ఆకాశం’ అనే మైదానంలోకి సూర్యుడు ఇంకా రాలేదు... చలికి జడిసి కాబోలు...నేను నడుస్తున్నాను... శరీరం చిన్నగా చెమట పడ్తూంది. వెనక్కి తిరిగి చూసాను... ఎవ్వరూ లేరు. తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాను.నాకు ఎప్పుడూ ఇద్దరు వ్యక్తులు సెక్యూరిటీగా ఉంటారు. వారి చేతుల్లో ‘గన్స్‌’ చూసాక నాకు అప్పుడప్పుడూ అనిపిస్తుంది ‘‘వేరే యమ భటులు ఎందుకు...? వీరే నా పాలిట యమదూతలని’’నిజం చెప్పొద్దూ... నేను మంత్రిని. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజాల్ని రక్షించాల్సిన మంత్రిని. మరి... నా రక్షణకి ఈ గన్‌మేన్‌లు... చిత్రంగా ఉంది కదూ...!నడుస్తూ... నడుస్తూ అటు చూసాను. అక్కడ చెట్టు క్రింద గుడిసెలో ఓ కుటుంబం నివసిస్తూంది. చెట్టు కొమ్మకి చిరిగిన చీర ఊయల కట్టి ఉంది. అందులో పసి బిడ్డ నిద్రపోతూంది. పక్కనరిక్షా. ఆ చిన్ని గుడిసెలో రిక్షావాడు. వాడితల్లి, భార్య, ఇద్దరు పిల్లలు. ఇలాంటిగుడిసెలు చాలా ఉన్నాయి. 

కొన్ని లక్షల మంది ఇలాంటి గుడిసెల్లోనే ఎండకి ఎండుతూ...వానకి తడుస్తూ బ్రతుకుతున్నారు.ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రతి సంవత్సరం ఇన్నేసి లక్షలు... అన్నేసి లక్షలు పక్కా గృహాలు నిర్మిస్తున్నాం. అవన్నీ ఏమైపోతున్నాయి...? ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి..?అయ్యో! నా మతి మండ... ఈ ప్రశ్నలకి- సమాధానం నేను చెప్పాలి గాని... నేనే వేస్తున్నానేమిటి...!?వాకింగ్‌ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసరికి నా సెక్యూరిటి ‘‘సార్‌... సార్‌...’’ అంటూ గాభరాగా వచ్చారు... ‘‘నేనేమైపోయానోనని... ఏ నక్సలైట్లు అయినా కిడ్నాప్‌ చేసారేమోనని...’’‘‘ఏమీ కాలేదు... ఏమీ కాదు... మీరు టెన్షన్‌తో నాకు టెన్షన్‌ పెట్టొద్దు...’’ అని కసురుకున్నాను.కాఫీ సిప్‌ చేస్తూంటే నా బావమరిది వచ్చాడు. ఎవరికో మెడికల్‌ సీటు కావాలంట...! నా ముందు దేభ్య ముఖం వేసుకొని నిల్చున్నాడు. వాడొట్టి వెధవ.

ఆ విషయం వాడి అక్కను చేసుకోక ముందే తెలుసు.నేను కాలేజిలో చదివే రోజుల్లో వాడి అక్కను ప్రేమించాను. ఆమె చాలా అందంగా, నాజూకుగా ఉండేది. ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా నన్ను ప్రేమించు...’’ అని ఆమె వెంట రాత్రనక, పగలనక జీతంలేని గార్డ్‌లా తిరిగాను. నేను ఇలా తిరుగుతున్నానని నా బావమరిది వెధవకి తెలిసి నన్ను రౌడీలతో కొట్టించాడు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ముష్టి యుద్ధాలు, వీధి పోరాటాలు జరిగాయి. నిజమైన ప్రేమకు ఇవేవీ ప్రతిబంధకాలు కావని... వాడి అక్కను లేపుకుపోయి పెళ్ళి చేసుకున్నాను.‘‘బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే ఆ కుర్రాడికి మెడికల్‌లో సీటు వస్తాది కదా...!’’‘‘నాకు తెలియదా... బావా!’’ అని రాగం తీసాడు.