సీతారత్నం చెంబు తీసుకుని బయల్దేరుతుంటే పున్నమ్మ చూసి ‘‘అప్పుడే ఎక్కడికే? ఇంకా సరిగా చీకటి పడనేలేదు’’అన్నది.‘‘అక్కడికెళ్ళేటప్పటికి పడుద్దిలే’’ అన్నది సీతారత్నం.‘‘కొసేపాగు. ఒక్కదానివే ఎందుకెళ్తావ్‌? వదిన కూడా తోడొస్తదిగా’’ అన్నది పున్నమ్మ.‘‘కడుపునొప్పిగా ఉందమ్మా!’’ అంటూ హడావిడిగా నడిచింది సీతారత్నం.‘‘జాగ్రత్త! పురుగు పుట్రా వుంటాయ్‌’’ అని హెచ్చరించింది పున్నమ్మ కూతుర్ని.‘‘ఆఁ..ఆఁ...’’ అన్నది సీతారత్నం వడిగా అడుగులేస్తూ.ఆమె అవసరం అటువంటిది. కామాపురంలో డబ్బున్నోళ్ళకే మరుగుదొడ్లున్నాయి. బీదవాళ్ళు బహిర్భూమికి వూరి చివర పొలం గట్ల దగ్గరకి వెళ్ళాల్సిందే! మగవాళ్ళు ఏ సమయంలోనైనా వెళ్తారు. ఆడవాళ్ళు మాత్రం తెల్లవారుజామున, చీకట్లోనూ, సాయంకాలం చీకటి పడిన తర్వాత మాత్రమే వెళ్ళడం అలవాటు. తరతరాలుగా అదే ఆచారం. బహుశా ఆ ఊరు పుట్టినప్పటి నుంచీ.పున్నమ్మ కొడుకు రాంబాబుకి పెళ్ళయి కోడలు వచ్చిన దగ్గర్నుంచి మొగుడిని అడుగుతూనే వుంది మరుగుదొడ్డి కట్టించమని. దేవయ్య వింటేనా‘‘చూద్దాంలే!’’ అంటాడు రాజకీయనాయకుడి మాదిరిగా.కొడుకులిద్దరూ, తనూ కూలి పనులకెళ్ళి సంపాదిస్తున్నా సంసారం గడవడం అంతంతమాత్రమే. డబ్బు మిగలడం లేదు. ఏదొక అవసరం వస్తుంది. షావుకారు దగ్గర అప్పులు తెస్తుంటారు. తీరుస్తూంటారు. మళ్ళీ మళ్ళీ అప్పులు చేస్తుంటారు. దేవయ్యకి తాగుడు అలవాటొకటి. ఎంత సంపాదన వుంటే ఏం లాభం? కుండకు చిల్లి పడినట్లే.

కామాపురం హామ్లెట్‌ గూడెంలో అన్ని కుటుంబాల పరిస్థితీ దాదాపు అట్లాగే వుంటుంది. చీకటి పడింది. చంద్రుడు పైకి లేస్తున్నాడు. మబ్బులు అడ్డం పడుతున్నాయి. జొన్న చేను గట్టు మీద నడుస్తోంది సీతారత్నం. మసక మసక వెలుగులో ఒక్కొక్క అడుగే జాగ్రత్తగా వేస్తోంది. ఏ కలుగులో నుంచి ఏ పాము వస్తుందో అని భయం. నాగుపాములు తెలివైనవి. మనిషి అడుగుల చప్పుడు ఎంతో దూరం నుంచే గ్రహించి తప్పుకుంటాయి. బురదపాములు, దాసరి పాములతోనే తంటా. అవి కాళ్ళకి చుట్టుకుంటాయి. భయంతో గుండె ఆగినంత పనవుతుంది.జొన్న చేను దాటింది సీతారత్నం. నల్ల తుమ్మ చెట్టు కిందికి రాగానే ఆమెకు అడ్డంగా నిలబడ్డాడు వీరేంద్ర.సీతారత్నం హడిలిపోయింది. కెవ్వు కేక పెట్టింది.‘‘ష్‌...అరవకే రత్నం నేనే...!’’ అన్నాడు.సీతారత్నం గుర్తు పట్టింది. సర్పంచ్‌ కొడుకు అతను. అంతా ‘చినబాబు’ అంటారు. జులాయి వెధవ.‘‘అడ్డం లెండి చినబాబూ!’’ అంటూ పక్కకు తప్పించుకుని వెళ్ళబోతున్న సీతారత్నం చేతిని గట్టిగా పట్టుకున్నాడు అతను.‘‘నీ మీద ఎప్పట్నుంచో మోజుగా వుందే రత్నం. సుబ్బుల్తో కబురు చేశానే నీకోసం. నువ్వు బిర్రబిగుసుకుని వున్నావ్‌’’ అన్నాడు.‘‘నాకు ఇష్టం లేదు బాబూ! ఇబ్బంది పెట్టకండి’’ అంటూ చేతిని వదిలించుకోవడానికి గింజుకుంది.‘‘ఏం ఇష్టంలేదే? మగాడంటే ఇష్టం లేదా? ఎన్నాళ్ళుంటావే మగాడు లేకుండా. నీ అయ్య నీ పెళ్ళి చేసే పరిస్థితి లేదు ఇప్పట్లో. నాతో వుండు. నీకేం కావాలో అన్నీ ఇస్తా!’’ అంటూ ఆమెను వుడుం పట్టు పట్టాడు.