‘ధైర్యే, సాహసే, లక్ష్మీ’ అనుకుంటూ ఆ ఇంటిగేట్‌ తీశాను-ఆ ‘శుభ సమయంలో’ రాకుండా ఇంత కాలానికి వస్తున్నందుకు ఏం కోప పడుతుందో అని భయపడుతూనే శ్రీలక్ష్మిని ధైర్యమూ, సాహసమూ వుండి కూడా లక్ష్యసాధన కోసం దూరం చేసుకున్న - నేను.గుమ్మం లోనే ఎదురయింది. ఎప్పటిలానే, పెదవుల చివర్ల నుంచి సాగి బుగ్గల లోతుల్లో విశ్రాంతి తీసుకుంటున్న చిరునవ్వు. విశాలమైన నుదుట నిండైన బొట్టు!‘‘ఇప్పుడా రావడం?’’ అంటోంది ఆ చిరునవ్వులోంచి విరిసిన చిరు కోపంతో, ఇల్లు చాలా చిన్నది. అయినా ఎంతో ముచ్చటగా, పొందికగా, ఇంకా చెప్పాలంటే మనోహరంగా ఉంది. నా వెనకే ఉండి కొత్త ఇల్లంతా చూపించింది. నా కాంప్లిమెంట్లు అన్నీ చిరునవ్వుతో వింటూ చివర్న అంది.‘‘అసలు నువ్వు చూడవలసినదీ, నేను చాలారోజులుగా నీకు చూపించాలని వెయిట్‌ చేస్తున్నదీ మా ఇల్లు కాదు చిట్టిబాబూ’’.పెరట్లో సర్వీ చెట్టుకింద తులసి కోట చూస్తున్నాను. చిన్నికోట, మట్టితో కట్టినది. ఆలికి, సున్నం ముగ్గులతో ఆ చల్లటి సర్వీనీడన ఆ తెల్లటి ముగ్గుల్లో విశ్రాంతి తీసుకోవాలనిపిస్తోంది. ఎంత ఆర్టిస్ట్రీ!! ఉత్త ఆర్టిస్ట్రీయేనా?‘‘పద చూపిస్తాను’’ అంటూ దారితీసింది.అయితే ఇవేవి కావన్నమాట. ఇంతకంటె తన మనసుని దోచి నాతో పంచుకోవాలి అనిపించే ఆ ఆనందం - ఏమిటో? అదే అన్నాను. పైకి.‘‘చూస్తావుగా!’’ అంటూ ఇల్లు దాటి కొద్ది దూరం నడిచింది.

దాదాపు రెండు వేల గజాల నేలలో కొంతమేర వంగతోట, కొంతమేర మిరపతోట, మధ్యలో చిన్నదొరువు. ఆ దొరువు చుట్టూ వేపచెట్లు, జీడి మామిడి పూల సౌరభం. అక్కడికి తీసుకువెళ్ళి -‘‘చూడు చిట్టీ! ఇప్పుడు’’ అంది.చిన్నప్పుడు ఆటల్లో కళ్లు మూసి ఎక్కడెక్కడో తప్పి హఠాత్తుగా ఎక్కడో వదిలేస్తే ఆ కాసేపూ ఎంతో వెలుగు - కళ్ళని పట్టనంత వెలుగులో - కళ్ళు కనపడేవి కాపు కాసేపటిదాకాను.అలాగే ఇప్పుడూను. ఈ అందానికి కళ్ళు పట్టడం లేదు. కళ్ళు కనిపిస్తూనే ఉన్నా ఆ చిన్న దొరువునిండా ఎర్ర కలువపూలు.కిందికి దిగి తాకబోయేను. ఆ కదలికకి జలజలజలా దొరువంతా చేపలు నీళ్ళని కొన్ని వేలు, లక్షల అలలుగా మార్చేశాయి. చిన్ని, చిన్నిఅలలు, వొళ్ళు ఝల్లుమంది నాకు. తలెత్తి చూశాను. చుట్టూ బంతిపూలు - బొబ్బాసి చెట్టు - అక్కడలేని మొక్కలేదు.‘‘ఏమిటిది? ఎవరిది? నీకెలా దొరికింది’’ అన్నాను. ‘‘ఆగాగు ఇన్ని ప్రశ్నలా, ఇది మనదే. అంటే మనది కాదనుకో... కాని అందమంతా మనదే. ఈ ఇంటికొచ్చిన మర్నాడు, వీర్రాజు పిలిచాడు. పిలిచి చూపించి రెండు కలువలు కోసి ఇవ్వబోయాడు. వద్దని... కొయ్యనివ్వలేదు. ‘‘మీకేం కావాలంటే అవి తీసుకోండమ్మా. ఇది మీతోటే అన్నాడు’’ అంది.