ఒక వారం రోజులకి నేను, రవి, మాధవ్‌ కుటుంబాలతో కేరళ వెళ్ళొద్దామని నిశ్చయించుకున్నాం.‘‘నీకు కేరళ రాష్ట్రం గురించి బాగా తెలుసు కాబట్టి నువ్వు మాతో వస్తే మాకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వస్తావా?’’ అనడిగేడు రంగనాథం.‘‘రాను. ఆ ఆఖరి ట్రిప్‌ తరువాత మళ్ళీ కేరళ రాష్ట్రానికి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను’’ అని సమాధానమిచ్చేడు రావ్‌.రావ్‌ మితభాషి. ఎవరినీ నొప్పించే స్వభావం కాదు.గత పదేళ్ళుగా తమకి తెలిసిన రావ్‌ అంత నిక్కచ్చిగా, పుల్లవిరిచినట్లు ఆ ఒక్క వాక్యం అలా చెప్పడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.ఆ వాక్యం చెప్పేక పరాకుగా గతంలోనికి చూస్తున్న రావ్‌ మొహంలో విషాదం స్పష్టంగా కానవచ్చింది మిత్రబృందానికి.‘‘సున్నితంగా, నిశితంగా ఆలోచించే వ్యక్తులంటే నా కిష్టం. మనల్ని సంభాషణ లోనికే రాకుండా, ఆపకుండా మాట్లాడే వాళ్ళతో మన భావాలని ఎలా పంచుకోగలం?’’ అనడిగేడు రావ్‌.‘‘స్వంత గొంతు అంటే కొందరికి చాలా ఇష్టం. రాజకీయ నాయకుల్ని చూడు, మైక్‌ని ఎలా అదరకొడతారో’’ అన్నాడు రంగనాథం.‘‘చెట్టుకున్న కాయల్ని కోసినా, ఆవు పొదుగు నుంచి పాలు ఆగకుండా చివరి వరకు పితికినా వాటికి నొప్పి కలుగుతుందన్న సంగతి మీకెవరైనా చెబితే మీరేమంటారు?’’ అన్నాడు రావ్‌.‘‘ఇలాంటి చిన్నచిన్న వాటి గురించి మధనపడుతూ కూర్చుంటే మనం ఈ ప్రపంచంలో బ్రతకలేం.

 ఇంతకీ నీతో ఈ వాక్యాలు ఎవరన్నారు?’’ అనడిగేడు రవి.‘‘సున్నితమైనది, మృదుమధురమైనది, కపటం లేనిది, ఆంక్షలు లేనిది, ప్రతిఫలం ఆశించని బంధం ఈ లోకంలో ఉంటుందా రంగనాథం?’’ అంటూ మెల్లిగా గొణిగేడు రావ్‌.‘‘దెయ్యాలున్నాయంటే నమ్ముతావా?’’ అనడిగేడు మాధవ్‌.‘‘అదేం ప్రశ్న?’’‘అది ఎంత నిజమో, నువ్వు చెప్పేదీ అంతే సాధ్యం’’.‘‘ఏదైనా అనుభవంతో అది సాధ్యమవుతుందని గ్రహించేంతవరకు ఎవరు ఎంతచెప్పినా అది అసాధ్యమని గాఢంగా నమ్మి వాదించే వాళ్లే ఈ ప్రపంచంలో ఎక్కువ రంగనాథం’’ అన్నాడు రావ్‌ సంభాషణని పొడిగిస్తూ.‘‘మనకి ఏది మంచో, ఏది చెడో, ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో ఆలోచించే శక్తి ఉంది. ఎవరో ఏదో చెప్పినంతమాత్రాన గుడ్డిగా నమ్మేస్తామా?’’ అని అడిగేడు రవి‘‘అదే విచిత్రం రవీ! మనకంటె పెద్దవాళ్ళు, సంఘంలో తెలివైన వాళ్ళుగా చెలామణి అవుతున్నవాళ్ళు పదే పదే చెప్పి, తాము చూడనివి చూసినట్లు చిత్రించి మన ఆలోచనల్ని మలుస్తారు. ఇది నే కనుక్కున్నదేమీ కాదు. చరిత్ర తిరగేసి చూస్తే ఏవో సిద్ధాంతాల పేరిట జరిపే ఘోరాలే దానికి ఒక నిదర్శనం. తమకి నచ్చని ఏ ఆలోచననైనా, ఏ చర్య అయినా కనిపిస్తే వాటిని నలిపేసి నులిమేసేంత వరకు సమాజం ఊరుకోదు’’ అన్నాడు రావ్‌.ముక్తసరిగా మాట్లాడే రావ్‌ ఆవేదన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’’.