వరంగల్‌ నుండి హైదరాబాద్‌ వెళ్ళే కాకతీయ ఫాస్టు ప్యాసింజరు రైలు అది. ఆఫీసువాళ్ళకు; పాలవాళ్ళకు; కూరగాయలవాళ్ళకు సిటీకి వెళ్ళడానికి అనుకూలమైన బండి! బండి ఓ అయిదు నిముషాలు ముందు నడుస్తోంది. ఆలేరు స్టేషనులో వచ్చి ఆగింది. హెడ్‌ క్వార్టర్‌ స్క్వాడ్‌; ఆర్‌.ఫి.ఎఫ్‌. వాళ్లు (రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌) మొత్తం రైలును చుట్టుముట్టారు. ఉదయాన్నే ఏ బండికి సికింద్రాబాద్‌ నుండి వచ్చారో; బండి ఆగగానే చుట్టుముట్టారు. కాకతీయ ఎక్స్‌ట్రా ఆగడానికి పదినిమిషాలు పర్మిషన్‌ కూడా తీసుకున్నారు.

ఒక్కో పెట్టె దగ్గరా దిగేవాళ్ళను కదలనీయకుండా టికెట్‌ చెకింగ్‌ మొదలుపెట్టారు. ప్లాట్‌పారం ఆఫ్‌ సైడ్లో ఎవరు దిగకుండా ఆర్‌.పి.ఎఫ్‌ వాళ్ళు నిలబడి ఉన్నారు. శివరాంతో పాటు మెరికల్లాంటి కుర్రాళ్ళు ఇంకా స్క్వాడ్‌లో ఉన్నారు. వాళ్ళందరికి ఇన్‌చార్జి సారంగధర్‌.‘అమ్మా టికెట్‌ చూపించు’ శివరాం అడిగాడు పెట్టెలోంచి దిగినావిడను. ముప్పయి అయిదేండ్లు ఉండవచ్చు. చేతిలో ఓ నోటుపుస్తకం, వానిటీ బ్యాగ్‌ ఉన్నాయి.‘‘లేదండీ, తీసుకోలేదు. నాది సీజన్‌ టికెట్టు, సీజన్‌ ఇంట్లో మరిచాను టికెట్‌ తీసుకుందామంటే బుకింగ్‌ దగ్గర హెవీ రష్‌!’’‘‘ఔనండీ; బండి రావడానికి ఓ అరగంట ముందు టికెట్‌ తీసుకుని బండి ఎక్కాలి. లాస్ట్‌ మినిట్‌లో వచ్చి హెవీ రష్‌ అంటే కుదరదు. 

చార్జి కట్టక తప్పదమ్మా అన్నాడు మర్యాదగా.‘‘నేను ఇక్కడ టీచర్‌గా పని చేస్తున్నానండి, కాజీపేట నుండి రోజూ వస్తాను. నా సీజన్‌ టికెట్‌ ఈ రోజు తీసుకురాలేదు - సారీ సర్‌’’‘‘సారీ లేదు, ఏమీలేదు డబ్బులు తియ్యండి రసీదు ఇస్తాను’’‘‘నా దగ్గర డబ్బులు కూడా లేవండీ! ప్లీజ్‌ ఎక్స్‌క్యూజ్‌మి సార్‌’’ఆమెకు ముచ్చెమటలు పోస్తున్నాయి. ఏ దేవుడు రక్షిస్తాడా అన్నట్టు ఉంది ముఖం. ఇక లాభం లేదు. నోరు పెద్దది చెయ్యాలనుకుంది.‘‘ఎక్కడినుంచి వస్తారండీ మీరు? మేము రోజూ ఇదే బండికి వస్తాము మమ్మల్ని టికెట్టు ఎవరూ అడగరు. మీలాంటి కొత్తవాళ్ళు వచ్చినా సీజన్‌ అనగానే, వెళ్ళిపోతారు’’‘‘చూడమ్మా! మాకు సమయం చాలా తక్కువగా ఉంది. టికెట్‌ చూపించు. లేదా పెనాల్టీ కట్టు. డబ్బులు లేవంటే ఆర్‌.పి.ఎఫ్‌కు హాండోవర్‌ చేస్తాను’’