‘ఒరేయ్‌..! వెంకట్రావ్‌ ఇది విన్నావా...!’ అంటూ గాబరాగా వెంకట్రావ్‌ ఇంటికి వచ్చాడు అతని చిన్ననాటి మిత్రుడు సీతారాం.‘అబ్బా ఏ విషయం రా...! అయినా అసలు విషయం ఏమిటో పూర్తిగా చెప్పకుండా ‘ఇది విన్నావా’ అంటే నాకు ఏం తెలుస్తుంది’ చదువుతున్న మహాభారతాన్ని మూసి చిన్నగా నవ్వుతూ అన్నాడు వెంకట్రావ్‌.‘అదే మన ఊరి కరణం సుబ్బారావుగారు లేరు, ఆయనకి సడనుగా హార్ట్‌ ఎటాక్‌ వచ్చి ఓ గంట క్రితమే పోయారట’ అంటూ అసలు విషయం చెబుతూ బాధగా అన్నాడు సీతారాం.‘అదేంటి, అంత మంచి మనిషికి ఇలా సడనుగా ఎటాక్‌ రావడమేమిటి? అందులోను ఆయనది చాలా చక్కటి ఆరోగ్యం కూడాను’ ఆశ్చర్యంగా అన్నాడు వెంకట్రావ్‌.‘నిజమే నువ్వన్నట్లు ఆయనది చాలా మంచి ఆరోగ్యమే, అయితే కొన్ని కొన్ని సంఘటనలు ఎంతటి బలవంతుడినైనా బలహీనుణ్ని చేస్తాయి. మన సుబ్బారావుగారి విషయంలో కూడా అదే జరిగింది, అంతా ఆయన కర్మ’ చెప్పడం ఆపాడు సీతారాం.‘ఏంటి నువ్వనేది, ఈ మధ్యనే కదా మనం ఆయన్ని ఈ ఊళ్ళోనే ఉన్న వృద్ధాశ్రమంలో కలిసాము. అప్పుడు బాగానే ఉన్నారు. మరి అంతట్లో ఏం ముంచుకొచ్చింది’ అడిగాడు సీతారాం.‘అవును నువ్వనేది నిజమే, కానీ నీకో విషయం తెలియదు. మనం ఆయన్ని కలిసినప్పుటికే ఆయన ఆరోగ్యం బాగా కుంటుబడింది. ఆదేమీ మనకి తెలియకుండా, గుండెలోని బాధను గొంతులోనే తొక్కేసి, పైకిమాత్రం ఏమీ లేనట్లుగా మనతో నవ్వుతూ మాట్లాడారు.

‘నీకు తెలుసుకదా కొడుకు చదువు నిమిత్తం మన కరణంగారు ఉన్న ఇంటిని, పొలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టారు. ఇప్పుడు వాడిని బాగా చదివిస్తే, వాడు రేప్పొద్దున్న ఏదో ఉద్దరిస్తాడన్న పిచ్చి ఆశతో ఉన్నదంతా ఊడ్చిపెట్టి వాణి ్ణ అమెరికాకు పంపించాడు. తీరా అక్కడికి వెళ్ళిన వాడికి చెడు స్నేహాలు అబ్బడంతో చదువు కాస్తా చంకనాకింది. దాంతో ఆ కాలేజీవాళ్ళు వాడి స్కాలర్‌షిప్‌ ఆపేసి అదే విషయాన్ని బ్యాంకు వాళ్ళకి తెలియజేసారుట. ఇంకేముంది బ్యాంకువాళ్ళు ఉన్నపళంగా తీసుకున్న అప్పైనా తీర్చండి లేకపోతే తాకట్టు పెట్టిన ఆస్తులను జప్తు చేస్తామని కరణంగారికి నోటీసు పంపించారట.విషయం ఏమిటో పూర్తిగా తెలియని కరణంగారు కొడుకుతో మాట్లాడితే చావు కబురు చల్లగా చెప్పి ‘మీరే ఎలాగోలా అప్పు తీర్చేయండి’ అని చెప్పి మరలా ఈయన ఎన్నిసార్లు ఫోను చేసినా కనీసం జవాబుకూడా ఇవ్వకుండా ఉన్నాడుట. దాంతో ఆయన చేసేది ఏమీలేక తన ఆస్తులన్నింటిని బ్యాంకు వారికి అప్పచెప్పి కట్టుబట్టలతో ఇదిగో ఇలా ఆ వృద్ధాశ్రమంలో చేరారు. ఈ విషయం నువ్వు అదే ఆశ్రమంలో ఉన్న మీ పిన్నిగార్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు పాపం ఆయన నా దగ్గర చెప్పుకుని ఎంతో బాధపడ్డారు’ అంటూ జరిగింది చెప్పాడు సీతారాం.