‘అదేంటి నాయనా ? పెద్ద పాములా ఉంది’ ఆశ్చర్యంగాఅడిగాడు బాబు, తండ్రి సత్తయ్యని.‘అది మేన (పల్లకి)’ అన్నాడు సత్తయ్య, ఒకింత సాలోచనగా.‘అంటే’ ఇంకా అర్థం కాక అను మానం వ్యక్తం చేసాడు బాబు.‘అందులో పెళ్ళి కొడుకు, పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి ఊరేగిస్తున్నారు’ అన్నాడు తండ్రి.‘ఓ పాలంక్వినా! మా పాఠంలో ఉంది’ అన్నాడు తన పాఠ్యాంశాన్ని నెమరేసుకుంటూ.‘మరి మన ఎడ్ల కొట్టం అటుకపై ఎందుకు దాచారు’ మరో సందేహం వ్యక్తం చేసాడు.‘అదా! అవసరం లేక’ అన్నాడు లో గొంతుకతో.బాబుది చిన్న వయసు. తండ్రి గొంతులోని బాధని అర్థం చేసుకోలేక మరేదో అడగబోతుంటే,‘తరువాత అడగాలంటే అడుగు. అది దింప నీయ్‌. ఇంటికి తీసుక పోవాలి’ అన్నాడు సత్తయ్య.సత్తయ్య, అతని తమ్ముడు కలిసి పల్లకిని కిందికి దించారు.‘ఇన్నేండ్ల నుంచి పడావు పడింది కాబట్టి దుమ్ముతో నిండిపోయింది. లేకుంటే ఎలింటి కర్ర ఇది! నిగనిగలాడుతోంది’ అన్నాడు సత్తయ్య, తమ్ముడితో.‘కొట్టం అటకపై మేన పెట్టి ఎన్నేండ్లయింది’ త మ్ముడు అడిగాడు.‘చాలా సంవత్సరాలైంది... ఓ ఇరవై ఏండ్లు దాటొచ్చు’ అన్నాడు తమ్ముడు.‘ఎందుకేంది? ఈ రోజుల్లో ఎవరు మేనలో కూర్చొని ఊరేగుతారు ? ఊళ్ళో కూడా పట్టణ పోకడలు వచ్చే. ట్రాక్టరు పైన్నో, కార్లోనో ఊరేగు తున్నారు’ అన్నాడు సత్తయ్య.బాబుని లోన కూర్చోబెట్టి సత్తయ్య అతని తమ్ముడు మేనను తలోవైపు భుజంపై పెట్టుకుని ఊరివైపు నడవసాగారు.‘బాబూ! ఇంకా ఏమైనా సందేహాలున్నాయా’ ఎవరో తనని అడుగుతున్నారనిపించి,‘ఎవరు మాట్లాడేది’ బాబు అడిగాడు.

‘నేనే. పల్లకిని. నీ పాలంక్వీన్‌ని’ అన్నది మేన.‘నీకు మాటలు వచ్చా?’ కళ్ళింత చేసుకొని బాబు అడిగాడు.‘వచ్చు. నీకో కథ చెప్పనా’ అన్నది పల్లకి.‘అలాగే’ అన్నాడు బాబు.‘‘నా కధే చెబుతాను. మీ తాతగారు నన్ను ఎంతో ప్రేమతో తయారు చేయించారు. ఓ అరవై డెబ్బై సంవత్సరాల క్రితం నన్ను తయారు చేసారు. అప్పుడు నేనెంత అందంగా ఉండేదాన్నో నీకు తెలుసా? మీ తాతగారు నన్ను రకరకాలుగా అలంకరించేవారు. పెళ్ళిళ్ళ సీజన్‌ వస్తోందంటే నేనే పెళ్ళి కూతుర్నన్నంత సంతోషంగా ఉండేది..... ఎంతో మంది పెళ్ళి కూతుర్లని, పెళ్లి కొడుకులని మోసాను. జనం పెళ్ళి కూతురిని చూడడానికి నా పరదా ఎత్తి, ‘అబ్బ! ఎంత బాగుందమ్మా పెళ్ళి కూతురు’ అని కొందరనేవారు.