‘‘స్వప్నా... నిన్న చేలో నించి తెచ్చిన పండు మిరపకాయలూ, పచ్చి మిరపకాయలూ, టమాటాలూ ఒక సంచిలో పోయ్‌, అద్దంకి పోయొస్తాను మన్నాయ్‌ దగ్గరికి! పండు మిరపకాయలు మరిన్ని పోయ్‌, పచ్చడి పెట్టుకునిద్ది మా వదిన’’‘‘రేపు పోరాదూ? ఇయ్యాల మేదరమెట్ట నించి 70 మంది కూలోళ్ళు వస్తారంటివే! అంతమందితో కాయలు కోయించటం నా వల్లయిద్దీ, నువ్వు లేకుండా!’’‘‘రేపు పోయేది ఏం? రేపు మాత్రం కోత ఉండదూ? ఇంక వాళ్ళు ఎక్కడికీ పోరు. నెల పట్టనీయ్‌, రెండు నెల్లు పట్టనీయ్‌, మన కోత అయిపోవాల్సిందే! నేను ఉండి చేసేది ఏముంది? కోసే అమ్మకోసిద్దీ, జాగులు చేసే అమ్మ చేసిద్దీ! వెంకటేష్‌ గాడు కూడా ఉంటాడుగా!’’‘‘వాళ్ళకి కూలి ఎంతా?’’‘‘130’’‘‘120కి రమ్మని అడక్కపోయా?’’‘‘మనం అడిగితే వస్తారూ. అసలు జనం ఎక్కడ దొరికి చస్తున్నారు? ఎంతో కొంత, వాళ్ళు వస్తున్నందుకు సంతోషపడాలి!’’‘‘కూలి ఎంతెంత అవతందో!’’‘‘కూలి కాకుండా ఎట్ట ఉండిద్దే?’’‘‘చేలో అంతమంది కూలోళ్ళని పెట్టుకుని ఇప్పుడు లన్నదగ్గరికి ఎందుకంట?’’‘‘ఎందుకైతే నీకు ఎందుకే సోంబేరిదానా? ఆనపతులకి పోకుండా చెప్పిన పని చెయ్‌! లన్నదగ్గరకంట! అతి వాగుడు! టిఫిన్‌ అయిందా?’’‘‘ఇడ్డెన్లు ఉడికినయ్‌. పచ్చడి రుబ్బుతున్నా’’‘‘మిక్సీకి వేయకపోయా?’’‘‘కరెంట్‌ ఎక్కడ చచ్చిందీ?’’‘‘కానీయ్‌ అయితే తొందరగా! అదునులో అయినా పెందలకాడ పని చేసుకుందామని లేదు సోంబేరి ముకంది ఎక్కడో !’’ విసుక్కున్నాడు నాగార్జున.

ఇంతలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ వెంకటేష్‌ వచ్చాడు.‘‘తొందరగా టిఫెన్‌ చేసి కూలోళ్ళ కోసం పోయిరా! టక్కు డోరులు తీసి ఎంతమంది పడితే అంతమందిని ఎక్కించుకుని రా! మనం పెందలకాడ టక్కు తీసకపోయి పెడితే, వాళ్ళు పెందలకాడ వచ్చి ఎక్కుతారు. మన ఆలెస్యం చేస్తే వాళ్ళూ ఆలెస్యం చేస్తారు!’’‘‘నాదేం లేదు, పోవటమే మామా! పాతగుడ్డ ఉంటే ఇయ్యి అక్కాయ్‌, ట్రాక్టర్‌ తుడుచుకోటానికి!’’‘‘ఎక్కడెక్కడి గుడ్డలూ మీకు చాలటంలా! ఎన్నని తెచ్చి ఇయ్యమంటావురా?’’ దండెం అంచున పడేసిన చిరిగిపోయిన పాత లుంగీ తీసి డ్రైవర్‌కి ఇచ్చింది స్వప్న.‘‘మోటార్‌ సైకిలు కూడా తుడవరా!’’ పంచలో మంచం మీద కూర్చుని టీవీలో పాటలు చూస్తూ డ్రైవర్‌కి చెప్పాడు నాగార్జున.స్వప్న, నాగార్జున భార్యాభర్తలు.వాళ్ళు బీసీ. సెంటు పొలం లేదు. 20 ఎకరాల పొలం కౌలుకి తీసుకుని మిరప వేసాడు.నాగార్జున, 24 ఏళ్ళుగా మిరప పంట వేస్తున్నాడు. తనకి 18వ ఏడు నడుస్తుండగా పొలం పనుల్లోకి దిగాడు. మొదట్లో కౌలుకి పొలం తీసుకుని రెండు ఎకరాలు మిరపా, రెండు ఎకరాలు పత్తీ వేసాడు. తరువాత కొంతకాలం పత్తి పంట కూడా వేసినా, అది మానుకుని మిరపపంట ఒక్కటే వేయటం మొదలు పెట్టాడు.