‘‘న తద్భాసయతే సూర్యో, న శశాజ్కో న పావకఃయద్గత్వా న నివర్తంతే, తద్థామ పరం మమ’’పదేళ్ళ భాస్కరం గొంతు చించుకుని, లేని పెంకు లెగిరి పోయేలా , భగవద్గీత పంచ దశాధ్యాయమైన పురుషోత్తమ యోగంలోని ఆరవ శ్లోకాన్ని బట్టీ కొడుతున్నాడు. ఎంత పెద్ద గొంతుతో చదివితే, అంత శ్రద్ధ వున్నట్లు లెక్క వాడికి. వంటింట్లో వున్న తల్లికి వినబడాలనే కోరికతో, వరండాలోంచి గట్టిగా కేకలెడుతున్నాడు. అలా అరుస్తూ చదివే శ్లోకంలో ఒక్క ముక్కకీ కూడా అర్థం తెలియదు వాడికి. వాడికే కాదు, ఆ ఇంట్లో పెద్దాళ్ళకి కూడా తెలియదు. బయట ఉన్న పెద్దాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు. అయినా సరే, ఆ సంస్కృత పదాలు చెవిన పడితే, ఆ ఇంట్లో వాళ్ళకీ, చుట్టుపక్కల వాళ్ళకీ ఒళ్ళు పులకరిస్తుంది తన్మయత్వంతో!అది మూడు వాటాలున్న ఓ బ్రాహ్మణ కొంప. భాస్కరమూ, వాడి అక్కా, తల్లిదండ్రులూ ఒక వాటాలో ఉంటారు. నాలుగు సందుల అవతల ఉన్న గోపాల స్వామి గుడిలో ప్రతీ యేటా భగవద్గీత పోటీలు జరుపుతారు. అందులో పాల్గొనే పిల్లలందరూ , గుళ్లో వాళ్ళు చెప్పిన ఏదో ఒక అధ్యాయం లోని కొన్ని శోక్లాల్ని అప్పజెప్పాలి. ఏ శ్లోకాలు అప్పజెప్పమంటారో తెలియదు కాబట్టి, పిల్లలందరూ మొత్తం అధ్యాయం అంతా కంఠతా పట్టేస్తారు.

 ఎవరు బాగా, రాగయుక్తంగా, తప్పుల్లేకుండా శ్లోకాలు అప్పజెబుతారో, వాళ్ళకి గుళ్ళో వాళ్ళు బహుమతులిస్తారు. ఎటొచ్చీ ఆ పోటీలో పాల్గోడానికి బ్రాహ్మణ, వైశ్య పిల్లలకి తప్ప వేరే వారికి అర్హత లేదు.భాస్కరానికి ఇప్పటి వరకు ఏ యేడూ బహుమతి రాలేదు. ఆ యేడాదన్నా ఒక చిన్న బహుమతి సంపాదించాలని వాడి తాపత్రయం.‘‘ఇంకాస్త గట్టిగా, శ్రద్ధగా కంఠతా పట్టరా!’ అంది వాడి తల్లి ఆ పక్కనించి వెళుతూ.తల్లిని సంతోష పెట్టేద్దామని ఇంకా గొంతు పెంచాడు భాస్కరం. ఈ తతంగం అంతా చూస్తున్న వాడి అక్క ‘‘ఆపరా నీ బడాయి! నీ అరుపులు వినలేక చస్తున్నాను. నేను పరీక్షలకి చదువు కోవాలి’’. అని తిడుతూ, పక్క వాటా ఆవిడ ఏదో అంటుంటే ఆపేసింది.‘‘మా దాసీ దానితో మాట్లాడుతున్నాను. దాని మాటొక్కటీ వినిపించట్లేదు. కాస్త గొంతు తగ్గిస్తావా నాయనా ? ’’ అనంటూ పక్క వాటా ఆవిడ కొర కొరా భాస్కరం వేపు చూసింది.బిక్క మొహం వేసి, అరుపులు ఆపాడు వాడు. లోపల్నించీ వాడి తల్లి చాలా విసురుగా అరిచింది. ‘‘నువ్వు శ్లోకాలు గట్టిగానే చదువుకోరా! ఎవరడ్డం వస్తారో చూస్తాను, శూద్రాళ్ళతో కబుర్ల కోసం, పవిత్రమైన భగవద్గీత శ్లోకాలు చదవడం ఆపాలా ? ఏమిటీ చోద్యం ? ఇలాంటి అనాచారం ఎక్కడా చూడం’’ అని.