ఆరోజు మధ్యాహ్నం దాటిన దగ్గర్నుంచి ఏకధాటిగా వాన కురుస్తూనే వుంది.వాచీలో టైము చూశాడు ఆనంద్‌. ఆరుంబావు అయింది. ‘ఈరోజు ఇక పద్మజ రానట్లే’అనుకున్నాడు. ప్రతి శనివారం సాయంత్రం ఆరు గంటలకు కొన్ని నిమిషాల ముందే తన ఇంటి గుమ్మం ముందు ప్రత్యక్షమవుతుంటుంది. ఈరోజు ఆరు గంటలయి పావు గంట దాటినా ఇంకా రాలేదంటే ఒక వేళ రాదేమో.’అనుకున్నాడు. మళ్లీ ఆ ఆలోచన రాగానే ఎంతో నిరుత్సాహం ఆవహించింది అతనికి.ఇంట్లోకి వెళ్లి టేప్‌ రికార్డర్‌ ఆన్‌ చేశాడు. ‘‘చూకర్‌ మేరే మన్‌ కో కియా తూనే క్యా యిషారా’ కిషోర్‌ కుమార్‌ గొంతు మధురంగా వినిపించసాగింది. అయితే ఒక నిమిషం కంటే ఎక్కువసేపు వినలేకపోయాడు. కారణం పద్మజ ఇంకా రాకపోవడమే టేపు ఆఫ్‌ చేసి ఈజీ ఛైర్‌లో పడుకుని పద్మజ గురించి ఆలోచించసాగాడు. అతనికి పద్మజ మొదటిసారిగా కనిపించిన దృశ్యం గుర్తుకొచ్చింది.ఆ రోజు కూడా వాన ఇలాగే విపరీతంగా కురుస్తోంది. అతను టేప్‌లో పాటలు వింటూ కూర్చున్నాడు. ‘మైనా భూలూంగా... మై నా భూలూంగీ’ ‘రోటీ కపడా ఔర్‌ మకాన్‌’ చిత్రంలోని పాట అది. అతనికెంతో ఇష్టమైన పాట. ఆ పాట కాగానే మరో పాట- ‘ఏ మేరా పత్ర్‌ పథ్‌కర్‌ కే తుమ్‌ నారాజ్‌ నా హోనా’ ఒక పాట తర్వాత మరో పాట అలా పాటల ప్రవాహంలో తడిసి అలసిపోయాక అతనికి కాఫీ తాగాలనిపించింది. లేచి స్టౌ మీద పాల గిన్నె పెట్టి తలుపు తెరిచి బయటకు వచ్చి చూశాడు. అపడు కనిపించింది ఆమె.

ఆమె వయసు దాదాపు ముఫ్పై ఏళ్లుండవచ్చు. స్టన్నింగ్‌ డ్యూటీ కాదు కానీ ఆకర్షణీయమైన మోము ఆమెది. కాంతివంతమైన కళ్లతో కోటేరు ముక్కు, పొడవాటి జడతో చూచే కొద్దీ చూడాలనిపించేలా వుంది. తలుపు తెరిచిన శబ్దం విని చటుక్కున అతని వైపు చూసిన ఆమె చూపుల్లో కొద్దిగా సిగ్గు, తప చేసిన భావన కనిపించాయి. ‘మీ అనుమతి లేకుండా మీ ఇంటి వసారాలో తలదాచుకున్నాను...సారీ అన్నట్లున్నాయి’ ఆ చూపులు.వరుణ దేవుడికి వాయుదేవుడు కూడా తోడయ్యాడులాగుంది. వర్షపు జల్లు వసారాలోకి పడుతూ ఆమెని తడిపేస్తుంది.‘అరే తడిసిపోతున్నారు లోపలకి రండి’ అన్నాడు ఇంట్లోకి దారి తీస్తూ, ఆమె అతన్ని అనుసరించింది. హాల్లోని కుర్చీ ఫ్యాను కిందకు జరిపి, ఆమెను కూర్చోమని చెప్పి, ఫ్యాన్‌ స్విచ్‌ ఆన్‌ చేసి వంటగదిలోకి వెళ్లాడు స్టౌ ఆర్పి మళ్లీ హాల్లోకి వచ్చి ‘టవల్‌ ఇవ్వనా!’ అడిగాడు.