500 మంది పనిచేస్తున్న కంపెనీకి ఓ స్టాఫ్‌ కాంటీన్‌ వుండటం కనీసావసరం అంటే ఎవరికీ సందేహముండక్కర్లేదు. హోటళ్ళలో ధరలు ఎలా మండిపోతున్నాయో అందరికీ తెలుసు. అసలే చాలీచాలని జీతాలతో సంసారాలు నెట్టుకొస్తున్న ఉద్యోగులు ఈ బోడి జీతం యింట్లో పెళ్లాం పిల్లల మీదే ఖర్చు పెడతారా; బైట కాఫీ హోటళ్ళకే తగ లేస్తారా?కాని మేనేజిమెంట్లన్నింటికీ ఓ జబ్బుంటుంది. అది మాయరోగం అడిగిందాకా ఏదీయివ్వరు. ఆ అడగటమేనా అలా యిలా కాదు. ‘అయ్యా, బాబూ, పేదవాళ్ళం మేంబైట ఉడిపిలో టిఫిన్లు, కాఫీలు భరించలేం స్టాఫ్‌ కాంటీన్‌ పెట్టించండి’ అంటో దయగా, జాలిగా అడిగితే యిస్తారా? ఊహూఁ అలా యిస్తే చులకనై పోరూ! ఉద్యోగులు తమక్కావలసిన ప్రతీ చిన్న అవసరం కోసమూ అలజడి చేయాల్సిందే. ఆ అలజడి తారస్థాయికి చేరాల్సిందే. అప్పుడు గాని అడిగిందాంట్లో సగమో, పావో యివ్వరు. చివరికి కర్ర విరగదు. పాము చావదు. సమ్మెలన్నీ అంతే. కార్మిక-యాజమాన్య సంబంధాలు అంతే.ఈ 500 మంది సభ్యులున్న అతి మిలిటెంటు యూనియన్‌ కూడా అదే చేసింది.కాంటీన్‌ లేకపోవటం వల్ల వుద్యోగులెదుర్కొంటున్న ఆర్థిక యిబ్బందులు ఏకరువు పెడుతూ, కాంటీన్‌ అవసరాన్ని నొక్కి చెబుతూ మేనేజిమెంటుకు లాంఛన ప్రాయంగా వుత్తరం రాసినప్పుడు వాళ్ళకు తెలుసు - ఇవి చదువుకోగానే మేనేజిమెంటు కాంటీన్‌ ప్రారంభించదని.ఓ నెలాగి మరో ఉత్తరంతర్వాతఅల్టిమేటంఫలాని తేదీలోగా కాంటీన్‌ ప్రారంభించకపోతేం (ఏం చేస్తారు? మేనేజిమెంటు కూడా యిలాగే అనుకుంది, ఏం చేస్తారో చూద్దామని...)ఆ ఫలాని తేది గడిచిపోయింది.

యూనియన్‌ వాళ్ళు సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. మేనేజిమెంటు తమ న్యాయ సమ్మతమైన కోర్కెను తీర్చటం లేదు గనక యిక సహాయ నిరాకరణ తప్పనిసరి అని.‘మీ బోడి సహాయం ఎవడిక్కావాలి, మా మాన్యువల్సూ, రూల్సూ, రెగ్యులేషన్సూ వుండటం వల్ల మీరు పని చేస్తున్నారు గాని మాకు సహాయంచెయ్యాలని కాదు’ అనుకొని మేనేజిమెంటు వాళ్ళు, సహాయ నిరాకరణ నోటీసును చెత్త్త బుట్టలో పారేశారు.తరవాత టూల్‌ - డౌన్‌ స్ర్టైక్‌.‘ఠీక్‌ హై. గో అ హెడ్‌’ అన్నది మేనేజిమెంట్‌.ప్రదర్శనలు.నోటీసులు.ఛాలెంజ్‌లుచివర్న - సమ్మెకార్మిక- యాజమాన్య సంబంధాలను పర్యవేక్షించే ప్రభుత్వాధికారి కూడా వచ్చి కలుగ చేసుకున్నాడు.మూడు రోజుల సమ్మె తర్వాత సంభాషణలు ప్రారంభమయ్యాయి. మొదట సమ్మె మానితే గాని సంభాషణలు ప్రారంభం కావన్నారు మేనేజిమెంటు. ‘అమ్మమ్మో, ఇప్పుడు సమ్మె విరమించుకుంటే, మళ్ళీ యింతమందిచేత సమ్మె చేయించటం చాలా యిబ్బంది’ అన్నారు యూనియనిస్టులు.ఆ అనిశ్చిత వాతావరణంలోనే సంభాషణల్లాంటివి జరిగాయి. తాడో, పేడో తేలకుండా ఒప్పందాల్లాంటివి కుదిరాయి. ఈ ఒప్పందాల భాష ఎలా వుంటుందంటే అటు మేనేజిమెంటు, వాళ్ళూ, యిటు యూనియన్‌ వాళ్ళు కూడా ఎవరిక్కావలసిన అర్థం వాళ్ళు తీసుకోవచ్చు. కాని ఎవరు మాత్రమేం చెయ్యగలరు! ఒప్పందాల భాష ఎప్పుడూ అలాగే వుంటుంది.