‘‘ఆ నీలం చీరా, గులాబీరంగు ఫ్రాకూ విడివిడిగా ప్యాక్‌ చేయించండి’’ అంటూ నాలుగు పది రూపాయల నోట్లను కౌంటర్‌మీద పెట్టేడు శ్యామసుందర్‌. కొద్ది నిమిషాలలోనే కుర్రవాడందించిన పాకెట్లు తీసుకుని, సమీపంలో ఉన్న దుకాణంలో బాణా సంచా కూడా కొని సంచీలో వేయించి క్వార్టర్స్‌ వంక నడవ సాగాడు.చీకటి పడకపోయినా దీపాలు వెలుగుతున్నాయి.రోడ్డు జనసందోహంతో నిండి ఉంది.మెల్లగా జనాన్ని తప్పించుకుంటూ అర్ధమైలు నడిచి అతనిల్లు చేరుకునేసరికి బాగా చీకటిపడి పోయింది.ప్లాస్టిక్‌ సంచిలోంచి పాకెట్లు తీసి టేబుల్‌మీద పెడుతూంటే, అతనికా నీలిచీరను మళ్లీ చూడాలనిపించింది. సిలోఫెన్‌ పాకెట్‌లోంచి మిలమిల మెరుస్తున్న చీరను చేతుల్లోకి తీసుకుని మృదువుగా వేళ్ల చివరలతో ఆ పాకెట్టుని నిమిరేసరికి అతనికి నీరజ బుగ్గలు గుర్తుకొచ్చాయి. ఒక్కసారి ఆ స్పర్శ అతనిలో చాలా అనుభూతులను జ్ఞాపకాలను ఉదయింపజేసింది.అతను లోపలకు వెళ్లి ముఖం కడుక్కుని, తుడుచుకుంటూ తిరిగి ఆ గదిలోకి వచ్చేసరికి, టేబుల్‌ముందు నిలుచుని పాకెట్‌ తెరిచి ఫ్రాక్‌ పైకి తీయాలని తీవ్రంగా ప్రయత్నిస్తూంది శ్యామా!శ్యామసుందర్‌ నవ్వుకుంటూ ఆమెవంకే చూడసాగాడు.

తెల్లవారితే దీపావళి!బాణాసంచా కాల్చుకుందుకు పిల్లలకీ, కొత్తబట్టలు కట్టుకుందుకు ఆడవాళ్లకీ మహదవకాశం కల్పించే పండుగ.పక్క క్వార్టర్సులో వయస్సు వచ్చిన పిల్లలు టపాకాయలు పేలుస్తూ రేపు రావలసిన దీపావళిని ఇవాళే అట్టహాసంగా ఆహ్వానిస్తున్నారు.పెద్దశబ్దంతో అతి సమీపంలో టపాకాయలు పేలేసరికి శ్యామా తుళ్లిపడింది. పాకెట్‌తో సహా ఆమెను ఒడిలోకి తీసుకుని ఆపిల్స్‌ లాటి రెండు బుగ్గలపైనా మృదువుగా ముద్దు పెట్టుకుని - ‘‘ఎలా ఉంది శ్యామా నీ ఫ్రాక్‌?’’ అంటూ అడిగాడు.‘‘బలేగా ఉంది మామయ్యా! థాంక్స్‌’’.శ్యామా ముద్దుగా కృతజ్ఞత తెలుపుతున్న ఆ క్షణాలలోనే నీరజ అక్కడకు వచ్చింది. ఆమె దృష్టి టేబులుమీద మిలమిల మెరుస్తున్న చీర మడతపై పడేసరికి -- పెదవులు మందహాసంతో కొంచం విచ్చుకున్నాయి.రెండడుగులు ముందుకువేసి ఆ పాకెట్టును చేతులలోకి తీసుకుంటూ ‘‘కాంప్లెక్షన్‌కి సరిపడే కలరు తెచ్చారు. ఈ స్కై బ్లూ నాకు చాలా ఇష్టమని గుర్తుంచుకున్నందుకు థాంక్స్‌’’ అందామె అతని ముఖంలోకి చూస్తూ.ఆమె అభినందనలను సంతోషంగా అందుకున్నట్లు తనూ నవ్వేడు.ఒక్కక్షణం ఊరుకుని అడిగిందామె. ‘‘ఒక్కటే తెచ్చారేం? మీ అక్కయ్యా?’’ లోపల నుంచి శారద పిలుపు వినిపించింది. ఆమె సగంలోనే మాట ఆపేసింది. ఒక్కసారి అతని కళ్ల ముందు వేయి మెరుపులు మెరిసినట్లయింది. ఆ మెరుపులలోంచి వెలువడిన తన కర్తవ్యం తలుచుకుని అతను తుళ్లిపడ్డాడు.‘‘ప్లీజ్‌... అది విప్పకు నీరజా!’’ ఎలాగో అన్నాడు శ్యామసుందర్‌.‘‘ఏం? సస్పెన్సా?’’ కుతూహలం వ్యక్తపరుస్తూ చూసింది నీరజ.అతను సమాధానం చెప్పకుండా ఆకస్మికంగా ఏదో సమస్య ఎదురైనట్లు గంభీరంగా మారిపోయాడు.