‘‘హాయ్‌ సునీ.. నేనొచ్చేశా’’ అంటూ ఆనందంగా ఇంట్లోకి అడుగుపెట్టిన జయంత్‌ సునీత ముభావంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు.‘‘సునీ.. ఏమైంది!’’ అని అడిగాడు.‘‘ఏమీ కాలేదు. శనివారం గడచిపోయింది. అంతే’’నిర్లిప్తంగా అంది.‘‘ఏం చేయను సునీ...’’‘‘ప్లీజ్‌. ఇంకేం చెప్పకండి. రాత్రంతా మీ కోసం ఎదురు చూసి చూసీ నా మనసుఅలసిపోయింది.‘‘సారీ సునీ. మా బాసు నన్ను రాత్రి పది గంటల వరకూ సతాయించాడు. భోజనం చేసి బస్‌స్టేషన్‌ చేరేసరికి పదకొండయ్యింది. శనివారం కాబట్టి అన్నిబస్సులూ ఫుల్‌. ఓ బస్సులో కాస్త స్థలం దొరికితే విజయవాడ నుండి హైదరాబాద్‌ వరకూ నిలబడి వచ్చాను. ఒక్కరోజు కోసం యిన్ని అవస్థలు పడింది ఎవరికోసమనుకున్నావు? నీ కోసం... నీ ఆనందం కోసం’’‘‘సారీ... సారీ’’ తన ప్రవర్తనకు నొచ్చుకుంటూ అంది సునీత.‘‘ఫర్వాలేదు. నా మీద కోపం పోయినట్లేనా?’’ అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు.‘‘నా కోపం ఎంతసేపండీ మీరు అమాయకంగా ఇలా ముఖం పెట్టగానే నా కోపం గపన చల్లారిపోతుంది. పదండి... స్నానం చేసి వస్తే టిఫిన్‌ ఇస్తాను. మీకిష్టమైన ఇడ్లీ, కొబ్బరిపచ్చడి కాంబినేషన్‌ సిద్ధంగా ఉంది.‘‘సునీ.. టవల్‌’’ బాత్‌ రూమ్‌ తలుపు తెరిచి అరిచాడు జయంత్‌.‘‘లోపలే ఉంది’’ పూజగది నుంచి జవాబిచ్చింది సునీత.నిమిషం తర్వాత ‘‘సోపు’’ అని అరిచాడు బాత్‌ రూమ్‌లోంచి తల బయటకుపెట్టి ఆమె అతని దగ్గరకు వచ్చి ‘‘అన్నీ లోపలే ఉన్నాయి. ముందు సోపు, తర్వాత టవలు అడగాలని తెలియదు అమాయక చక్రవర్తికి’’ అంటూ నెత్తి మీద మొట్టింది.

‘‘సునీ... విజయవాడ నుంచి నీ కోసం ఏం తెచ్చానో చెపకో చూద్దాం’’‘‘శారీ?’’‘‘యు ఆర్‌ రైట్‌’’ అంటూ బ్యాగులో నుంచి అట్టపెట్టి తీసి ఆమె చేతికిచ్చాడు. పెట్టె మూత తీసి చూసిన ఆమె కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి.‘‘మై గాడ్‌... పట్టుచీరా?’’అవునన్నట్టు ఆమె వైపు గర్వంగా చూశాడు.‘‘ఎంతైంది?’’‘‘మూడు వేలు’’‘‘ఎందుకండీ అంత డబ్బు ఖర్చుపెట్టారు. మామూలు నైలాన్‌ చీర కొని తెచ్చున్నా నేను సంతోషించేదాన్ని’’‘‘ఆ విషయం నాకు తెలుసు సునీ. జీవితంలో చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేకపోతే బ్రతకడం ఎందుకు? నీకు పట్టుచీర కొనాలని మన పెళ్ళికి ముందు నుంచీ ప్రయత్నిస్తున్నాను. ఏవో అడ్డంకులు వచ్చేవి. అందుకే ఈసారి బోనస్‌ డబ్బులు చేతిలో పడగానే మరో ఆలోచన లేకుండా కొనేశాను... ఎలా ఉంది నా సెలెక్షన్‌?’’‘‘అద్భుతం. అయితే నా సెలక్షనంత అద్భుతం కాదులెండి’’ అంది సునీత.అలిగినట్లు బుంగమూతి పెట్టాడు జయంత్‌.‘‘నిజమండీ. మీరు నా సెలక్షన్‌ కదా. మరి నా సెలక్షన్‌ను చీట్‌ చేయండి చూద్దాం.’’