‘‘ఈ దెబ్బతో నువ్వు స్ర్తీవాదరచయిత్రిగా పేరు తెచ్చుకోవడం నూటికినూరు శాతం ఖాయమోయ్‌..’’టమాటా ముక్కల్ని మిక్సీలో వేసి ప్యూరీ తీస్తూ అన్నాడు విపిన్‌.‘‘ఎందుకలా?’’ మూకుట్లో వేగుతున్న తాలింపు మీద నుంచి దృష్టి మళ్ళించకుండానే అడిగింది సుజన.‘‘లేకపోతే! ప్రముఖ స్ర్తీ వాద పత్రిక నిర్వహించిన కథల పోటీలో ప్రధమ బహుమతి కొట్టేయడం అంటే మాటలనుకున్నావేమిటి?’’ మిక్సీ బర్రున తిరుగుతున్నా విపిన్‌ మాటలు స్పష్టంగానే వినిపించాయి సుజనకి.బదులుగా చిరునవ్వు నవ్వేసి ఊరుకుంది. తనది స్ర్తీవాదం కాదని, అసలా మాటకొస్తే ప్రత్యేకించి తాను ఏ వాదానికీ సంబంధించి రచనలు చేయదనీ, తన రచనలు మానవతా విలువల్ని మాత్రమే ప్రతిబింబిస్తాయనీ ఎన్నోసార్లు అతడికి చెప్పి చెప్పి విసిగిపోయింది సుజన.అసలు...ఏవాదం తాలుకు ముఖ్యోద్దేశ్యమైనా సమ సమాజ స్థాపన, సర్వమానవ సమానత్వం కావాలని ఆమె అభిప్రాయం. ప్రతి మనిషికి మేలు జరగాలని కోరుకోవడం వెనక ఉన్నది ఏ వాదానికి అందని మనిషితనమని ఆమె అంతర్యం.ఇప్పుడు ఈ పత్రిక నిర్వహించిన పోటీలో బహుమతి రావడం కేవలం యాదృచ్ఛికం. మానవత్వపు విలువలు ఉట్టిపడేలా కథలు రాసి పంపమని ఓ పత్రిక (అది స్ర్తీవాద పత్రిక కావడం క్కూడా సుజనంతగా పట్టించుకోలేదు) ప్రకటన ఇస్తే, దానికి ఆకర్షితురాలై...సమాజంలో స్ర్తీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చర్చిస్తూ, ప్రతి వ్యక్తి మానవత్వంతో స్ర్తీలను గౌరవించాలని ఆకాంక్షిస్తూ, స్ర్తీ ల సమస్యల పట్ల సానుభూతితో స్పందించాలన్న దృక్పథంతో రాసిన కథ అది.

ఆ కథలో ఉన్న అంశాలు, ఉన్నత విలువలు ఆ పత్రిక వాళ్ళకి నచ్చి ఆమెకు బహుమతి ప్రకటించారు. దానితో విపిన్‌ హడావుడి, దెప్పి పొడుపులు అంతా ఇంతా కాదు. ఆమె రచనలు ప్రతిపాదించేది. ఆ రచనలలో ప్రతిబింబించేదీ కేవలం స్ర్తీ వాదమేనని, అందుకే ఆమెకాబహుమతి వచ్చిందని బల్ల గుద్ది మరీ వాదించాడు విపిన్‌. అతడిని వారించే ఓపిక లేక మిన్నకుండిపోయింది సుజన. గతంలో.. వీళ్ళ పక్కింట్లో ఉండే వసంతకి జ్వరం వచ్చిందోసారి. అప్పుడు ఆమె భర్తే ఇంటి పనులూ అవీ చూసుకుని, వంట చేసుకుని ఆఫీస్‌కి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడప్పుడు తనవంతు సహాయంగా కూరలు అవీ పంపుతూ ఉండేది సుజన. ఆ రోజు ఆఫీస్‌కి బయలుదేరుతున్న వసంత భర్తని ‘‘ఏమండీ సంతోష్‌ గారూ...మీ శ్రీమతిగారికి ఇంకా జ్వరం తగ్గినట్టుగా లేదు... పాపం ఇంటా బయటా చేయలేక అవస్థ పడుతున్నట్లున్నారు’’ అంటూ పలకరించాడు విపిన్‌.‘‘అవునండీ...వెధవజ్వరం..నాలుగురోజులై పట్టిపీడిస్తోంది. ఎన్ని మందులు వేసినా నార్మల్‌కి రావడం లేదు. టైఫాయిడేమోనని అనుమానంగా ఉంది. ఒకటే నీరసం. దానికి తోడు కాళ్ళు పీకులూ.. కాళ్ళు పట్టేందుకు పని మనిషి కూడా లేదు.’’ తన కష్టాలు ఏకరువు పెట్టాడు వసంత భర్త.