తెల్లవారుఝాము నాలుగ్గంటలకి అలారం మోగింది. మేఘన చపన లేచి అలారం ఆఫ్‌ చేసింది. నిజానికి నిద్రమత్తుతో కళ్ళు విపకోవడం లేదు. కానీ తప్పదు. పరీక్షలు ప్రారంభమయ్యాయి. కనీసం ఎనభైశాతం మార్కులు రాకపోతే - తనకీ, అమ్మకీ నాన్నచేతిలో శిక్షలు తప్పవు. అమ్మకోసమైనా తను బాగా చదవాలి. గత నెలలో జరిగిందంతా గుర్తొచ్చింది. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. పట్నంనుంచి రావాల్సిన నాట్యగత్తె రాలేదట. నిర్వాహకులు చాలా కంగారుపడిపోయారు. వాళ్ళల్లో తమ స్కూలు తెలుగు మాస్టారూ వున్నారు. ఆయనకి వెంటనే తను జ్ఞాపకం వచ్చిందట. స్కూలు డాన్స్‌ ప్రోగ్రామ్స్‌లో తను పాల్గొంటూ మంచిపేరు తెచ్చుకుంది. అలా ఆయనకి తను గుర్తొచ్చి ఇంటికొచ్చి అమ్మతో మాట్లాడారు. అమ్మ ఒపకోలేదు.‘‘వాళ్ళ నాన్నగారు చండశాసనులండీ - స్కూల్లో కూడా ఏదో చేస్తుందిగానీ - వాళ్ళ నాన్నగారికి తెలీదు. కనీసం పాటపాడినా ఊరుకోరు’’ అంది.‘‘మీరలా అనకండమ్మా - అమ్మాయికి టాలెంటు ఉంది గామట్టే అడుగుతున్నాను. 

సాక్షాత్తు అమ్మవారికి కానుకగా ఈ ఒక్కసారికీ నాట్యం చేయమనండి. నా పరువు కాపాడండి’’ అంటూ తన మాటల చాతుర్యం చూపించారాయన.అమ్మ ఆలోచించింది. నాన్న ఊరెళ్ళారు. మరో నాలుగు రోజుల వరకూ రారు. సరే- అమ్మవారికి సేవ అనుకుందాం అని -‘‘సరే - ఈ ఒక్కసారికేనండి - ఐనా దాని ముఖం, దానికి డాన్సేం వచ్చండీ’’ అంది.‘‘అమ్మమ్మ - భలేవారే. సంగీతం, నాట్యం, ఆ తెలివితేటలు, అందం, అణకువ - ఇవన్నీ ఆ పిల్లకి పుట్టుకతో భగవంతుడిచ్చిన వరాలు కదండీ. రాయేదో, రత్నమే నిపుణుడికి తెలీదా. ఆ పిల్లకి స్వయంగా తెలుగు మాస్టార్ని! నాకు తెలీదా? సరే, సాయంత్రం ఆరు గంటలకల్లా భోజనం పెట్టేసి తీసుకురండి. ఏడు గంటలకి ప్రోగ్రాం. చిన్నపిల్లకదా ఎలా చేసినా బావుంటుంది’’ అన్నాడాయన.సరే - సాయంత్రం ఆరుగంటలకల్లా అమ్మా, నయనక్క, తనూ, చెల్లెళ్ళు కాంచన, భావన ప్రోగ్రాం జరిగే స్థలానికి వెళ్ళారు. తనకు భలేగా మేకప్‌ చేశారు. మెరిసిపోయే బట్టలు, రాళ్ళ నగలు, జడ కుప్పెలతో పువ్వుల జడ, చేతుల నిండుగా గాజులు, లిప్‌స్టిక్‌, తళుకు బొట్టు - అద్దంలో చూసుకుంటే తనేనా? ఎవరైనా రాజకుమారీనా - అన్పించింది.