ప్రసాద్‌ బ్యాంక్‌ నుండి వచ్చి కాఫీ కలుపుకుని తాగాడు. అర్థాంగి పుట్టింటికి వెళ్ళడంతో చెయ్యి కాల్చుకోక తప్పలేదు. పనిమనిషి బంగాళాదుంపలు తరిగి వెళ్ళింది. అన్నం వండుకుని, వేపుడు చేసుకోవడం ప్రసాద్‌ పని.

టి.వి. పెట్టుకుని చూస్తున్నాడు. ఫిబ్రవరి నెల...చలి ఇంకా తగ్గలేదు. బయటికి వెళ్లి ఫ్రెండ్స్‌ను కలవబుద్ధి కాలేదు. ఒక్కొక్కసారి మనిషి ఏకాంతాన్ని కోరుకుంటాడు.ప్రదీప్‌ నుండి ఫోన్‌... తమ్ముడి ఫోన్‌కాల్‌ చూడగానే ప్రసాద్‌లో చైతన్యం.ప్రదీప్‌ నవ్వుతూ అడిగాడు. ‘‘ఏం చేస్తున్నావురా?’’ప్రసాద్‌ నవ్వాడు. ‘‘వదిన లేదు కదా, స్వయంపాకం. ప్రస్తుతం టి.వి. చూస్తున్నాను.’’‘‘అదృష్టవంతుడివిరా! నాలుగు రోజులు ఏ సతాయింపులూ ఉండవు. నా షాపు బిజీ, నేను బిజీ! పండగకి ఒకరోజు వెళ్ళిరావడం తప్ప కుదరదు. మీ మరదలు నాతోనే లంకె పెట్టుకొని కూర్చుంటుంది’’ నిట్టూర్పు విడుస్తూ అన్నాడు ప్రదీప్‌.ప్రసాద్‌ నవ్వి ‘‘నీ మీద ప్రేమరా! మీ వదినలాగ పిల్లలను తీసుకొని తరచుగా వెళ్ళదు’’ అన్నాడు.‘‘ప్రేమా? గాడిదగుడ్డా? మన బాబుగారిలాగ ఎవరినైనా తెస్తానని భయం. ఆయన పోయినా ఆయన జీవితకథను తలుచుకుని, భయపడుతూనే ఉంటార్రా!’’ ప్రదీప్‌ కోపంగా అన్నాడు.మళ్ళీ అతడే అన్నాడు. ‘‘చాలీచాలని తిండి, అమ్మ ఏడుపు, మన అర్థాంతర చదువులు, అన్నీ ఆయన ధర్మమే కదురా’’!ప్రసాద్‌ ఏమనగలడు? ఏం చెపితే తనవాళ్ళు కష్టాలు మరిచిపోతారు.మంచిమార్కులతో ఇంటర్‌ పాసైన తమ్ముడు, ఇలా ప్రైవేటుగా డిగ్రీ చదివి ‘‘ఇంటర్‌నెట్‌’’ సెంటర్‌ పెట్టుకున్నాడు. ‘‘మీ సేవ’’ కూడా చేస్తున్నాడు. తెలివితేటలుండి, ఉత్సాహం ఉండి, బాగా చదువుకోవాలనే కోరిక ఉండి తను, తమ్ముడు ఇబ్బందులు పడ్డారు. చదువుకి స్వస్తి పలికి, బ్యాంక్‌ పరీక్షలు రాసి సెలక్టయ్యాడు తను.తమ్ముడు అలిగి, ఇంట్లో నుండి వెళ్ళిపోయి, ఫ్రెండ్స్‌ సహాయంతో, బ్యాంక్‌లోన్‌ తీసుకొని ఇంటర్‌నెట్‌ సెంటర్‌ పెట్టాడు.

తను ఉద్యోగంలో చేరాక, వాడి బయటి అప్పులు తీర్చాడు.‘‘అక్కకి, వాళ్ళకి ఫోన్‌ చేశావా? ప్రదీప్‌ అడిగాడు. ఊ...’’ అన్నాడు ప్రసాద్‌.భారతక్క అదృష్టవంతురాలురా! బావగారు చెన్నై కంపెనీలో పని చేస్తున్నారు.మిగిలిన ఇద్దరు చెల్లెళ్ళనూ తలుచుకుంటే బాధ కలుగుతుంది.ఇద్దరు పిల్లలున్న టీచర్‌కి భార్యపోతే, శ్రీలక్ష్మిని ఇచ్చి చేశారు. రెండో పెళ్ళి అయినా అతడు కట్నం కావాలంటే, యాభై వేలు చేతిలో పెట్టారు.మాధవి ఒంటరిగా హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగం చేస్తోంది. తల్లి దాని దగ్గరే ఉంది.ఒక మనిషి వ్యసనం కుటుంబాన్నే భ్రష్టు పట్టించింది. ఇంటి యజమానికి బలహీనత ఉంటే కుటుంబం నవ్వుల పాలవుతుంది. దారి తప్పుతుంది.రాజమండ్రిలో పేరున్న లాయర్‌ తన తండ్రి నారాయణరావు. కేసు గెలిచినప్పుడల్లా ఇంట్లో పండుగే! అమ్మను అందలం ఎక్కించడమే!