‘‘నాన్నా! లే.... వింటున్నావా? నిన్నే...లేస్తున్నావా? లేదా?’’ కూతురు బలంగా కుదపటంతో ముసలాయన చిన్నగా మూలిగాడు. నల్లగా ముడతలు పడి వడలిపోయినట్టున్న మొహం ఒకటి కప్పుకున్న ఉన్ని దుప్పటిలోంచి కనిపించింది. ఎన్నో ఏళ్ళపాటు తవ్వకుండా వదిలివేసిన నేలరంగులో ఉంది ఆయన మొహం. కళ్ళు మూతలుపడి ఉన్నాయి. బరువుగా ఊపిరిపీల్చి వదులుతున్నాడు. సగం తెరిచిన నోటిలోనుంచి నాలుక బైటకు వేలాడుతోంది.‘‘పిలుస్తున్నానా... లే’’ గట్టిగా అరిచింది కూతురు.‘‘తాతా, తాతా’’ మంచం పక్కనే ఓ చిన్నపిల్ల మునికాళ్ళపై నిలబడి ముసలాయన మొహం వంక చూస్తూ పిలిచింది. ఆమె చిన్నమొహం కన్నీటితో తడిసి మరింత చిన్నబోయింది. దిండు మీద తడుతూ ‘‘తాతా’’ అంటూ మరోసారి పిలి చింది.‘‘నోర్ముయ్‌’’ అంటూ అరిచి పిల్లను పక్కకు తోసేసింది తల్లి. ‘‘బైటకు పోతావా లేదా’’ అంటూ పక్కనున్న కుక్కను కూడా గట్టిగా కర్రతో కొట్టింది. చిన్నపిల్ల వెక్కివెక్కి ఏడుస్తూ తన చిన్ని చిన్ని చేతులతో కళ్ళు నులుముకుంటూ స్టవ్‌ పక్కన నిలబడింది.

‘‘నాన్నా, నేను మంచిగా చెప్పినప్పుడే లేస్తావా లేదా?’’జబ్బుపడిన ముసలాయన కళ్ళు మూసుకుని పడుకునే ఉండిపోయాడు. ఆయన తల ఒక పక్కకు వాలిపోయి ఉంది. ఆయనకు బతకాలన్న కోరిక కూడా లేదు.‘‘పైకి లెమ్మన్నానా? ఏంటి నీ ఉద్దేశం? ఇక్కడే చచ్చిపోదామనుకుంటున్నావా! నేను బతికుండగా అది జరగదు. ఆ జూలియానా దగ్గరకి వెళ్ళు. ఆస్తి అంతా జూలియానాకే రాసి ఇచ్చావుగా! అదే చూస్తుంది నిన్ను. దాని దగ్గరకే వెళ్ళు. ఇంక లే. నేను లెమ్మన్నప్పుడే లేస్తావా లేదా?’’ముసలాయన ప్రభువుని తలుచుకుంటూ, మళ్ళీ మగతలోకి జారిపోయాడు. ఆయన మొహం చెమటతో తడిసిపోయింది. ముడతలు పడిన మొహంలో ఆందోళన కనిపించింది.కూతురు ముసలాయన్ని పరుపు మీద నుంచీ బలంగా కిందకు లాగింది. దానితో ఆయన తలా, భుజాలూ తప్ప మిగిలిన శరీరమంతా నేల మీదకు వచ్చేసింది. అయినా ముసలాయన కలప దుంగలా చలన రహితంగా ఉండిపోయాడు.‘‘ప్రీస్టు... ప్రార్థన’’... ఆయన చిన్నగా మూలిగాడు.‘‘ప్రీస్టుని నీకు నేనే ఇస్తా. నిన్ను పందుల దొడ్డిలో ఉంచి... పాపాత్ముడా... అక్కడే చద్దువుగాని’’ ముసలాయన చంకలకింద చేతులుంచి బలంగా ఆయన్ని లాగబోతున్నదల్లా కిటికీ పక్కనుంచీ నీడ కనపడటంతో ఆమె చటుక్కున ఆయన్ని అలాగే వదిలేసి ఉన్ని దుప్పటి కప్పింది. ముస లాయన కాళ్ళని మంచంమీదకు లాగడానికి కూడా ఆమెకు వ్యవధి లేకపోయింది. దానితో కోపంగా పరుపుని కాలితో ఒక తన్ను తన్నింది. పొరు గింటి రైతు భార్య డిజియాకోవా గదిలోకి వచ్చింది.