ఈ రోజు చంద్రగ్రహణం సాయంత్రం 5.02 నుంచి ప్రారంభం! భారతి వంటవాడు వంట చెయ్యనని భీష్మించుకుని కూచున్నాడు. ‘‘చంద్రుడికి అంత కష్టం వస్తే ఎలా తిండి సహిస్తుంది?’’ అని ప్రశ్నించాడు.‘‘ఈ కన్నారావుతో వాదించే కంటే మన టిఫిన్‌ మనమే చేసుకోవడం మేలు...’’ అని భారతి వంటింట్లోకి నడిచింది. భారతి ఎంఏ సోషియాలజీలో నా క్లాస్‌మేట్‌. ఇప్పుడు నేను ఎంఫిల్‌ లో చేరాను. భారతి చదువు ఆపేసింది. వాళ్ళ కుటుంబం దాని పెళ్ళి చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. కలవారి అమ్మాయి భారతి. బంగారంలాంటి మేనిరంగు, సన్నజాజి పువ్వు లాలిత్యం, రోజాపువ్వు గాంభీర్యం, పిరుదులు దాటే నీలవేణి కుటిల కుంతలాలు... కాని మనసే మందారం రంగులో వుందేమోనని నా అనుమానం.మేము బయటకు వస్తూ వుంటే అంది భారతి. ‘‘ఇవాళ మధ్యాహ్నం నుంచి సూర్యుడు డీలాగా వున్నాడేమిటి?’’ చలి కాలంలో అలాగే వుంటాడని నేను చెప్ప బోయేంతలో, కన్నారావు అన్నాడు‘‘చంద్రుడికి ఇంత కష్టం వచ్చిందని సూర్యుడికి బెంగ! అందుకే అలా వున్నాడు’’ ఈ లాజిక్‌కి నాకు ఫక్కున నవ్వు వచ్చింది. భారతి వాడికేసి తినేసేటట్లు చూసింది.

 భారతి ఆలోచనలు మామూలు ఆడపిల్లలా వుండవు. మన రాజకీయాల పైనా, ప్రస్తుత సమాజం పైనా దానికి చాలా కోపం. చరిత్రహీనులైన తమ అనుంగు బిడ్డలను శ్రమ లేకుండా అందలాలు ఎక్కించే రాజకీయ నాయకులన్నా, అవినీతి గురించి ఒక పార్శంతో మాట్లాడుతూ, మరో పార్శంతో లోపాయికారిగా లంచాలు మెక్కే ఉద్యోగులన్నా, ‘స్యూడో’ సంఘ సంస్కర్తలన్నా, అసంబద్ధ ప్రేలాపనలన్నా దానికి వళ్ళు మంట. నాకు దాని భావాలు అర్థం కావు. మూడు గదులు మధ్య తరగతి మనస్తత్వం నాది... ఎంఫిల్‌లో మా గైడ్‌ నాకిచ్చిన విషయాలు మూడు.

‘కాలుష్యం...భూమిపై దాని పరిణామాలు’, రెండోది ‘భారత ప్రజాస్వామ్యంలో రాజకీయాలు’, ఇంక మూడోది ‘మనదేశంలో అవినీతి రూపు మాపడం ఎలా?’ నాకు ఈ ప్రాజెక్ట్‌ వర్క్‌ మీద పెద్ద నమ్మకం లేదు. యూనివర్శిటీ గ్రంధాలయంలో పాత రిపోర్టులు చూసి, అక్కడ ఇంతా, ఇక్కడ ఇంతా కలిపి, ముక్కల పులుసు కాచినట్టు, ఒక కొత్త రిపోర్టు వండేయడమే! భారతి అందుకు ఒప్పుకోలేదు.