శృంగార రస శిఖరాగ్ర అంచులు చేరి అలసిసొలసిన శరీరాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు తప్ప గది నిండా అలుముకున్న నిశ్శబ్దం. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ప్రక్కకు తిరిగి ‘‘పిల్లల సంగతి ఏంచేద్దాం? ఇంకా ఆగితే వయసు మీరిపోతుందేమో?’’ అడిగాడు శశాంక.‘‘నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రెగ్నెన్సీ రావటమూ - తొమ్మిది నెలల తర్వాత కాన్పు ఈలోపులో బీపీ కానీ షుగర్‌ కానీ వస్తే మొత్తం తొమ్మిది నెలలతో పాటు మరి కొంతకాలం బెడ్‌ రె స్ట్‌. 

ఇవన్నీ ఆలోచిస్తే ప్రస్తుతం మనం హాస్పటల్‌ మీద పెట్టిన పెట్టుబడి లెక్కలు కడితే ఆదాయము - వడ్డీ - ప్రాక్టీసు అన్నీ కలపి నావైపు నుంచి కనీసం ఇరవై లక్షలు దాకా సంవత్సరానికి లోటు వస్తుంది. మరి కొంతకాలం ఆగాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను ’’ అంది శ్రీనిఽథి.‘‘నిజమే! లేడీ డాక్టరు ప్రాక్టీసులో హస్తవాసి మంచిదని ప్రచారం జరిగితే ఆడవాళ్లందరూ క్యూలో ఉంటారు. శ్రీనిథి చెప్పింది కూడా సబబే’’ అనుకున్నాడు శశాంక మనసులో.=====శశాంక, శ్రీనిఽథి - ఇద్దరు మెడికల్‌ కాలేజీలో ఉన్నప్పుడే ప్రేమించి, చదువులు పూర్తి కాగానే పెళ్లి చేసుకున్నారు. శశాంక్‌ సర్జన్‌. శ్రీనిథి గైనకాలజిస్ట్‌. విశాఖపట్టణానికి సుమారు వంద కిలోమీటర్లదూరంలో అయిదు సంవత ్సరాల క్రితం నర్సింగ్‌హోమ్‌ పెట్టారు. పది - పదిహేను గ్రామాల కూడలి కావటమూ, చుట్టు పక్కల నర్సింగ్‌హోమ్‌ లేకపోవడమూ వాళ్లకి కలిసి వచ్చింది.

త్వరలోనే ప్రాక్టీసు అంచెలంచెలుగా ఎదిగింది. దాంతో బ్యాంక్‌ లోన్‌ తీసుకుని హాస్పటల్‌ అభివృద్ధి చేశారు. ప్రస్తుతం దాని విలువ రెండుకోట్ల పై మాటే.ఉదయం పది గంటలు. హాస్పెటల్‌లో ఓ.పి పేషంట్స్‌తో కిటకిటలాడిపోతోంది. శ్రీనిథి రూమ్‌లోకి నర్స్‌ వచ్చి ‘‘మేడమ్‌! అన్నపూర్ణ వచ్చింది. చాలామంది పేషెంట్స్‌ ఓ.పిలో ఉన్నారు, కాసేపు ఆగమంటారా? అన్నపూర్ణని పంపించమంటారా?’’ అడిగింది.‘‘అన్నపూర్ణని లోపల టేబుల్‌ మీద పడుకోబెట్టు. ఇద్దరు ముగ్గుర్ని చూసి వచ్చి అన్నపూర్ణని పరీక్ష చేస్తాను’’ అంది శ్రీనిథి. ‘అలాగే మేడమ్‌’ అంటూ నర్సు వెళ్లిపోయింది.అన్నపూర్ణ ఇంటింటికీ తిరుగుతూ - ఆ ఊళ్ళో కూరగాయలు అమ్ముకుంటూ ఉంటుంది. శ్రీనిథి ఆ ఊళ్ళో అడుగు పెట్టిన దగ్గర్నించి అన్నపూర్ణ వాడుకగా కూరగాయలు ఇవ్వటంతో చాలా మాలిమి అయ్యింది. ఇంట్లో మనిషిలానే ప్రవర్తిస్తుంది. శ్రీనిథికి కూడా అన్నపూర్ణ అంటే నమ్మకమూ, అభిమానమూ, అవసరమైనప్పుడు కాస్త డబ్బు సహాయం కూడా చేస్తూ ఉంటుంది.కొంతసేపు తర్వాత శ్రీనిథి, అన్నపూర్ణ పడుకొని ఉన్న టేబుల్‌ దగ్గరకు వచ్చింది. ‘‘అన్నపూర్ణా! నీరసంగానీ, ఆయాసంగానీ ఉందా? బలమైన తిండి తింటున్నావా?’ అని అడిగింది బిపి చెక్‌ చేస్తూనే.