‘‘ప్రియమైన మీకు!మిమ్మల్ని తొలిసారి కాలేజ్ క్యాంపస్‌లో చూశాను. క్రికెట్ లీగ్ మ్యాచ్ కోసం బ్యాట్ చేతపట్టుకొని మీరు గ్రౌండ్‌లోకి వస్తోంటే అచ్చం సచిన్‌లా కనిపించారంటే నమ్మండి!మిమ్మల్ని చూస్తుంటే ఎన్నో వసంతాల నుండి పరిచయం వున్న వ్యక్తిలా, ఆత్మీయుడిలా అగుపిస్తారు. అప్పట్నుంచి మీతో స్నేహం పెంచుకోవాలన్న ఆరాటం మొదలైంది.ఆ రోజు నాకింకా బాగా గుర్తుంది. కాలేజీ వార్షికోత్సవం రోజున మీరు పాడిన ప్రేమ గీతం నా హృదయాంతరాలలో ఇంకా మెదులుతూనే వుంది.డియర్ రాజా! ఎందుకో ఈ మధ్య నేను చేసిన ప్రతి పనీ మీకే చెప్పాలనిపిస్తోంది. ఇది మనిషి సాధారణ స్థాయి నుండి ప్రేమ స్థాయికి వెళ్లినపడు మాత్రమే జరిగే పరిణామం.ప్రస్తుతం నా ఉచ్చ్వాస నిశ్వాసాల్లో మీ గురించిన ఆలోచనలే! కలలో సైతం మీ ఊసుల్నే నెమరువేసుకుంటున్నాను. నా క్కావలసిన ప్రపంచాన్ని మీ కళ్లలోనే వెతుక్కోవాలనుకుంటున్నాను. మీతో మాట్లాడాలని ప్రతి రోజు ఖచ్చితంగా నిర్ణయించుకుంటాను. కానీ అదేం చిత్రమో మిమ్మల్ని చూడాలంటేనే భయం. అందుకే దూరం నుంచే చూపుల్తో సరిపెట్టుకుని తృప్తిపడుతున్నాను.
మొదట చూపులోనే మిమ్మల్ని ప్రేమించి ఒక వసంత కాలంగా ఎదురు చూస్తున్నా. ప్రేమాన్వేషణ పదరూపమే ఈ లేఖ... ప్రేమ లేఖ... మీ జవాబుకై ఎదురు చూస్తూ...మీభావన...లెటర్‌ని ఆసాంతం చదివిన రాజా ఓ అలౌకికానంద స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడి కళ్ల ముందు భావన రూపం మెదిలింది. ఈజీ ఛెయిర్‌లో వెనక్కి వాలి సీలింగ్ వైపు చూస్తున్నాడు. దూరంగా వేణుగోపాలస్వామి ఆలయంలోంచి ‘గీత’ వినిపిస్తోంది.‘‘జాతస్య హి ధ్రువో మృత్యుర్ర్దువం జన్మ మృతస్యచ....’’ఎంత కాంట్రాస్ట్ కదూ...! జీవం పోసే భావుకత నిండిన ప్రేమలేఖ చదువుతూ...మృత్యువు గురించిన వైరాగ్యపు వచనాలు వినడం...! గదిలో ఓ మూల సాలీడు ఒక దారంతో మరో దారం కలుపుకుంటూ అందమైన గూడు అల్లుకుంటోంది. ఎంత ఓర్పుగా, నేర్పుగా అతి కష్టపడుతోంటే జీవించడం కోసం అది పడుతోన్న తపన అర్థమవుతోంది. ఒక మలుపుని మరో మలుపుతో కలుపుకుంటూ పోతేనే జీవితం.