దీపావ ళికి యింకా రెండు రోజులుంది. అక్కడక్కడా, అప్పుడప్పుడూ టపాకాయల శబ్దాలు వినిపిస్తున్నా, ఊరు ప్రశాంతంగానే ఉంది. నేనూ అంత నిశ్శబ్దంగానే ఆ యింటి ముందు నుంచున్నాను. సరిగ్గా పదిహేనేళ్ళ క్రితం- ఇలాంటి రోజునే, ఆ యింటి ముందు నా భవిష్యత్తు మారిపోయింది.ఆ యింట్లోకి వెళ్లడానికి నాలుగు మెట్లు. ఆ తర్వాత పసుపు పెయింట్‌ వేసిన గుమ్మం. ఆ మెట్లకి రెండువైపులా నల్ల సిమెంటు అరుగులు.రెండడుగులు ముందుకేసి, ఆ అరుగుని చేత్తో మెల్లగా రాసాను. ఇదే అరుగు. నా జీవితానికి పునాది పడింది యిక్కడే. ఆ గోడకి వీపు నానించుకుని, ప్రైవేటుకొచ్చే మిగతా పిల్లలతో చదువుకున్నాను.ఈ అరుగు నన్ను గుర్తుపట్టిందేమో. పట్టే ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి రెండరుగుల మీద పిల్లలు. ఓ కిటికీ పక్కన, పడకుర్చీలో మేష్టారు గారు కూచుని, పిల్లలతో జవాబులు అప్పచెప్పించుకుంటూనో, లెక్కలు, ఎక్కాలు దిద్దుతూనో, ఉండేవారు.ఇప్పుడవన్నీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా దృశ్యాలు. అరుగులున్నాయి. కానీ, ఖాళీగా... కూలిపోడానికి సిద్దంగా ఉంది ఓ వైపుగోడ.మెట్లెకి, ఓ చెక్క స్థంభానికి ఆనుకుని అరుగుమీద కూచున్నాను. ‘‘ఉరేవ్‌! వెంకా!’’ఇదే... ఇలాంటి పిలుపే ఆ రోజున వినపడింది.ఇలాగే... పొద్దున్న... జానకమ్మగారు నీళ్ళు తోడుతూ పిలిచారు.‘‘ఉరేవ్‌, చద్దివణ్ణం తిన్నాక, నిన్న రాత్రి నానపెట్టిన ప్రమిదల్ని ఎండపెట్టడం నీ వొంతు. మావిడాకులు నువ్వూ, వీరబద్దరం కలిసీ కోసుకొచ్చి, వసారాలో డొక్కలకుంచె పైనున్న చూరులో పురికొస తాడుంటుంది. సత్తిపండు కూడా వస్తాడులే.

 తోరణాలు, అన్ని గుమ్మాలకీ కట్టాలి’’నేను, జానకమ్మగారి కొడుకులు వీరబద్దరం, సత్తిపండు పాక దగ్గరున్న మాఁవిడి చెట్టెక్కి ఆకులు కోసుకొచ్చి పడేసాం.‘‘వెంకా! వణ్ణం తినెయ్యి. యింకా బోల్డు పనులున్నాయి’’ జానకమ్మగారి గొంతు.పెరట్లో ఓ వైపునున్న వసారాలో కూచుని, చద్ద్దెన్నం ఆవకాయతో, మెల్లగా తింటున్నాను.దగ్గరగా చేరేసిన పెరటి తలుపులు, , పెద్దగా శబ్దం చేస్తూ తెరుచుకున్నాయి.ఉలిక్కిపడి, తలెత్తాను.ఓ నలుగురు పెద్ద మనుషులు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లోపలికి వచ్చి, నా ముందు నుంచున్నారు. తల దించుకుని, తరవాణిలో చూపుడువేలుతో గీతలు గీయడం మొదలెట్టాను. వాళ్ళ ముందు సిగ్గుతో మొహమాటంతో అన్నం తినలేకపోయాను.ఆ నలుగురు అక్కడ నుంచి కదలకపోవడంతో, మెల్లగా, తల ఎత్తి కళ్ళు ఎత్తి చూసి, మెల్లిగా లేచి నుంచున్నాను.‘‘వీడే... వీడేనండి బుల్లెంకడంటే. మునుపు మేష్టారిగారి దగ్గర పన్చేసే పెద్దెంకడి కొడుకు... వయసు పదమూడు వీడినాన్నండి, మేష్టారుగారి దగ్గర పదివేలు తీసుకుని, ఏడేళ్ళ క్రితం దుబాయెళ్ళాడు. ఇంతవరకూ అజా-అయిపూ లేదు. ఉన్నాడో, పోయాడో తెలీదు. వాడు రాలేదు, వీడిక్కడి నుంచి కదల్లేదు. ఇది వెట్టి చాకిరి. దీన్ని మనం ఖండించాలి... ఏఁవ ంటారు?’’