జీవితం అన్న పదం మూడు అక్షరాలదయినా అది ఎన్నో ‘రెండు’ అక్షరాల పదాలకు లోబడే వుంటుంది! గాలి, నీరు, భూమి, నింగి, అగ్ని, అన్నం, ప్రాణం, శ్వాస, నాడీ, రక్తం, సుఖం, దుఃఖం, భయం, బాధ, అమ్మ, నాన్న, అన్న, చెల్లి, అక్క, వూరు, వాడ...ఇలా...ఇక మన దేవుళ్ళందరూ కూడా రెండక్షరాలతోనే ప్రసిద్ధి నొందారు. రామ, కృష్ణ, శివ, సాయి, అల్లా, ఏసు, స్వామీ..స్వామి అన్నది వెంకటాచలపతికి, నరసింహుడికి, ఇంకా అనేక దేవతా మూర్తులకు సర్వనామం, అమ్మ అంటే అందరు దేవతల సర్వనామం.. ఈపేర్లు చె ప్పగానే మనిషికి భక్తి కలగవచ్చు. కాని భయం కలిగించవు.భయం, భవిష్యత్తు భయం. మరోరెండు అక్షరాలకు వుంది. రుజ(రోగం), జర(చావు). వీటికి భయపడని వాడు నిజంగా మహాత్ముడే! వ్యాధి...మరణం...అంటే భయపడని వాడు మహా మానవుడు.ముంబై...15 దేశ్‌ముఖ్‌ మార్గ్‌...జప్లోక్‌ హాస్పిటల్‌...సాయంత్రం ఆరుగంటలు. ఆసుపత్రి సందర్శకులతో కోలాహలంగా వుంది.ఏడు వరకు రోగుల బంధువులు చూడడానికి అనుమతి.ఏడు కాగానే, సెక్యూరిటీ వాళ్ళు ఉండనివ్వరు.

విసుక్కుంటూ, గొణుక్కుంటూ రోగుల బంధువులు అయిష్టంగా బయటకు వస్తూ వుంటారు. బాగా ధనవంతులు, సమాజంలో వున్నత వ్యక్తులు ఈ ఆసుపత్రికి వస్తారు.లూకుమల్‌ అనే ధార్మికుడు స్థాపించిన ఆ ఆసుపత్రి దేశంలో అత్యుత్తమ ఆసుపత్రిగా పేరు పొందింది. లబ్దప్రతిష్టులుగా పేరు పొందిన సినీ నటులు అమితాబ్‌, షమ్మి కపూర్లాంటి వాళ్ళకు ఈ ఆసుపత్రి మరో జన్మ ఇచ్చింది. (ఈ మధ్యనే షమ్మికపూర్‌ కాలం చేశాడు. క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితి నుండి బయటపడి చాలా కాలం జీవించారు) సాయంత్రం అన్ని రోగుల గదులూ కిటకిటలాడుతూ వుంటాయి.

ఒక్కటి తప్ప రూం నెంబరు 222. దాంట్లో ఒక వ్యక్తి వున్నాడు. పాస్‌పోర్టు ప్రకారం అతని పేరు ‘నూకల. కె.ప్రభు.’శివాజీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టు రిసెప్షన్‌ హాలులో స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని కలవాలని వచ్చిన వెంకటరత్నం అనే అతని స్నేహితుడు వెంటనే అతన్ని ‘జస్లోక్‌’కి తీసుకు వచ్చాడు. ముందు అత్యవసర విభాగంలో వాళ్ళు చూసి బిపి పరీక్షించారు. ఎక్కువగా వుంది. నాడిలో తేడాలు వున్నాయి. చాలా ‘వైల్డ్‌’గా మారిపోతూ వున్నాయి.