప్పుడు వచ్చి, బంగారం లాంటి తన నిద్ర పాడుచేసిన ఈ ఆగంతకుడు ఎవరబ్బా- అనుకుంటూ ఎదుట నిలిచిన వ్యక్తి వైపు పరీక్షగా చూసాడు పరమేశం. మనిషి బాగా పొడగరి. ఆ పొడుగుకి తగ్గ లావు. భారీ అయిన పంచలోహపు విగ్రహంలా నిండుగా ఉన్నాడు. వయసు అరవై పైబడి ఉండొచ్చు. మాసిన గడ్డం, నెరసిన జుట్టు, ప్రయాణపు బడలికతో వడలిన ముఖం, నలిగిన బట్టలు, కాళ్లకి మట్టి కొట్టుకున్న చెప్పులూ-పరమేశం ఎంత పరీక్షగా చూసినా ఆ ఆగంతకుడు ఎవరో, ఎక్కడివాడో అతనికి గుర్తు దొరకలేదు. అతను తన కోసం కాక ఇరుగు పొరుగు ఇంకెవరి కోసమో వచ్చి ఉండాలి. ఇంటి వివరాలు సరిగ్గా తెలియక వాడలో ముందుగా ఉన్న తమ ఇంటి తలుపు తట్టి ఉండాలి అనుకొన్నాడు. అతడికి కావలసిన వివరాలు ఏవో తొందరగా చెప్పి పంపిస్తే, తను మళ్లీ తన నిద్రా కార్యక్రమం కొనసాగించవచ్చు అన్న అభిప్రాయంతో, వీధి గడపలోకి ముందుకి వస్తూ, ‘‘ఎవరండీ! మీకు ఎవరు కావాలి?’’ అన్నాడు.