ప్రపంచం అంతా మొబైల్ ఫోన్లపై నడుస్తున్నా మోహన్రావు మాత్రం మొబైల్‌ఫోన్ అంటే మొహం చిట్లిస్తాడు. కొలీగ్స్ అంతా మొబైల్ ఫోన్ కొనుక్కోమని చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పినా విన్లేదు, తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న మోహన్రావుకి మంచి జీవితం వున్నా ల్యాండ్‌లైన్‌తో నడుస్తుందిలే అనుకుంటూ కాలం వెల్లదీసే చిత్రమైన మనిషి. ఏదైనా ఒక వస్తువు కొనాలంటేఒకటికి వందసార్లు ఆలోచిస్తాడే గానీ వెంటనే కొనడు. ఉపయోగపు విలువకే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి అతను. అయితే కూతురు హిమ కెనెడా వెళ్లినప్పటినుంచీ తండ్రితో మాట్లాడాలంటే ఇబ్బందిగా వుండడంతో మొబైల్ కొనుక్కోమని ఒత్తిడి చేయడం మొదలు పెట్టింది. ల్యాండ్‌లైన్‌కి కాల్ చేసినప్పుడు మోహన్రావు ఇంట్లో లేకపోవడం, అతను ఇంట్లో వుండే సమయం చూసుకుని ఫోన్ చేయాల్సి రావడం లాంటి సమస్యల వల్ల ఆ అమ్మాయికి కమ్యూనికేషన్ పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంది. అందుకే మొబైల్ ఫోన్ కొంటే ఎప్పుడూ అందుబాట్లో వుండవచ్చని ఏ సమయంలోనైనా ఫోన్‌లో మాట్లాడుకోవచ్చనీ తండ్రికి నూరిపోసి ఎలాగో ఒప్పించగలిగింది. అదుగో అప్పట్నుంచే మోహన్రావు మొబైల్ ఫోన్ కొనాలని నిశ్చయించుకున్నాడు.
భార్య చనిపోయేప్పటికి హిమకి పదిహేనేళ్ళ వయసు. గారాబంగా పెంచి ఆశలన్నీ కూతురిపైనే పెట్టుకున్న మోహన్రావుకి కూతురు తనని ఒంటరిగా వదిలి ఉద్యోగం కోసం కెనెడా వెళ్లిపోవడం వల్ల రోజూ ఫోన్ ద్వారా కూతురి క్షేమసమాచారాన్ని తెల్సుకోవాలంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ నెససరీ అనిపించగానే, ‘ఏ ఫోన్ బాగుంటుంది, ఎక్కడ కొంటే మంచిది, ఏ షాపువాళ్ళు మోసం చేయకుండా వుంటారు’ ఇలాంటి వివరాలన్నీ తెల్సుకోడానికి ఓ నెల రోజులు పట్టిందతనికి. ఎమ్మే డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్ అయినా మోహన్రావుకి ఎలక్ర్టానిక్స్ విషయంలో ‘అ ఆ’లే తెలీవు. కనీసం కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్చుకోమని, బేసిక్ పరిజ్ఞానమైనా ఈ రోజుల్లో వుండాలనీ స్నేహితులు ఎంత చెప్పినా పెడచెవిన పెట్టేశాడు. ఇప్పుడు మొబైల్ కొన్నాక దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెల్సుకోవాలంటే చాలా కష్టం అనిపించిందతనికి, ఎస్సెమ్మెస్ ఇవ్వడం, ఫోన్ బుక్‌లో నెంబర్ ఫీడ్ చేసుకోవడం అతనికి కత్తిమీద సాముగా తోచి, అలాంటి విషయాలకి స్నేహితులపై ఆధారపడడమే మంచిదనిపించింది. ఎప్పుడూ జేబులో పాకెట్ ఫోన్ డైరీ వుంచుకుని ఎవరికైనా ఫోన్ చేయాలనుకున్నప్పుడు ఆ డైరీ తీసి నెంబరు నొక్కి ఫోన్ చేసే మోహన్రావుని అతని స్నేహితులు ఆటపట్టిస్తుంటారు. వాళ్ళు నవ్వినందుకు నొచ్చుకోకుండా వాళ్లతో తానూ శృతి కలిపేసి నవ్వేస్తాడు. కొందరైతే అతనికి ‘అమాయక చక్రవర్తి’ అని బిరుదాంకితం చేసేసారు కూడా.