విజయనగరం వెళ్ళడానికి గురుద్వార్‌ జంక్షన్‌ దగ్గర నుంచున్నాడు రామారావు. వచ్చి అరగంటయినా ఏ బస్సు రాకపోవడంతో ఏమయివుంటుందో అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడొక జీపు వచ్చి ఆగింది.‘‘బావూ వస్తావా విజీనగరం!’’ అన్నాడా జీపువాడు. జీపులో పిట్టల్లా వేలాడుతున్న వారిని చూసి ‘బాబోయ్‌ అందరినీ మడతపెట్టి కూరేసాడు జీపులో తను ఎక్కితే విజయనగరం చేరే సరికి కమిలిన మామిడి పండులా అయిపోవడం ఖాయం’ అనుకుంటూ, ‘‘వద్దునాయనా బస్సు వచ్చేవరకూ ఆగుతాను’’ అన్నాడు రామారావు. ఇంతలో లారీ వచ్చి ఆగింది. లారీ వాడు తలబైటపెట్టి ‘‘అయ్యారండి, విజయనగరం..’’ అన్నాడు గుట్కా నములుతూ. వాడిని చూసి భయమేసింది రామారావుకు. ఒకసారి లారీ ఎక్కాడు. ఒక చేత్తో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, మరో చేతిలో స్టీరింగ్‌ పుచ్చుకుని మధ్యమధ్యలో గుట్కా నములుతూ ఆ లారీవాడు విజయనగరం వెళ్ళేవరకూ రామారావు గుండెల మీద చావుబాజా వినిపించాడు.ఆ విషయం గుర్తొచ్చి తల అడ్డంగా ఊపాడు. లారీ వెళ్ళి పోయింది.రామారావు గడియారం చూసుకున్నాడు. ఈరోజు ఆలశ్యం అయ్యేలా వుంది. ఇప్పటికే అధికారి మహాశయుడు తనను ఆలశ్యంగా వచ్చి తొందరగా వెళ్ళిపోయే ఉద్యోగుల జాబితాలో చేర్చేసాడు అనుకుంటూ మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ‘‘రామారావు!’’ అనే పిలుపు వినబడడంతో ఇహంలోకి వచ్చాడు.

 ఎదురుగా చిన్న నాటి మిత్రుడు వీర్రాజు ‘‘ఏంటీ.. ఇక్కడున్నావ్‌..?’’ అన్నాడు.‘‘విజయనగరం బదిలీ అయింది, బస్సుకోసం నిరీక్షణ’’ అన్నాడు. ‘‘ఏంటీ..? పదవీ విరమణ చేసే సమయం అయినా, బదిలీ అయిందా’’ అన్నాడు వీర్రాజు.‘‘నాకు పదోన్నతి కలిగింది. చిన్న గుమస్తాను, పెద్దగుమస్తా, అయ్యాను. ఆ పదవి విజయనగరంలో వుండడంతో బదిలీకి సమ్మతించాను. ఈ రెండు నెలల వైజాగునించి విజయనగరం క్రిందా, మీదా పడదామనుకుంటున్నాను’’ అన్నాడు.‘‘అంటే అప్‌ అండ్‌ డౌన్‌ చేద్దామనా, భలేవాడివే నువ్‌ అచ్చ తెలుగులో మాట్లాడతావ్‌, కారణం ఏమిటో’’ అన్నాడు వీర్రాజు నవ్వుతూ.‘‘నా కొడుకులిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు కదా... వాళ్ళు ఎలాగూ తెలుగు మరిచి పోయారు. కనీసం నా తదనంతరం నా మనవలైనా తెలుగు నేర్చుకోవాలని నా ఆశ. అందుకే అమెరికాలో వున్న వాళ్ళతో వారానికి ఒకసారి అచ్చ తెలుగులో స్వచ్ఛంగా మాట్లాడుతున్నాను. అదే అలవాటయిపోయింది, ఎవరితో మాట్లాడినా’’ అన్నాడు రామారావు.‘‘అయితే నీ అభిరుచికి నా ధన్యవాదాలు ముఖే ముఖే సరస్వతి అన్నారు. నిన్నుచూసి నాకూ అచ్చతెలుగు వచ్చేసింది.. మరయితే విజయనగరం వెళ్ళే బస్సులు ఇప్పట్లో రావు...’’ అన్నాడు వీర్రాజు.‘‘దేనికీ’’ అన్నాడు రామారావు.‘‘రాస్తారోకోలు ఎక్కువయ్యాయట, వాటికి వ్యతిరేకంగా రాస్తారోకో చేస్తున్నారు...’’ అన్నాడు వీర్రాజు.‘‘అంటే’’ అర్ధం కాక మళ్ళీ అడిగాడు రామారావు.