ఆ పెళ్ళి ఊళ్ళోనే జరగాలని పెద్దాయన మంచి పట్టుమీద ఉన్నాడు. బంధువర్గం అందరిలో అదే చర్చ. ముప్ఫై ఏళ్ళ క్రితం అది రెండు వందల గడపల ఊరు. ఇప్పుడు రెట్టింపై ఉండొచ్చు. అయినా, ఆ ఊరికి అధునాతన సౌకర్యాలన్నీ ఏర్పడలేదు. ఏ గట్టి అవసరం వచ్చినా, నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నఏలూరు మీదే ఆధారం.

అయినా, ఆ ఊళ్ళోనే అంటే పాతూరులోనే పెళ్ళి జరగాలంటున్నాడు పెద్దాయన. ఆయన ఎనభై అయిదేళ్ళ జీవితంలో అంతగట్టిగా ఏ విషయం మీదా పట్టుపట్టలేదు. ఆయన్ని కాదనటానికి ఎవరికీ మనసు రావటం లేదు. పాతూరులోనే పెళ్ళంటే... వెళ్ళటం, అక్కడ ఉండటం, తిరిగి రావటం కూడా శ్రమే. అయినా తప్పేలా లేదు. అంతగా అయితే ఏలూరులో హోటల్‌ రూములు తీసుకుని అక్కణ్ణించి రోజూ పాతూరు వెళ్ళి రావటం చెయ్యాలి. పాతూరులో చాలాచోట్ల సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ కూడా సరిగా అందదు.మేనకోడలి పెళ్ళి. తప్పకుండా వెళ్ళాలి. వెళ్ళటమే కాదు, అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యేవరకూ ఉండాలి. ఎలా, ఏరకంగా ఏర్పాట్లు చేసుకోవాలా అన్న ఆలోచనలో ఉన్నాడు సుధాకర్‌. ఆ ఆలోచన తేలకముందే పెద్దాయన దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది.పెళ్ళి పాతూరులో అంటే అంత సౌకర్యంగా ఉండదని మీరందరూ జంజాటనలో ఉంటారని నాకు తెలుసు. అంత అసౌకర్యం ఏమీ ఉండదు. అందుకని, అందరూ తిన్నగా పాతూరుకే రండి. ఎక్కడా హోటళ్ళు అవి తీసుకోవద్దు. మీకిక్కడ సౌకర్యంగా లేనప్పుడు ఆ ఆలోచన. అందరికీ ఇలాగే తెలియచేస్తున్నాను. గమనించవలెను.

తాతయ్య రామబ్రహ్మం గారి గురించి సుధాకర్‌కి బాగా తెలుసు. బంధువర్గంలోనే కాదు, పాతూరు మొత్తంలో ఆయనకి మంచి పేరుంది. ఏదైనా ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే, ఇలా సున్నితంగానే చెపుతారు. ‘గమనించవలెను’ అంటే, అలాగే చెయ్యమని, వేరే ఆలోచనేం వద్దని. దీనితో ప్రయాణం తిన్నగా పాతూరుకే అని నిర్ణయం అయిపోయింది.పెళ్ళంటే, ఈ రోజుల్లో ఓ భారమైన పనైపోయింది. చేసేవాళ్ళకి, చేసుకునేవాళ్ళకి, వచ్చి చూసేవాళ్ళకి... అందరికీ ఓ తప్పనిసరి బాధ్యత అయింది. అందులో పాతూరులాంటి చోట పెళ్ళంటే, అందరికీ ఇబ్బందే అన్న నిర్ణయానికి వచ్చాడు సుధాకర్‌.పెళ్ళికి బయలుదేరాక కూడా అంత ఉత్సాహంగా లేదు. సుధాకర్‌, అతని కుటుంబం రాత్రంతా ప్రయాణం చేసి, తెలతెలవారుతుండగా పాతూరు చేరారు.కాలవ గట్టమ్మట ప్రయాణం సాగుతుంటే చిత్రంగా ఉంది సుధాకర్‌కి. అతనా ఊరికి వచ్చి నాలుగేళ్ళు దాటింది.కాలువ ఇదివరకంత నిండుగా లేదు. గట్లమీద చెట్లు కూడా అంత దట్టంగా లేవు. చల్లదనం కూడా అంతగా లేదు. కొన్ని ఇళ్ళు, వీధులు స్వల్పంగా మారాయి. తెలిసున్న వాళ్ళెవరూ కనపడలేదు.