కృష్ణరాజపురం స్టేషనులో ట్రైను ఆగేటప్పటికి రవి యస్‌ టూ కోచ్‌ కిటికీల్లోంచి లోపలకు తొంగిచూస్తూ నా గురించి వెతుకుతూ ప్లాట్‌ఫారంపై తిరగడం నేను గమనించాను. ఎనిమిదేళ్ల తర్వాత నన్ను చూడడానికి వాడు పడే ఆత్రం, వాడి కళ్లల్లో కన్పిస్తూనే వుంది. నా పరిస్థితి కూడా అంతే. పెట్టెలోంచి బయటపడి ఒకరినొకరు గాఢంగా ఆలింగనం చేసుకున్న తర్వాత చూసుకుంటే, ఇద్దరిలోనూ కాలం తెచ్చిన మార్పులు చాలా కన్పించాయి. వాడైతే కాస్తంత లావు అయ్యాడు. మనిషి ఇంతకు ముందుకన్నా రంగు తేలి ఆకర్షణీయంగా వున్నాడు. నాకు వాడి కళ్లల్లో చిన్నప్పటి చురుకుదనం, చిలిపితనం అలానే వున్నట్టనిపించింది.నేను, రవి ఇద్దరం చిన్నప్పట్నుంచి ఒకే దగ్గర చదువుకున్నాం. నాకన్నా వాడు బాగా చదివేవాడు. టీచర్లందరికీ వాడంటే ప్రత్యేకమైన అభిమానం. దానికి కారణం వాడిలో వుండే చురుకుదనం, సమయస్ఫూర్తే. టీచర్లలో వాడంటే వుండే ప్రత్యేకతను ‘క్లాసులో ఫస్ట్‌ మార్కులు’ తెచ్చుకోవడం ద్వారా నిరంతరం వాడు నిలబెట్టుకునేవాడు. ఆ రోజుల్లో పన్నెండేళ్ల వయసపడే వాడు ఓ రకమైన సృజనాత్మకత కనపరిచేవాడు.

 వాడి పేరు ‘‘రవికుమార్‌’’ని వాడి ప్రతీ పుస్తక మీదా ఖ్ఖిూ ఖిౖూ అని రాసుకునేవాడు. అదేమిటని అడిగితే సూర్యుని మరో పేరు రవి. కొడుకుకి మరో రూపం కుమార్‌ వెరసి నా నామధేయం అనేవాడు. అంతేకాకుండా నోట్సు పుస్తకాల ప్రతీ పేజీలో ఓ మూల అడ్డంగా చిరింజీవి మొదటి సినిమా ‘‘పునాదిరాళ్లు’’ నుంచి అప్పటివరకూ నటించిన చిత్రాల పేర్లు, అలానే ఇండియాలో సిటీ పేర్లు రాసేవాడు.నా విషయానికొస్తే వాడి తర్వాత స్థానానికి పోటీ పడే ఇద్దర్లో నేనొకడ్ని. కాబట్టి మా ఇద్దరికీ చదువు దగ్గర ఏ విధమైన శత్రుత్వం కానీ, పోటీ తత్వం కానీ వుండేది కాదు. అది మా ఇద్దరి స్నేహం బలపడడానికి కారణమైంది.మామూలు రోజుల్లో మా చదువులతో కాలం గడిచిపోయేది. వేసవి సెలవుల్లో ఆటలు, పాటలు, తోటల్లో తిరగటాలు, ఏట్లో స్నానాలు, టూరింగ్‌ టాకీసు సినిమాలతో రోజులు నిండిపోయేవి. పదవ తరగతి వరకూ కలిసి సాగిన చదువు, తర్వాత నేను పాలిటెక్నిక్‌లోనూ, వాడు ఇంటర్మీడియేట్‌ జాయిన్‌ అవ్వడంతో విడిపోయింది. చదివేదారులు వేరయిపోయినప్పటికీ మేం మాత్రం సెలవుల్లో కలుసుకొని కబుర్లన్నీ చెపకుంటుండేవాళ్లం.పాత రోజుల వేసవి కాలం కబుర్లకీ, ఇప్పటి కాలేజీ కబుర్లకీ చాలా వ్యత్యాసం వుండేది. పాత కబుర్లలో ఆటలు, పాటలు, గిల్లికజ్జాలు, దొంగమామిడి కాయల్లాంటివి వుంటే, ఈ కాలేజీ కబుర్లలో సినిమాలు, సిత్రాలు, అమ్మాయిలు వారి అందాల్లాంటి యవ్వనోత్సాహాలు తొంగిచూసేవి. వీటన్నింటితో పాటు అభిరుచులు, అలవాట్లు, కెరీర్‌, సంపాదన, లక్ష్యాలు కూడా ఇమిడి వుండేది. మా ఇద్దరికీ వుండే కామన్‌ అభిరుచి సాహిత్యం. నేను చిన్నచిన్న కవితలు గట్రా రాసేవాడ్ని. వాడికి సాహిత్యం చదవడం మాత్రమే అభిరుచి.