సమయం రాత్రి పదింబావు దాటింది. పున్నమి కావడంతో నింగిలో చంద్రుడు నిండుగా నవ్వుతున్నాడు. పూలమొక్కలు, చెట్టూ చేమా ఆ వెన్నెల వర్షంలో తడుస్తూ ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టు లయబద్ధంగా ఊగుతున్నాయి చిరుగాలికి.వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. కానీ నాకు మాత్రం చాలా చిరాకుగా ఉంది ఎంతకీ రాని ఆయనకోసం నిరీక్షణతో.టి.వి. ప్రోగ్రామ్స్‌ చూసి చూసీ విసుగొచ్చి గుమ్మంలో నిల్చునే ఎదురుచూస్తున్నాను. పదిముప్పావుకి వేంచేశారు ఆయన.‘‘ఏవిటండీ ఇంత ఆలస్యం?’’ చిరాకుని బలవంతంగా అణుచుకుంటూ వీలైనంత మృదువుగా అడిగాను నేను.‘‘మొదలెట్టావా ప్రశ్నలు’’ ముద్దముద్దగా వస్తోన్న మాటలతో విసుక్కున్నారు ఆయన.‘‘డ్రింక్‌ తీసుకున్నారు కదూ ఇవాళ కూడా?’’ స్వరం పెంచాను నేను.‘‘అవును! ఇపడేంటి? పాత స్నేహితుడొకడు చాలా ఏళ్ళ తర్వాత కలిస్తే ఫార్మల్‌గా తీసుకోక తప్పలేదు. అక్కడికి నేనేదో పేద్ద తాగుబోతునయినట్లు ఆ నిలదీయడమేమిటి’’ నిషాలో మత్తుగా తూలుతూ గొణిగారు ఆయన.‘‘కాకపోతే మరేమిటి? మొన్న వారం రోజుల క్రితం మీ బాస్‌ పెళ్ళిరోజు పార్టీ అన్నారు. అంతకు నాలుగురోజుల ముందు మీ ఫ్రెండ్‌ తమ్ముడి పెళ్ళి రిసెప్షన్‌ పార్టీ అన్నారు. రెండ్రోజుల క్రితమేమో మీ కొలీగ్‌ ప్రమోషన్‌ పార్టీ అన్నారు. 

ఇలా రోజూ ఏదో వంక పెట్టి తాగడం, అది చాలదన్నట్లు ఇంటికీ మందుబాటిల్స్‌ తెచ్చుకోవడం.. ఇవన్నీ తాగుబోతు లక్షణాలు కాదా? చెప్పండి! మాట్లాడరేం?’’ కటువుగా అడిగాన్నేను.‘‘నా ఇల్లు... నా సంపాదన.. నా ఇష్టం.. ఊరికే నసపెట్టక వెళ్ళి నీ పని చూసుకో’’ అంటూ కేకలేస్తూ బట్టలైనా మార్చుకోకుండా అలాగే బెడ్‌పైన వాలిపోయారు ఆయన.నాన్నగారు వస్తారు... ఎగ్జిబిషన్‌కి తీసుకువెళతారు అని ఆశగా ఎదురుచూసీ చూసీ నిద్రపోయిన వరుణ్‌, పవన్‌లకి బెడ్‌షీట్‌ సరిగా కప్పి మా బెడ్‌రూంలోకి వచ్చేశాను.ఇంట్లో బెడ్‌ల్యాంప్‌ వెలుతురు పరుచుకుంది. కళ్ళు మూసుకున్నానే గానీ నిద్రాదేవి ఓ పట్టాన కరుణించలేదు. గతం తాలూకు ఆలోచనలు నన్ను మెలిపెడుతోంటే!!్‌్‌్‌నా పెళ్ళయిన తొలినాళ్ళలో ‘మీరా’ ఎంత అదృష్టవంతురాలో అని అందరూ నన్ను పొగుడుతుంటే పరవశించేదాన్ని. అవును మరి! స్మోకింగ్‌, మందు కొట్టడం లాంటి ఏ వ్యసనాలూ లేని గుడ్‌బాయ్‌ లాంటి మోహన్‌ నాకు భర్తగా లభించడం ఈ కాలంలో అదృష్టమే కదా?!ఏదైనా పెళ్ళికో, మరో ఫంక్షన్‌కో వెళ్ళినపడు ఎవరైనా ‘సరదాగా పేకాట ఆడదాం రావోయ్‌’ అంటూ పిలిచినా ‘అబ్బే నాకు చాతకాదు, ఆసక్తి అంతకన్నా లేదు’ అంటూ తపకు తిరిగే ఈయనని చూసి ఎంతో ముచ్చటపడేదాన్ని.పెళ్ళయిన కొత్తల్లో ప్రతి సాయంకాలం మా కాలనీలోని పిల్లలకి వేణుగానం నేర్పేవారు. ఆయన వేణుగాన విన్యాసాల్ని ఆస్వాదిస్తూ మైమరిచిపోయేదాన్ని.