జాగృతి గేటు లోపలికి అడుగుపెడుతూ అక్కడ ఆర్చి మీద పెద్దగా అందంగా రాసిన అక్షరాలను కళ్లు విప్పార్చుకుని మరీ చూసింది ‘వేక్‌ అప్‌’ స్కూలు. అందులో తను టీచరు. అది నగరంలో కెల్లా ఖరీదైన స్కూలు. అక్కడ ఎంత డొనేషన్‌ కట్టి అయినా సీటు ద క్కించుకోవాలని అందరికీ ఆరాటం. ఎందుకంటే.. తమ పిల్లలు వారి సహచరుల కంటే మిన్నగా ఉన్నత స్థానం పొందాలని .. ఇతరులు గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎదగాలని...వారి అవసరాలను తీర్చడానికి తల్లిదండ్రులు తల తాకట్టు పెట్టడానికైనా సిద్ధపడే దేశమిది.ఒక్కసారి తమ పిల్లలు అందులో ప్రవేశిస్తే, వారి చదువు, భవిష్యత్తు గురించి మరింక ఆలో చించక్కరలేకుండా తాము హాయిగా గుండెల మీద చేతులేసుకుని నిశ్చింతగా నిద్రపోవచ్చని తల్లిదండ్రుల ప్రగాఢ నమ్మకం. అందుకే నెల తప్పిన దగ్గర నుంచే పుట్టబోయే బిడ్డకు ఆ స్కూల్లో రిజర్వేషను కోసం ఎన్ని పాట్లయినా పడతారు అక్కడి తల్లిదండ్రులు.అలాంటి స్కూల్లోకి సోషల్‌ స్టడీస్‌ టీచరుగా కొత్త కొత్త ఆశయాలతో, కోటి ఆశలతో అడుగుపెట్టింది పాతికేళ్ల జాగృతి.అదికూడా తాత్కాలిక పద్ధతి మీదనే... అంటే లీవ్‌ వేకెన్సీలో..అంతకు ముందున్న సోషల్‌ టీచరు సరస్వతి ప్రసవం కోసం సెలవు పెట్టింది.వచ్చీ రాగానే ప్రిన్సిపల్‌ మాలతీరాయ్‌, కొత్త టీచరు జాగృతిని ముందుగానే హెచ్చరించింది.‘‘జాగృతీ! ఇక్కడ విద్యార్ధుల్లో కోట్లకు పడగెత్తిన వారితో పాటు గౌరవ హోదాల్లో ఉండే అధి కారుల పిల్లల వరకు ఉన్నారు. వాళ్ల అల్లరిని, ఆకతాయితనాన్ని భరించడమే కష్టం. తెలివితేటలకి ఎవరికీ లోటు లేదు. అయితే ఒక్కసారి గనుక వాళ్లకి టీచరు మీద గురి కుదిరిందంటే వాళ్ల మాట వాళ్లే వినరు. టీచరు చెప్పిన దానికోసం మాత్రం ప్రాణాలైనా ఒడ్డేస్తారు. ఇక్కడ కొట్టడం, తిట్టడం నిషిద్ధం అన్న సంగతి నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే అనుకుంటున్నాను. ఈ స్కూలు పేరు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లకుండా మాత్రం వాళ్లతో నువ్వు మెలగాల్సి ఉంటుందని అర్థమయిందికదా!’’అర్థమయిందన్నట్టు తల ఊపింది జాగృతి.తనకు ఆరు నెలలు మాత్రమే సమయం ఉంది. పాత టీచరు ఉద్యోగంలో వచ్చి చేరిన తర్వాత తనకు ఉద్వాసన తప్పదు. అయినా అందుకు సిద్ధపడే, ఇష్టపడే ఇక్కడ చేరింది జాగృతి.ఫఫఫఈ దేశానికి బంగారు భవిష్యత్తునందించే పౌరులు లభించాలన్నదే చిన్నప్పటినుంచి తన ప్రగాఢమైన కోరిక.దేశమంటే తనకెందుకింత పిచ్చి అభి మానం? అంతా ఈ దేశం పాడయిపోయిందంటున్నారు.

 వ్యవస్థ కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతోందంటున్నారు. అయితే తన దృష్టిలో మాత్రం ఇది, ఈ దేశం అనేది మన దేహం. దేహం పాడయిపోయిందని దానిని చంపుకోలేం కదా! ఔషధం అందించి చికిత్స చేసి కాపాడుకోవాలి. అయితే ఎలాంటి ఔషధాన్ని ఎక్కడనుంచి ఎలా ప్రారంభించాలన్నదే ప్రశ్న. దీనిని బాగుచేయడం ఎవరి తరమూకాదు కనుక ముక్కు మూసుకుని పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లిపోవడమే ఉత్తమం తప్ప దానిమీద చిన్న రాయి విసిరినా మన బట్టలు, శరీరం మలినమవుతాయే తప్ప మనకొచ్చి పడేదేమీ ఉండదని తన స్నేహితులు, బంధువులు పదేపదే చెప్పి విసుక్కుంటున్నారు.