‘‘భార్గవ్! నాకోసమైనా నీ నిర్ణయాన్ని మార్చుకోలేవా!’’ రఘునాధరావు ఆవేదనగా అన్నాడు! ‘‘ఏమిటి నాన్నా! చిన్నవిషయాన్ని పెద్దదిగా చేసుకొని మీరు బాధపడుతున్నారు. నన్ను కూడా హర్ట్ చేస్తున్నారు?’’ భార్గవ్ అన్నాడు.భార్గవ్ మాటకి అడ్డొస్తూ,‘‘అదేంటి, బాధపడకుండా ఎలా ఉంటానురా?’’ అమ్మ పోయినప్పటి నుంచి నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకొని ఎంతో అల్లారుముద్దుగా పెంచు కున్నాను. మనకి ఉన్న ఆస్థిలో సుఖంగా బతకకుండా అలా ఆ పల్లెటూర్లు వెంబడి దేశాన్ని ఉద్దరిస్తానంటూ వెళ్ళిపోతాను అంటే అది చిన్న విషయంగా భావించి నన్ను చూస్తూ ఊరుకోమంటావా? పెళ్ళిచేసు కోవాల్సిన వయస్సులో ఇలా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావా చెప్పు?‘‘చిన్నప్పటి నుంచి నేనేంటో నాకున్న ఆశయాలేంటో నీకు కాక ఇంకెవరికి బాగా తెలుస్తాయి నాన్నా. ఒక అయిదేళ్ళు నన్నునువ్వు ఇలా వదిలేయి!‘‘ఆ తర్వాత నువ్వేం మాట్లాడినా ఎలా చెప్పినా వింటాను, నీ మాట జవదాటను నా జీవితంలో అరుదుగా వచ్చిన అవకాశం ఇది! నాకున్న ఆశయాలు తీరే రోజులు నా కళ్ళముందు స్పష్టంగా తిరుగుతున్నాయి?‘‘ఒక పల్లెటూరును మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేయడానికి గవర్న మెంటు నాకు సర్వాధికారాలు ఇస్తూ జిఓ చేసింది! నా కలలన్నీ నెరవేరే అపురూపమైన రోజు కిదే నాంది.
నాన్నా, నన్ను ఆపకు నన్ను వెళ్ళనీయి ప్లీజ్!’’ తండ్రి రెండు చేతులు పట్టుకొని ఆవేశంగా అన్నాడు భార్గవ్!‘‘తప్పదా భార్గవ్! రుద్ధకంఠంతో అన్నారాయాన!‘‘నాన్నా నన్ను నమ్మండి. నా కలల నుంచి నన్ను దూరం చేయకండి!’’భార్గవ్ ధృడ నిశ్చయానికీ అతని మాటల్లోని నిజాయితీకి కదిలి పోయాడు. రఘునాధరావు!‘‘సరే కానీవు! నీ రాక కోసం వేయికళ్ళతో ఎదురు చూస్తాను! అలా అని నేను ఒక్కడ్నే కాదు ‘‘నిధి’’ కూడా. నువ్వు నిధిని పెళ్ళిచేసుకొని పిల్లల్ని కని నా ఇల్లంతా కళకళలాడే రోజు కోసం నా ప్రాణాలన్నీ నిలుపు కుంటాను. వెళ్ళిరా భార్గవ్!’’‘‘నాన్నా! ధ్యాంక్యు!’’ ఆయన చేతులు పట్టుకుని ఊపేసాడు ఉత్సాహంగా!‘‘ఒక పది నిమిషాలు ఆఫీసునుంచి రావడం లేటయితేనే కంగారు పడి పోయే తండ్రిని’’ బాధ పెట్టకుండా ఎలా ఒప్పించాలా అని చాలా మధనపడ్డాడు! అతను ఒప్పుకోడేమోనని చాలా నిరాశపడ్డాడు! కానీ అతను సమస్య తీరిపోయింది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు భార్గవ.‘‘నిధి’’ పేరు వినగానే అతని కళ్ళలో వెలుగు! పెదాలపై చిరునవ్వు! మనస్సులో చిరుకదలిక! అతని ఆశయాలు, నిధితో తొలిపరిచయం, కాలేజీ రోజులు అతని కళ్ళముందు గతం అంతా రీలులా కదలాడింది! మ్యూజిక్‌తో క్యాంపస్ అంతా హోరెత్తిపోయింది.ఆ రోజు పీజి కాలేజీ వాళ్ళ ప్రెషర్స్ డే!