కవుల్నీ, కథకుల్నీ కలిపి తిట్టుకున్నాడు మురళి. ఆ వెంటనే విమర్శకుల్నీ, ఫీచర్‌ రైటర్స్‌నీ సామూహికంగా దుమ్ము దులిపేశాడు. ఆ తర్వాత ఢిల్లీ మీద, హైదరాబాద్‌ మీద జంటగా ఒంటికాలి మీద లేచాడు. వ్యవస్థ మీద ఘోషపెట్టేవారు వ్యక్తుల మీద ఎగిరిపడరేం అని కసురుకున్నాడు. రాజకీయాల్నీ, అధికారాన్నీ జమిలిగా శాపనార్థాలు పెట్టాడు. మనుషుల్లో నీతీ నిజాయితీ మంటగలిశాయనుకున్నాడు. విలువలకి వలువలూడిపోతున్నాయని వాపోయాడు.రేగిన కసిని ఇల్లంతా కలయదిరిగి నలువైపులా విరజిమ్మాడు. ఇదంతా మురళి మనస్సులో జరిగిన ఒక (నీ)రసాయన క్రియ!అసంకల్పిత ప్రతీకార చర్యగా పళ్లు పెదవుల్ని కొరికినై. కసిత్వం తాటి ప్రమాణంగా లేచింది.ఫోన్‌ మోగింది. తీశాడు. అవతలివైపు నుంచీ వేణు. ‘‘మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ది డే నాన్నా’’ చెప్పాడు. థాంక్స్‌ చెప్పాడు మురళి. ‘‘అమ్మకివ్వు’’ వేణు. అప్పటికపడే భర్త పక్కకి వచ్చి నిలబడింది ఉషాసుందరి. ఫోన్‌ అందుకుంది.హాల్లో కూర్చున్నాడు మురళి. జట్టు సరిచేసుకుని తల విదిలించుకున్నాడు. ‘‘ఆ, ఈరోజు మళ్లీ మళ్లీ రావాలి. ఛస్తాను. ఇంకేమఖ్ఖర్లేదు. ఉన్న ప్రాణం గాలిలో కలుస్తుంది’’ పైకే అన్నాడు.ఫోన్‌ సంభాషణ అయింది. ఉష భర్త మాటలు విన్నది. కళ్లు పెద్దవి చేసుకుని ఆయన్ని చూసి, ‘‘అవేం మాటలండీ. ఏం జరిగిందనీ అంత చిరాకూ, విసుగూ, కోపం, కసీ. మామూలు విషయాలకి ఇంతగా బీ.పీ. పెంచుకుంటారేం’’ అని పక్కకుర్చీలో కూచుంది.‘‘అవును.

నీకన్నీ మామూలు విషయాలే. పొద్దున్నే పాలవాడు అర్ధలీటర్‌కి అర్ధరూపాయి చొపన నొక్కేశాడు. అదేమంటే ‘నా దగ్గర పాకెట్‌ తొమ్మిదిన్నర, అంతే సార్‌’ అని పొగరుమోతు సమాధానం. నో ఆస్కర్‌ నో టెల్లర్‌’’.భర్తకేసి అదోలా చూసి, ‘‘అందుకే మిమ్మల్నింకో నాలుగడుగులేసి రామ్‌నగర్‌ చౌరస్తాలో తెమ్మన్నాను’’ అన్నది. నెపమెన్నుతోందని భార్యని గుర్రుగా చూశాడు మురళి.‘‘అవును. నువ్వెక్కడేడవమంటే అక్కడేడవాలి’’ అన్నాడు.వచ్చీరాని చిరునవ్వుతో కుర్చీలోంచీ లేచింది ఉష.‘‘ఏదో మహాత్మాగాంధీ జన్మదినంలా ఏభయ్యో ఏడు కదండీ. సరదాగా గుడికి పోయొద్దామని బయల్దేరావ్‌ - ఉదయాన్నే. పోవటానికి అరవై ఆరు రూపాయలు ఆటో. ఎక్కుతుంటేనే వాడి హెచ్చరిక - నా బండి ఇరవై పైసల సెట్టింగ్‌ సార్‌ అని. నిన్ను దోచుకుంటాను సిద్ధమేనా అన్నట్టు, కత్తి పుచ్చుకున్నట్టు మరీ చెప్పాడు. సరి. తిరుగు ప్రయాణం వేరే ఆటో. అదే రూట్‌లో డెబ్బై ఎనిమిది. దోపిడీ. దారుణం. కడుపు రగిలిపోతోంది. నీకేమో చీమకుట్టినట్టన్నా లేదు...’’