సంధ్యారాగంతో నిండిన పడమటి ఆకాశం ఆరితేరిన చిత్రకారుడి రంగుల మేళవింపులా వుంది. దూరంగా రహస్యాలు చెప్పుకుంటున్నట్టుగా తలలు వంగిన రెండు కొబ్బరి చెట్ల మధ్య ఎర్రటి సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యాస్తమయం... అస్తమయం! ఆత్మారామ్‌ చిన్నగా నిట్టూర్చాడు. అస్తమిస్తున్న సూర్యుడు ఆలోచనలు రేపుతున్నాడు. ప్రతిప్రాణికి అస్తమయం వుందని నిత్యం అస్తమిస్తూ సూర్యుడు చాటింపు వేస్తున్నాడు. ఉదయించిన సూర్యుడు అస్తమించినట్టే, జన్మించిన ప్రతి మనిషి మరణిస్తాడు...ఆత్మారామ్‌ ఆలోచిస్తూ వెనక్కు తిరిగాడు. ఎదురుగా ద్వారానికి రెండు వైపులా గోడకి వున్న రెండు ఆయిల్‌ పెయింటింగ్స్‌ అతని దృష్టిని లాగి పట్టాయి. ‘ఉదయం’ ..... ‘అస్తమయం’ తనకి ఎంతగానో కీర్తి ప్రతిష్ఠల్ని ఆర్జించిపెట్టిన కళాఖండాలవి. ‘‘చిత్రకారుడుగా ఆత్మారామ్‌ పరిణతికి ఈ ‘ఉదయం’, ‘అస్తమయం’ చిత్రాలు అద్దం పడుతున్నాయి’’ అన్నారు ఆ రోజుల్లో విమర్శకులు. పొత్తిళ్ళలో పడుకున్న పసికందు ఎర్రటి బ్యాక్‌ గ్రౌండ్‌లో, వెల్తురుతో వెలిగిపోతున్న ప్రశాంతమైన చిన్నారి ముఖం పుట్టుకకి, ఉదయానికి అర్థం చెబుతోంది. పక్కనే వున్న ‘అస్తయమం’లో మరణించిన మానవుడి ముఖంలో అనంతశాంతి ప్రతిఫలిస్తోంది. నలుపూ, ఎరుపూ కలిసిన బ్యాక్‌గ్రౌండ్‌లో నిర్వికారంగా, నిశ్చలంగా మూసుకున్న కళ్ళతో మరణ గాంభీర్యాన్ని ప్రతిఫలిస్తున్న ముఖం అస్తమయానికి అర్థం చెప్తోంది.ఆత్మారామ్‌ ఆ రెండు చిత్రాల్నీ పరిశీలనగా చూస్తూ వుండిపోయాడు. ఒక బొమ్మలోని బాలుడు మరో బొమ్మలో వృద్ధుడై అస్తమించాడు.

 ‘అస్తమయం’ చిత్రంలోని ఆ ముఖంలో తన పోలికలు వున్నాయా? ప్రతి చిత్రకారుడూ లోనయ్యే ‘పర్సనల్‌ ఇన్‌ఫ్లుయెన్స్‌’ నుండీ తను ఏనాడో విముక్తుడైనట్టు విమర్శకులు ఇదివరకే పేర్కొన్నారు. మరి... మరణానికి దగ్గరవుతున్న తన చూపులు ఇప్పుడు మునపట్లా లేవా...?మరణశిక్ష విధించేముందు ఆ మనిషి ఆఖరి కోరిక తీరుస్తారు. మరి తనకి మరణశిక్ష విధించే విధి తన చివరి కోరికను తీరుస్తుందా? ఇంతకీ మరణం తనకి శిక్ష అవుతుందా? జననం ఒక వరమైతే మరణమూ ఒక వరమే. పుట్టుకా, చావూ రెండూ వరాలే; రెండూ ఆనందాలే అన్న విశిష్టమైన, విశాలమైన భావాన్ని తను సృష్టించిన ఈ ‘ఉదయం’, ‘అస్తమయం’ చిత్రాలు ప్రతిబింబిస్తున్నాయి...!‘‘నమస్కారం మాష్టారూ!’’ఆత్మారామ్‌ ఉలిక్కిపడి, తన ముందు నించున్న శిష్యుడు కామేశాన్ని చూశాడు.‘‘రా కామేశం.... కూచో’’ అంటూ వెళ్ళి పడక్కుర్చీలో కూచున్నాడు. కామేశం మరో కుర్చీలో కూచుని, నిరుత్సాహంగా చూశాడు‘‘సారీ మాస్టారూ... మోడలింగ్‌కి ఎవరూ అంగీకరించలేదు. మామూలు కన్నా రెండింతలు ఇస్తామని చెప్పి కూడా ప్రయత్నించాను..’’ఆత్మారామ్‌ మౌనంగా వుండిపోయాడు. మోడల్‌?... అవును! తనకి ప్రస్తుతం అత్యవసరంగా కావాల్సిన మోడల్‌ సాధారణంగా దొరకదు! తను చిత్రకారుడిగా రూపొందినప్పట్నించీ ఆ ‘మోడల్‌’ కోసం అన్వేషిస్తూనే వున్నాడు - దైవాన్ని అన్వేషించే జిజ్ఞాసువులా; ఎండమావుల్ని వేటాడే ఎడారి బాటసారిలా... అది చిరకాలంగా నిలిచిపోయిన కోరిక. తనలాగే వయసు ముదిరిన కోరిక... తన చివరికోరికగా మారిపోయిన చిరకాల వాంఛ!