‘‘నాన్నా! ఒక్కసారి ఇవి తిని చూడండి! మొన్ననే మార్కెట్లోకి వచ్చాయి. ఒక్కసారి తింటే వదల్లేరు! అమ్మా! నువ్వు కూడా! ఇవి మరీ అంత స్వీట్‌గా ఏం లేవులే!’’ సిటీ నుండి తెచ్చిన కొత్తరకం బిస్కట్‌ ప్యాకెట్‌ను విప్పి ప్లేట్లో వేసింది లావణ్య!‘‘ఏవండీ! దీనికింకా చిన్నతనం పోనేలేదు! ఎప్పుడు వచ్చినా సంచీ నిండా బిస్కట్లు. చాక్లెట్లూ నింపుకొని వస్తుంది! ఇక్కడెవరో చిన్నపిల్లలున్నట్లు!’’ చిరుకోపంతో అంది సుశీల.‘‘నీ కంటికి కనిపించరేమో గానీ, ఇక్కడ నాలాంటి చిన్న పిల్లలున్నారని, వారికి బిస్కట్లూ, చాక్లెట్లూ బాగా ఇష్టమని దానికి తెలుసులేవోయ్‌! అది మా అమ్మకదా! అందుకే నా కోసం తీసుకు వస్తుంది ఇవన్నీ!’’ లావణ్య తన తల్లి పోలికలతో పుట్టిందని శివప్రసాద్‌కి మరీ గారాబం కూతురంటే!‘‘సరేలెండి! సంబడం! మా అమ్మ కదా, మా అమ్మ కదా అనుకుంటూ వుండండి! దానికి నిజం గానే మీ అమ్మ వయసు వచ్చేస్తుంది! అప్పుడు చేద్దురుగానీ పెళ్ళి! ముందు పెళ్ళి విషయం...’’ తల్లిని మధ్యలోనే ఆపేసింది లావణ్య.‘‘అమ్మా! ఏ విషయం మాట్లాడినా చివరికి పెళ్ళిదాకా తెస్తావు! బిస్కట్ల నుండి మొదలు పెట్టి పెళ్ళిదాకా వచ్చేశావు. నువ్వెప్పుడూ ఇంతే! నాన్నగారి హ్యాపీ మూడ్‌ని చెడగొడ్తావు!’’ నిష్ఠూరంగా అంది లావణ్య.‘‘నీకేం తెలుస్తుందమ్మా నా బాధ! ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగితేనే మంచిది!’’ కొంత బాధగా అంది సుశీల.లావణ్యకు సంబంధం కుదరడం లేదని, చాలాకాలంగా లోలోపల బాధ పడ్తున్నారు. శివప్రసాద్‌కు ఒక కొడుకూ, ఒక కూతురు మాత్రమే కావడం, చేసేది చిరుద్యోగమైనా, క్రమశిక్షణ గల జీవనశైలిని అలవర్చుకోవడం వలన ఇద్దరినీ మంచి చదువులు చదివించ గలిగాడు.

 ఫలితంగా ఇద్దరు పిల్లలూ సాఫ్ట్‌ ఇంజనీర్లుగా ఎదిగి, బాగా సంపాదిస్తున్నారు. కొడుకు కార్తీక్‌ కంపెనీ తరఫున స్టేట్స్‌వెళ్తే, కూతురు లావణ్య సిటీలోనే ఓ మంచి కంపెనీలో పని చేస్తోంది. నెలకోసారి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి పోతూ వుంటుంది.మొన్నటిదాకా పెద్ద సమస్యేమీ కాదనుకున్న లావణ్య పెళ్ళి ఇటీవల నిజంగానే పెద్ద సమస్యగా అనిపిస్తోంది. అందమూ, చదువూ, మంచి ఉద్యోగమూ ఉన్న లావణ్యకి తగిన వరుడు దొరకక పోవడమే అసలు సమస్య. ముప్ఫయి ఏళ్ళకే ముసలై పోతున్న యువతరాన్ని చూస్తే శివప్రసాద్‌కి ఆశ్చర్యం వేస్తోంది. సాఫ్ట్‌వేర్‌ జీతాలతో జీవన విలువలు పెరగడం మాట ఎట్లున్నా, వారి శరీర బరువులూ, కొలతలు బాగా పెరిగిపోయిన మాట మాత్రం వాస్తవం.దీపావళి పండుగకి మూడు రోజులు సెలవులు కలిసి రావడంతో, మరో మూడు రోజులు సెలవుపెట్టి, వారం రోజులు సొంతవూళ్ళో తల్లిదండ్రులతో గడుపుదామని వచ్చింది లావణ్య. గత నెల రోజులుగా ఈ వారం రోజుల కోసం ఎదురు చూస్తోంది.