నల్లమోడాలు చుక్కలాకాశాన్ని కమ్ముకున్నేయి.ఆకాశం గుడ్లురిమింది. తళతళా మెరుపులు మెరిసినాయి.చిలకముక్కు దీపం భయపడిపొయ్యి పెద్దింటి దీపాన్ని కావిలించుకునింది.‘‘ఏం మెరుపులమ్మా! కండ్లు తూట్లు పడేట్టు వుండాయి. ఏం ఉరుములమ్మా! ఆకాశం తునిగి నెత్తిన పన్నెట్టు’’ అని కండ్లు మూసుకునింది.‘‘మెరుపు మెరవకుండా వుంటుందా? ఉరుము ఉరమకుండా వుంటుందా?’’ అనింది పెద్దింటి దీపం.‘‘ఉరుములంటే నాకు సచ్చేంత భయం’’ అనింది చిలకముక్కు దీపం.‘‘కండ్లు తెరిసి ఆ మెరుపును చూడు. నీ కండ్లల్లో ఎన్ని ఆశల్ని మెరిపిస్తుందో. ఉరుముతుందేగాని ఆకాశం ఎంత దయగలది అనుకున్నావు? అంతలోనే జల్లున వానై కురుస్తుంది’’ అనింది పెద్దింటి దీపం.ఆ మాటతో కండ్లు తెరిసి చూసింది.తళతళమని మెరుపు మెరిసి చిలకముక్కు దీపం కండ్లల్లో వొదిగిపోయింది.‘‘చూసావా? భయపడితే ఉరిమింది. భయపెడితే నీ కండ్లల్లో వొదిగింది’’ అనింది పెద్దింటి దీపం.ఉరుములతో మెరుపులతో ఆకాశం ఉగ్రమొచ్చినట్టుండాది.‘‘గాలీవాన వస్తే పెద్దపెద్ద నరమానులే వేళ్ళతో సహా పెళ్ళగించుకోని కూలిపోతాయి. కాని గడ్డిపోచ గుండె నిబ్బరంతో తలెత్తుకోని నిలబడుతుంది. బంగారాన్ని పట్టుకుంటే మన్నయిపొయ్యేది. గుండె నిబ్బరంతో ఆ మన్నులోనే బతుకుని పండించుకున్న రైతు కత చెప్తాను మీకు. వింటారా?’’ అని అడిగింది పెద్దింటి దీపం.‘‘జరిగిన కతైతే అందరూ చెప్తారు. రేపు ఏం జరగబోతుందో కవిగట్టి కత చెప్పగలవా?’’ అని అడిగింది నగిరింటి దీపం.

ఆ మాటకి కొంచేపు ఆలోచనలో పడింది పెద్దింటి దీపం.‘‘ఈ నగిరింటిది నన్ను భలే ఇరకాటంలో పెట్టిందే! జరగబోయేదాన్ని కవిగట్టి కత చెప్తే బెమ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు చెప్పాలి’’ అని చక్కాలు ముక్కాలు ఏసుకుని కండ్లు మూసుకునింది.దీపాలు మొగాలు చూసుకొన్నేయి.కండ్లు తెరిసి అనింది గదా!‘‘రాబోయే కాలంలో ఏడేళ్ళు కరువు పెట్టబోతావుండాది. ఆ కరువులో జరిగిన కతని చెప్తాను మీకు’’ అని కతనెత్తుకునింది పెద్దింటి దీపం.్‌ ్‌ ్‌ఏడేళ్ళు కరువు పెట్టింది.కరువులో బీదాబిక్కేగాదు సన్నాబన్నా రైతులు గూడా ఉత్తర చూసి గంపని నెత్తికెత్తుకున్నేరు. ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపొయినాయి. కాటికి కాళ్ళు సాపుకోనుండే ముసలోళ్ళు మాత్తరమే మిగిలినారు.ఆ కరువులో గోపినోళ్ళ కుటుంబం గూడా పీలేరుకి వలసపొయింది.