మా ఊర్లె గాంది గురించి ఎర్కలేనేదు. ఉంటే ఉన్నడేమో గని చిందు చిత్తారి గురించి ఎర్కలేనోడు ఎవ్వడు లేడు. ఆకర్కి బుడ్డ పోరగాల్లకు గూడ గాదు ఎర్కే చిందుచిత్తారి యేసం గడుతున్నదంటె మా ఊరంత బాగోతం కాడనే వుంటది. గాడుపాటలు, పద్దెంలు జెహత్రీస్గ బాడ్తడు. రాముని గురించి గాదు పాట బాడ్తె రాముడు మన కండ్ల ముంగట్కి వొస్తడు. కిష్నుని గురించి గాడు పద్దెం బాడ్తె ముర్లి పాట మనకు ఇనబడ్తది. సత్తె ఆరిచ్చంద్ర డ్రామల గాడు చెంద్రమతి ఏసం గట్టి పాట బాడ్త ఏడ్వనోడు వుండడు. గాడు గిన జోల పాట బాడ్తె ఉయ్యాలలోని బుడ్డపోరగాల్లె గాకుంట పెద్దోల్లు గూడ పండుకుంటరు. మంచిగ పాడుడె గాకుంట గాడు జెహత్రీస్గద డాన్సుజేస్తడు.

చిత్తారి అచ్చం వైసు పోరి లెక్క ఉంటడు. వైసు పోరి లెక్కనే మాట్లాడ్తడు. అచ్చం ఆడోల్ల తీర్గనే తింపుకుంట నడుస్తడు. కొంతమంది కొంటె పోరగాల్లు గాన్ని ఆడిబట్లోడని అంటుంటరు. పారిజాతపహరణం బాగోతంల గాడు సత్యబామ ఏసం గడ్తడు. మోహిని బస్మాసుర బాగోతంల మోహిని ఏసం గాడే ఏస్తడు. బాలనాగమ్మ బాగోతంల బాలనాగమ్మ ఏసం గాడె గ డ్తడు. బాగోతం ఆడెటపడు కర్మ బాగోతుల్లెక్క గాడు తయ్యకు తాథిమి తాకు తా థిమి తయ్యకు తాథిమి తా అన్కుంట అడ్డగోల్గ ఎగ్రడు. ముద్దగ డాన్సు జేస్తడు.చిత్తారి కర్రెగుంటడు. కర్రెగున్నా గాని మొకంల కళ ఉన్నది. గాని కండ్లు తామర పువ్వు రిక్కల్లెక్క ఉంటయి. బాగోతంల కండ్లతోటే గాదు మాట్లాడుతుంటడు. గాడు ఆడోల్ల లెక్క చేతులు తింపుకుంట మాట్లాడ్తడు. ఆడోల్ల లెక్కనే మూతి దిపతడు. గాడు మొగల్లోతోని ఎక్వ మాట్లాడడు. ఆడోల్లతోనే ముచ్చట బెడుతుంటడు. తొవ్వల మొగోల్లు ఎవ్వరన్న ఎదురైతె ఆడిపిల్ల లెక్క సిగ్గుబడుకుంట గాడు పక్కకు పక్కకు బోతడు.‘‘తిపకుంట యాడికి బోతున్నవ్‌ చిత్తారి’’ అని ఎవడన్న అడిగితె-‘‘అక్క తాన్కి బోతున్న బావా!’’ అనుకుంట గాదు ఎదురంగ ఏ ఇల్లు గండ్లబడ్తె గా ఇంట్ల జొర్రుతడు.