‘‘అలకలో గూడా ఎంత ఆనందమోహనంగా ఉన్నావు అలకనందా!’’ అని మాంఛి రైమ్‌ డైలాగ్‌ ఒకటి వదిలాడు ప్రణయ్‌.‘‘ఓ పక్క చేతులు మండి నేను అవస్థలు పడుతోంటే నువ్వు రొమాంటిక్‌ డైలాగులు విసురుతూ కూచుంటావా? హన్నన్నా!’’ అంటూ పైటకొంగు లాగి బొడ్లో దోపుకుంది అలకనంద.అలకనంద డైలాగ్‌, ప్రణయ్‌ ముందు వేస్టయిపోయింది. గవర్నమెంటువారి ఎన్‌క్వైరీలాగా.‘‘మంటేవిటి? ఎందుకు?’’ అని అడగనన్నా అడగలేదు గురుడు. దాంతో అలకనందకు చేతుల్తో పాటు, ఒళ్ళు గూడా మండింది.ప్రణయ్‌కుమార్‌, ఎంటెక్‌ (సివిల్‌), తనకంటే ఏడాది చిన్నదైన అలకనంద, బి.టెక్‌ (సివిల్‌)ని, దైవజ్ఞులచే నిర్ణయించబడిన ఒకానొక శుభముహూర్తంలో పెళ్లాడేశాడు.ఇద్దరికీ ఒకే ప్రభుత్వశాఖలో ఉద్యోగం. ప్రభుత్వం వారు నిర్వహించే పోటీ పరీక్షల్లో నెగ్గిన ప్రణయ్‌, ఉద్యోగంలో మొదటి మెట్టయిన జె.ఇ.(ఎ.ఇ.ఇ) పోస్ట్‌ దాటి, రెండవ మెట్టయిన డియ్యీ (డి.ఇ.ఇ) పోస్ట్‌లోకి ‘పోల్‌వాల్ట్‌’ చేశాడు. అప్పటికింకా కాలేజ్‌లో ఫైనలియర్‌లో ఉన్న అలకనంద, ఆ పరీక్ష అవకాశం మిస్‌ అయి, దరిమిలా, అదే శాఖలో జేయీగా చేరింది.పెళ్ళవగానే, ప్రణయ్‌ అనేక వ్యయప్రయాసలకోర్చి, తనకీ తన భార్యకీ, ఒకే ఆఫీసులో పోస్టింగ్‌ ఇప్పించుకున్నాడు. ఆ ఆఫీసు అందరికంటే పెద్ద ‘బడాపెద్దసారు’వాడైన ‘ఈ ఎస్సీ’ది. అక్కడ పనిచేస్తూ, ఇద్దరూ హాయిగా భాగ్యనగరం వీధుల్లో నౌకావిహారం చేశారు. ముఖ్యంగా వర్షపాతం సాధారణ స్థాయికి మించిన రోజుల్లో.అంతలోనే, దుర్విధికి కన్నుగుట్టి, ప్రణయ్‌కి ఓ ఆపద వచ్చిపడింది.

 దాని పేరు ‘ప్రమోషన్‌’. అతన్ని ఈఈ అనబడే మూడో మెట్టు కొలువు లోకి నెట్టేస్తూ, పెంటపాడు ప్రాజెక్టుకి గెంటేశారు.హైదరాబాదుకి రెండున్నర గంటలు దూరంగా. అలకనంద బడాపెద్దసారువాడి యూనిట్‌ ఉద్యోగి గనుక, ఆమెని తొందరగా కదిలించరు. విజయమైనా, వీరస్వర్గమైనా అక్కడే. కాని ప్రణయ్‌కి అలాకాదు. నిజానికి పెంటపాడులో ప్రణయ్‌ పోస్టు, అంగరంగ వైభోగంగా ఆనందింప దగ్గదే! ప్రభుత్వం కల్పించినవీ, సంకల్పించినవీ అయిన పెక్కుభోగాల్తోపాటు, వాళ్ళు కల్పించనీ, సంకల్పించనీ పెక్కు భోగాలు కూడా అందుకో దగ్గవే! కానీ ప్రణయ్‌ మొదటితరహావి వదులుకోడు. రెండవతరహావి సహించడు, క్షమించడు. అయినా సుఖం గానే ఉన్నాడు. అతని కష్టమల్లా, తన జంటని జంటనగరంలో వదిలేసి, తను పెంటపాడులో పని చేయాల్సి రావడమే!అప్పటికి, అతను పనిచేసే ప్రాజెక్టులో ప్రతి వారం ఏవో ఏవో బడాబడా సందేహాలొచ్చి, అవి బడాపెద్ద సారు వాడే తీర్చాలి గనుక, వారానికి రెండు మూడు రోజులు మన జంటనగరాల్నీ, తన జంట నయగారాల్నీ అంటిపెట్టుకునే ఉండేవాడు. అలా సుఖంగా సాగిపోతున్న వాళ్ళ జీవితాకాశంలో ‘శశిరేఖ’ మాయమై, ఓ చీకటిరోజు రానే వచ్చింది.