ఆగిన లిఫ్ట్‌ తలుపులు తెరుచుకోగానే బయటకు వచ్చాడు అనిల్‌. సాయంత్రపు ఎదురు ఎండ అతని కళ్ళల్లోకి కొట్టింది సూటిగా. వెంటనే ప్యాంటు జేబులోంచి కూలింగ్‌ గ్లాసెస్‌ తీసి పెట్టుకుని, కారు పార్కింగ్‌ ప్లేస్‌వైపు నడిచాడు. పార్కింగ్‌లో రెండు కార్లే వున్నాయి.అనిల్‌ తన కారు దగ్గరకు వెళ్ళి డోర్‌ తెరిచి, భుజానికున్న ల్యాప్‌టాప్‌ బ్యాగు వెనుక సీట్లో పెట్టి స్టార్ట్‌ చేశాడు.కారు అవుట్‌గేటు దగ్గరకు రాగానే, అక్కడ కూర్చున్న సెక్యూరిటీపెద్ద యినుపగేటు ప్రక్కకు తోసి దారిచ్చాడు.అనిల్‌ కారు ముందుకు పోనిచ్చి, రోడ్డుమీదకు వచ్చిన తర్వాత కారాపి బయటకు దిగి వెనక్కి తిరిగాడు.అదొక ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ. అందులోనే అనిల్‌ సాఫ్ట్‌వేర్‌ యింజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. తను పని చేస్తున్న కంపెనీ బిల్డింగ్‌ని తదేకంగా చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు.‘ఇంకా తను ఎన్నాళ్ళు యీ కంపెనీలో పనిచేస్తాడో? నెలలా... రోజులా...? వైరాగ్యంగా అనుకున్నాడు.అత్యంత అధునాతనంగా కట్టుబడి వున్న ఆ బిల్డింగ్‌ని ఒక్కసారి ఆపేక్షంగా చూసుకునిమళ్ళీ కారెక్కి స్టార్ట్‌ చేశాడు.దాదాపు ఆరేళ్ళుగా యిదే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు అనిల్‌. చాలామంది ఎక్స్‌పీరియన్స్‌తో హెచ్చుస్థాయి జీతాలకోసం కంపెనీలు మారినా, అతను మాత్రం మారడానికి యిష్టపడలేదు.ఆరేళ్ళుగా అదే ఆఫీసు, అదే ఛాంబర్‌, అదే సిస్టమ్‌... అనుబంధం పెంచుకున్నాడు వాటిమీద.ప్రకృతి వైపరీత్యం వల్ల అకస్మాత్తుగా వచ్చే భూకంపంలాగా, ఆర్థికమాంద్యం అనే భూకంపం వచ్చి తమ జీవితాల మీద నిర్ధాక్షిణ్యంగా విరుచుకు పడింది.ఆ భూకంపాల వల్ల వచ్చే నష్టాన్ని కాపాడ్డానికి ప్రభుత్వం వుంది, అనేక స్వచ్ఛంద సంస్థలున్నాయి.

 మరి... తమ జీవితాల మీద పడ్డ భూకంపం ప్రభావం నుండి ఎవరు కాపాడతారు?.. ఆ దేవుడే కాపాడాలి.అతనికి దేవుడు గుర్తురాగానే యిల్లు గుర్తొచ్చింది. ఇల్లు గుర్తురాగానే భార్య సుమతి గుర్తొచ్చింది.సుమతి... హు... ఉదాసీనంగా మారింది. అతని వదనం మనసంతా చేదుగా త యారయ్యింది. అతనికి తిన్నగా వెళ్ళాలనిపించలేదు.వెడితే ఏముంటుంది? శూన్యం తప్ప.ఇంతలో ఎవరో కారుకి అడ్డొస్తే హార్న్‌ నొక్కాడు.ఒకసారి తను డ్రయివ్‌ చేస్తున్న కారును చూసుకున్నాడు. ఈ కారుతో కూడా ఎన్నాళ్ళో అటాచ్‌మెంట్స్‌?వేలకు వేలు జీతాలొస్తున్నాయి కదా అని కమిట్‌మెంట్స్‌ పెంచుకున్నాడు. ఖరీదయిన కారు, మంచి ఏరియాలో ఫ్లాట్‌... ఒక్కసారిగా యివన్నీ పోతే తట్టుకోగలడా?నుదుటి మీద ఏదో ప్రాకినట్లయ్యి తడిమి చూసుకున్నాడు. చెమట.. అంటే... తను టెన్షన్‌ ఫీలవుతున్నాడా? ఎందుకు టెన్షన్‌?.... తన సెంటిమెంట్సే తనకి శాపమా?అతనికి కవిత మాటలు గుర్తొచ్చాయి ‘‘నీలాంటి సెంటిమెంటల్‌ ఫూల్‌ని నేనింతవరకు చూడలేదు అనిల్‌’’ అనేది.ఉన్నట్టుండి మనసుకు బ్రేక్‌ పడినట్టుగా కారు కూడా ఆగిపోయింది.