గేటు తెరుచుకున్న శబ్దానికి ఆ వృద్ధ దంపతులిద్దరూ తలెత్తి చూసారు.ఓ యువకుడు లోపలికి అడుగుపెట్టి తిరిగి గేటు వేస్తున్నాడు.‘మీ కోసమే అనుకుంటా’ అంటూ లేచి పనున్నట్లు ఇంట్లోకి వెళ్లిందామె. విశాలమైన వరండాలో ఆయనొక్కడే మిగిలాడు.పండుటాకులా ఉన్నాడాయన . కనపడని భారమేదో మోస్తున్నట్లు భుజాలు కిందకు వంగిపోయి ఉన్నాయి. కళ్లలో కాంతిపుంజాలకి బదులు బాధేదో కదలాడుతోంది. చేతిలో బాగా నలిగిపోయిన పాత పుస్తకం ఉంది. ఆయన ఇరవై నాలుగో పేజీ చదువుతున్నాడప్పుడు. ఎదురుగా కాఫీ టేబుల్‌. దాని మధ్యలో ఉన్న రేడియోక్లాక్‌ తేదీతో సహా సమయాన్ని చూపిస్తోంది. అందులో గురువారం ఉదయం తొమ్మిదిగంటలయింది. యువకుడు నేరుగా వృద్ధుడి వద్దకు నడిచాడు.పుస్తకం మూసేసి టేబుల్‌ మీదుంచుతూ అడిగాడాయన.

‘‘ఎవరు బాబూ నువ్వు? ఏం కావాలి?’’యువకుడు బదులీయకుండా ఆయన పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. అతడికేసి పరీక్షగా చూసాడాయన. ముప్పయి ఐదుకి అటూ ఇటుగా ఉన్నాడతడు. ముఖంలో కారు ణ్యం కనిపిస్తోంది.‘‘గుర్తుపట్టలేదా?’’ పది క్షణాల తర్వాత కూడా అలాగే పరికించి చూస్తున్న ఆయన్ని అడిగాడతడు, చిరునవ్వుతో.‘‘ఎవర్ని గుర్తుపట్టేది, నిన్నా? ఎప్పుడూ చూడలేదే’’ అన్నాడాయన కొంచెం విసుగ్గా.‘‘ప్రయత్నించండి. గుర్తుపట్టొచ్చు’’.‘‘బాబూ. నువ్వెవరో గానీ నా గురించి నీకు ఏమీ తెలీదనుకుంటా. నేనేదన్నా ఒకసారి చూస్తే జన్మలో మర్చిపోను. హైపర్‌ తైమీషియా పేరెప్పుడన్నా విన్నావా? నా కండిషన్‌కి వైద్యులిచ్చిన పేరది. చూసిన ప్రతి విషయమూ కళ్లకి కట్టినట్లు గుర్తుంటుంది నాకు. ఒక తేదీ తల్చుకుంటే ఆనాడు నాకెదురైన సంఘటలన్నీ అతి చిన్న వివరాలతో సహా ఆటోమేటిగ్గా గుర్తొచ్చేస్తాయి. కొందరు డాక్టర్లు దీన్నో అద్భుత శక్తి అన్నారు, ఇంకొందరు ఇదో అంతుపట్టని వ్యాధి అన్నారు. ఎవరేమన్నా, దాని వల్ల నేను అనుభవించే క్షోభ మాత్రం ఎవరికీ అర్థం కాదు’’ విసురుగా చెప్పాడాయన.‘‘నిజమే. హైపర్‌తైమీషియా ఉన్న వాళ్లకి మాత్రమే ఆ బాధ అర్థమవుతుంది. ప్రపంచంలో అలాంటివారు ఇరవైమందికి మించి లేరు’’వృద్ధుడు ఆశ్చర్యంగా చూసాడు. ‘‘ఓహ్‌, నీకు దాని గురించి తెలుసా! కొంపదీసి, నీకూ ఆ జబ్బుందా’’ అన్నాడు. ఈ సారి ఆయన గొంతులో విసుగు లేదు.