‘‘ఏంది ఎల్లన్నా నువ్వనేది!చింతతోపు కాడ నాలుగురోజుల క్రితం మోహినీ పిశాచం చేతుల్లో చచ్చిపడివున్న ఈరిగాడు నీక్కనిపించేడా?’’ఆ మాటని కొండయ్య అడగడంఅది మూడోసారి.‘‘పొద్దుగాలే ఏమన్నా భంగుగానీతాగినావా ఏంది? ఆడు ఇందాకట్నుంచీ చెవిలో ఇల్లు కట్టుకునిమరీ చెప్తున్నాడు, ఈరిగాడు ఈరిగాడుఅంటూ! అయినా అదే మాట మళ్లీ మళ్లీఅడుగుతావేంది?’’ అని కసురుకుంటూడబ్బాచొక్కా జేబులోంచి గంట పుగాకుచుట్ట బయటికి తీశాడు గోవిందప్ప.‘‘గోవిందప్ప మావకి కోపం వచ్చినాది’’అంటూ పకాపకా నవ్వాడు పుల్లారావు.‘‘లేకపోతే ఏందిరా ఈడి నసుగుడూ..’’అంటూ దీర్ఘం తీస్తూ చుట్టని ఓసారిపరీక్షించి చూసి,టీకొట్టు సుబ్బణ్ణి నిప అడిగాడు.ఒక్కపెట్టున గాలి వీస్తే కూలిపోయేట్టు వుంది టీకొట్టు పెట్టిన ఆ పూరిపాక. అక్కడక్కడ తాటాకులు సగం సగం వూడిపోయి, పాక చూరులోంచి బయటికి వేలాడుతున్నాయి.చలిగాలి రివ్వున కొడుతోంది.ఆ గాలి వేగానికి తాళం వేస్తున్నట్టుగా చూరులోని తాటాకులు శబ్దం చేస్తున్నాయి.పాకని ఆనుకుని వుంది, పెద్ద వేప చెట్టు. దాని చుట్టూ కూర్చోడానికి వీలుగా పెద్ద రాతిబండ వుంది. ఆ ఊరివాళ్లకి అదే రచ్చబండ. 

ఆ పల్లెలోని సమస్యల్ని, గొడవల్ని టీలు తాగుతూ తీర్చేది అక్కడే. వ్యక్తిగత విషయాలనీ, లోకాభిరామాయణాన్నీ చర్చించుకునేదీ అక్కడే.టీకొట్టు సుబ్బడు నిప తెచ్చి గోవిందప్ప చుట్ట వెలిగించాడు.ఆనందాన్నంతా ముఖంలోకి తెచ్చిపెట్టుకుని, చుట్టపొగను గట్టిగా లోపలికి పీల్చాడు. రెండు క్షణాల తర్వాత ఎంతో హాయిగా ఫీలవుతూ పొగను రైలింజను పొగలా బయటికి వదిలాడు గోవిందప్ప. ‘‘గంట పొగాకంటే గంటపొగాకేరా! దీనబ్బ, చుట్టంటూ తాగితే ఇట్టాంటిదే తాగాలిరా! తస్సాదియ్యా, అమృతం తాగినట్టుంది!’’ అంటూ హుషారుగా వాళ్లవైపు చూశాడు. ‘‘ఇపడు చెప్పరా ఎల్లన్నా, ఈరిగాడు నీకు ఎక్కడ కనిపించాడు?’’ అన్నాడు.వాళ్లంతా తెల్లముఖాలు వేసుకుని చూస్తున్నారు. అప్పటివరకూ మళ్లీ మళ్లీ చెప్పవద్దంటూ కొండయ్యని కసురుకుని కరిచినంత పనిచేసిన గోవిందప్ప, మళ్లీ అదే మాట అడిగేసరికి వాళ్లందరికీ నోట మాట రాలేదు.‘‘ఏందిరా ఎవడూ మాట్టాడ్డూ, మీ అందరికీ నోళ్లుపడి పోయాయా ఏంది’’ అని గోవిందప్ప అనేసరికి, కొండయ్యకి పౌరుషం పొడుచుకొచ్చింది.గోవిందప్ప ఆ ఊరు అంతటికీ పెద్ద తలకాయ. ఊరు సమస్యల్ని రచ్చబండ దగ్గర చర్చకు పెట్టి, చెరిగేసేది ఆయనే. అందుకే గోవిందప్ప అంటే అందరికీ గౌరవం కంటే భయం ఎక్కువ, వెనకా ముందు చూడకుండా అమ్మనా బూతులూ తిడతాడని! అయినా కొండయ్య వూరుకోలేదు. ‘‘మళ్లీ మళ్ళీ అడుగుతావేందిరా అని చెప్పిందీ నువ్వే! ఈరిగాడు ఎక్కడ కనిపించేడురా అని అడిగేదీ నువ్వే!’’ అంటూ నసిగాడు.